Nov 09,2022 07:11

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టంగా తేల్చిచెప్పారు. రైల్వే జోన్‌ ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో ఉంది. జోన్‌ కావాలంటే డివిజన్‌ వదులుకోవాలని షరతు పెడుతున్నది. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మరోసారి ఉత్తరాంధ్ర గడ్డపై అడుగు పెడుతున్న మోడీని నిలదీయాలి. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేయాలి. హామీలు అమలు చేయకుండా తెలుగు గడ్డపై అడుగు పెడితే సహించబోమని హెచ్చరించాలి.

వంబరు 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విశాఖకు విచ్చేస్తున్నారు. ఇదే విశాఖలో 2014లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను - విశాఖ రైల్వే జోన్‌, గిరిజన యూనివర్సిటీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర అంశాల అమలుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ వాగ్దానాలు చేసి ఇప్పటికి ఎనిమిదేళ్ళు పూర్తయింది. అయినా ఆచరణలో అతీగతీ లేదు. ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టంగా తేల్చిచెప్పారు. రైల్వే జోన్‌ ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో ఉంది. జోన్‌ కావాలంటే డివిజన్‌ వదులుకోవాలని షరతు పెడుతున్నది. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మరోసారి ఉత్తరాంధ్ర గడ్డపై అడుగు పెడుతున్న మోడీని నిలదీయాలి. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేయాలి. హామీలు అమలు చేయకుండా తెలుగు గడ్డపై అడుగు పెడితే సహించబోమని హెచ్చరించాలి.
           చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మడానికి మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోంది. ఒకవైపు విశాఖ ప్రజలు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని మొత్తుకుంటుంటే మరోవైపు ప్రభుత్వ రంగాన్ని పునాదులతో సహా పెకిలించివేయడానికి మోడీ ప్రభుత్వం నడుం కట్టింది. సంవత్సరంన్నర కాలంగా విశాఖ ఉక్కు కార్మికులు నిరంతరాయంగా ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. వారికి మద్దతుగా విశాఖ నగర ప్రజలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెఎసిగా ఏర్పడి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ట్రేడ్‌యూనియన్లు ఐక్యంగా పోరాడుతున్నాయి. అయినా మోడీ వీటినేమీ లెక్క చేయడం లేదు. బంగారు బాతు లాంటి ఫ్యాక్టరీని కారు చౌకగా అదానీ పరం చేయాలని చూస్తున్నారు.
           ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగకుండా నివారించేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించగా బిజెపి బల్లలు చరుస్తూ బలపరిచింది. ఆనాడు బిజెపి ఒత్తిడితో కాంగ్రెస్‌ బిల్లు పెట్టింది. ఈ రెండూ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పూనుకున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుందన్న ఆశతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చదువుకున్న యువత మోడీపై నమ్మకంతో ఓటు వేశారు. నేడు మోడీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడిచారు. ఏ యువత కారణంగా మోడీ అధికారంలోకి వచ్చారో నేడు ఆ యువతరం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉంది. తమకు నమ్మకద్రోహం చేసిన మోడీకి పాఠం నేర్పాలని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ప్రత్యేక హోదా చట్టరీత్యా ఇవ్వడం సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు దీనికి ఆటంకంగా ఉన్నాయని బిజెపి అబద్ధాల ప్రచారం చేస్తున్నది. 14వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి తప్ప ప్రత్యేక హోదాకు ఎలాంటి సంబంధం లేదు.
         దేశంలో ఈపాటికే బడా కార్పొరేట్‌ సంస్థలకు పెద్దయెత్తున రాయితీలు ఇస్తున్నారు. లక్షల కోట్లు బ్యాంకు అప్పులు ఎగ్గొడుతున్నా ఏ చర్యా తీసుకోవడం లేదు. పన్ను ఎగ్గొడుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో ఎదురు రాయితీలు ఇస్తోంది. ఒకవైపు చట్టవిరుద్ధంగా బడా కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతూ, మరోవైపు ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీలు ఇవ్వాల్సి వస్తుందని సాకులు చెబుతోంది. నిజానికి ఇది ఆర్థిక సమస్య కాదు. రాష్ట్రం పట్ల రాజకీయ వివక్షత. ఈ రాష్ట్రంలో బిజెపి బలహీనంగా ఉంది. అధికారంలోకి ఎలాగూ రాదు. కాబట్టి ఎందుకు శ్రద్ధ పెట్టాలన్న ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల కేంద్రానికి గాని, ఇతర రాష్ట్రాలకు గానీ ఎలాంటి నష్టం జరగదు. ఇతర రాష్ట్రాలతో పోటీ తెస్తోంది. గతంలో బీహార్‌, జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలకు ఇలాగే ద్రోహం చేసింది.
