Aug 14,2022 14:47

అనగనగా ఓ అడవిలో చాలా జంతువులు ఉండేవి. రెండు రోజులకోసారి సమావేశం అవుతుండేవి. అయితే నెమలి మాత్రం వీటికి దూరంగా ఉండేది. ఎవరితోనూ కలవకుండా ఎప్పుడు చూసినా చెట్టు మీద ఎక్కి, అక్కడ నుంచి ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉండేది. దాని ప్రయత్నాన్ని చూసి అన్ని జంతువులూ వేళాకోళం చేస్తుండేవి.
ఆకాశంలో మబ్బులొచ్చి, తనకి ఆనందం కలిగినపుడు పురివిప్పి నర్తించేది. దీంతో నెమలి తన అందం చూసుకుని గర్వపడుతోందని జంతువులు అనుకునేవి. తమ సమావేశాలకి, విందులకి నెమలిని ఆహ్వానించడం మానేశాయి.
అయినా నెమలి ఏం బాధపడలేదు. రోజూ దూరంగా వెళ్లి చెట్టు మీద నుంచి ఆకాశంలో మరింత ఎక్కువ దూరం ఎగరాలని, రోజురోజూ ఆ దూరం మరింత పెంచుకోవాలని పట్టుదలగా కష్టపడేది. అందులోనే ఎంతో ఆనందాన్ని అనుభవించేది. మిగిలిన జంతువులకి అదంతా ఎంతో వినోదంగా వుండేది. పడి పడి నవ్వుకునేవి. వేళాకోళం చేస్తూనే వుండేవి.
ఒకరోజు కొన్ని లేళ్లు గుంపుగా మంచినీరు తాగడానికి బయల్దేరాయి. ఇంతలో పొదలచాటున మాటు వేసిన చిరుతపులి హఠాత్తుగా ఒక్క గెంతు గెంతి, లేళ్ల గుంపు వైపు వచ్చింది. అవన్నీ భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి.
ఆ గుంపులో ఓ లేడి వెనుక పడింది చిరుత. లేడి ప్రాణ భయంతో ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని, పరుగందుకుంది. ఎలాగైనా లేడిని చంపాలని పులి పరిగెడుతోంది. ఇదంతా చెట్టు మీద నుంచి నెమలి చూసింది. ఆ లేడిని ఎలాగైనా రక్షించాలనుకుంది.
'మిత్రమా! తిన్నగా పరిగెట్టకు, చెట్ల చుట్టూ, పొదల చుట్టూ వీలైనన్ని మలుపులు తీసుకుని పరిగెట్టు' అని అరవసాగింది. ఆ అరుపులు లేడి చెవిలో పడ్డాయి. చెట్లు, గుట్టలు, పుట్టలు చుట్టూ తిరుగుతూ చిరుతపులికి అందకుండా ప్రాణాలు దక్కించుకుంది.
చిరుతపులి నిరుత్సాహంగా వెనక్కి వెళ్లిపోయింది. లేడి ఆనందంగా నెమలి దగ్గరకు వచ్చింది. 'మిత్రమా! కతజ్ఞతలు నీకు. ఈరోజు నా ప్రాణాల్ని రక్షించావు. అసలు అలా ఎందుకు పరిగెట్టమన్నావు? కుతూహలంగా అడిగింది.
'చిరుతపులి చాలా వేగంగా పరుగులు తీస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ అది పరుగు పెడుతున్నప్పుడు వెంట వెంటనే దిశను మార్చుకోలేదు. అది చిరుతపులి బలహీనత. అదే నీ ప్రాణ రక్షణకి ఉపయోగించాను అంతే' అంది నెమలి.
లేడి ఆప్యాయంగా నెమలివైపు చూస్తూ 'నీకు అహంకారం అనీ, అందరికీ దూరంగా వుంటావనీ ఎప్పుడూ ఎగతాళి చేసేవాళ్లం. నీకు నామీద కోపం లేదా?' అని అడిగింది.
'లేదు మిత్రమా! నాకు ఎవరి మీదా కోపం లేదు. మీరంతా అనుకుంటున్నట్టు నాది అహంకారం కాదు.. ముందుచూపు. మీరంతా నా అందమైన పింఛాన్నే చూస్తున్నారు. దానివల్ల నాకొచ్చే ఇబ్బందులు మీకు తెలీదు. హఠాత్తుగా మీదపడే శత్రువుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ పెద్ద పింఛం కారణంగా వేగంగా పరిగెత్తలేను. చెట్ల మీద దాక్కున్నా, వేటకుక్కలు, పులులు దాడి చేస్తాయి. అందుకోసం నిరంతర పోరాటం తప్పదు. అందుకే మిగిలిన పక్షుల్లా గాల్లో ఎక్కువసేపు ఎగిరే ప్రయత్నం చేస్తున్నాను. ముందుకన్నా చాలాసేపు ఎగరగలుగుతున్నాను. ఇంకా ఎక్కువసేపు ఎగరాలి.. తప్పకుండా విజయం సాధిస్తాను!' అంది నెమలి గొప్ప ఆత్మవిశ్వాసంతో.
తన తప్పును గ్రహించిన లేడి, ఎవరి మీదా దురభిప్రాయం ఏర్పరచుకుని, హేళన చేయకూడదని తెల్సుకుంది. అలాగే తనని తాను నిరంతరం తీర్చిదిద్దుకుంటూ, అప్రమత్తతతో జీవించాలని నిర్ణయం తీసుకుంది.
 

-స్వర్ణ శైలజ
85006 32936