ప్రత్యేక హోదాతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వచ్చే అవకాశముంది. ఈ రోజు ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలనేకం మూతపడ్డాయి. లేదా నష్టాల్లో మునిగి తేలుతున్నాయి. వీటిని గట్టెక్కించడానికి ప్రత్యేక హోదా ఒక సాధనం. ఈ రోజు అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది చిన్నతరహా పరిశ్రమలు. వాటికి ఆదరణ లేక మూత పడడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో టెక్స్‌టైల్స్‌, సహకార డెయిరీ, చక్కెర పరిశ్రమలు, పేపర్‌ మిల్లులు, ఆటో, రవాణా, లెదర్‌ బిజినెస్‌లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జిఎస్‌టి పన్నులు, విద్యుత్‌ ఛార్జీల భారం, చిన్న పరిశ్రమల పట్ల అధికారుల వేధింపులు పారిశ్రామికాభివృద్ధిని దెబ్బ కొడుతున్నాయి. పారిశ్రామిక రంగం నెగిటివ్‌ గ్రోత్‌ లోకి వెళ్ళిపోతోంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న బడా పెట్టుబడిదారులు ఎవరూ ఈ రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం లేదు. రాష్ట్ర సంపదను ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్నారు. అలా పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అభ్యర్ధించడం లేదు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండున్నర లక్షల ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా లాక్కున్నారు. ఇందులో 55 వేల ఎకరాలు మినహా మిగతాదంతా ఖాళీగా ఉంది. అందులో పరిశ్రమలు పెట్టరు. ఉపాధి కల్పించరు. చట్ట నిబంధనలు ఉల్లంఘించిన పారిశ్రామికవేత్తలపై చర్యలు ఉండవు. భూముల్ని తిరిగి పండించుకోవడానికి రైతులకూ ఇవ్వరు. అటు వ్యవసాయం పోయి, ఇటు పరిశ్రమలూ రాక వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలస బాట పడుతున్నారు. తాత్కాలికంగానైనా ఈ దుస్థితి నుండి బయట పడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదు.
           కానీ మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు - వామపక్షాలు మినహా - దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. 2019 ఎన్నికలకు ముందు సవాళ్ళు, ప్రతిసవాళ్ళు విసురుకున్న పార్టీలు ఇప్పుడు నోరెత్తడంలేదు. నాడు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. 2018 ఫిబ్రవరిలో వామపక్షాల పిలుపుతో అత్యంత జయప్రదమైన రాష్ట్ర బంద్‌ ప్రభావం ఈ పార్టీలపై పడింది. తెలుగుదేశం బిజెపి నుండి తెగదెంపులు చేసుకుని బయటకు రావాల్సిన స్థితిని ప్రజా ఉద్యమం కల్పించింది. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా సాధించుకొస్తామని జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ వాగ్దానం చేశారు. ఎంపీలను గెలిపించి ప్రజలు మాట నిలుపుకున్నారు. కానీ జగన్‌ మాట తప్పారు. దాని గురించి మాట్లాడడానికి కూడా సిద్ధపడడంలేదు. ఎన్నికల ముందు గాండ్రించిన తెలుగుదేశం ఇప్పుడు పిల్లి కూతలు కూడా కూయడం లేదు. నాడు బిజెపిని పాచిపోయిన లడ్డూతో పోల్చిన జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూలనే ఆరగించడానికి సిద్ధపడుతున్నారు. ఈ ముగ్గురూ ఇప్పుడు ప్రత్యేక హోదాని గంపలో పెట్టి దాచేశారు. దానిని బయటకు తీసుకువస్తే బిజెపికి కోపం వస్తుందని భయపడుతున్నారు. గతంలో తాము చెప్పిన మాటలనే ఇప్పుడు దిగమింగి ప్రత్యేక హోదా చర్చనీయాంశమే కాదంటున్నారు.
నాడు ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా చేసిన తెలుగు మీడియా నేడు ఆ సమస్యను ప్రస్తావించడానికి కూడా సిద్ధపడడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలకు వత్తాసుగా ఉన్న మీడియా ప్రజల ఎజెండాను తొక్కిపెట్టి తమ సొంత ఎజెండాలను ప్రజలపై రుద్దుతున్నది. ప్రత్యేక హోదా అంశం ముందుకు రాకుండా ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న కుయత్నాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి. ఇప్పటికైనా ప్రధాన మీడియా ప్రత్యేక హోదా ఎజెండాను ప్రధానంగా చేపట్టాలి.
           విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి. విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వలేమని రైల్వే బోర్డు బహిరంగంగా ప్రకటించినా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మాత్రం వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా రైల్వే జోన్‌కు ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించి ఇప్పుడు వెనక్కి తగ్గారు. రోజుకో మంత్రి తలా ఒక విధంగా ప్రకటన చేస్తూ ప్రజలను గందరగోళం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే నగదీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ల ప్రైవేటీకరణకు పూనుకున్నది. అందులో విశాఖ కూడా ఒకటి. ప్రభుత్వ ఖర్చుతో రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి పైసా ఖర్చు లేకుండా పెట్టుబడిదారుల హస్తగతం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నది. ఆధునికీకరణ తరువాత ప్లాట్‌ఫారం ఛార్జీలతో సహా ప్రయాణీకులపై ఛార్జీల భారం మోపుతారు. రైలు ప్రయాణమే కనాకష్టమవుతుంది. ఇప్పటికే గంగవరం పోర్టును మింగేసిన అదానీ మోడీ మద్దతుతో మొత్తం ఉత్తరాంధ్రనే హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. జగన్‌ దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చడానికి రాష్ట్ర ప్రజలు అనుమతించరాదు.
ప్రజలకు చెప్పింది ఒకటి. వారు చేస్తున్నది మరొకటి. ప్రజలు కోరుతున్నదొకటి. వారు మాట్లాడుతున్నది మరొకటి. రాష్ట్ర ఎజెండాను హైజాక్‌ చేసి ప్రజల చెవులో పూలు పెట్టడానికి మరొకసారి విశాఖపట్నం వస్తున్న ప్రధానిని రాష్ట్ర ప్రజలంతా నిలదీయాలి. రాష్ట్రంలో బిజెపి కి నిలువ నీడ లేకుండా చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన బిజెపి, మోడీ, కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి.

/వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి/
వి. శ్రీనివాసరావు

వి. శ్రీనివాసరావు