May 02,2023 07:34

పోరాడుతున్న సులభ్‌ కార్మికులకు సంఘీభావంగా సిఐటియు ప్రత్యక్షంగా మద్దతునిచ్చి నిలబడింది. సిఐటియు తప్ప ఏ సంఘమైనా పెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీతోనైనా ఉండండని కార్మికులపై అధికారులు, సులభ్‌ సేటు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రమైన ఒత్తిడిని తెచ్చాయి. టిటిడిలో అత్యంత బలహీనులైన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈ స్థాయిలో దాడికి పాల్పడటం సమంజసమా ? అని నాగరిక సమాజం టిటిడిని ప్రశ్నిస్తున్నది.

ఘనత వహించిన తిరుమల-తిరుపతి దేవస్థానాల ఇ.ఓ ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, టిటిడి లోని ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ఆదివారం నాడు తిరుమల కొండపై చీపుర్ల్లు పట్టి పారిశుధ్య పనులలో భాగస్వాములయ్యారు. తాము చేతబట్టింది చీపురు కాదని, కార్మికుల మెడపై పెట్టిన కత్తి అనే విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు విస్మరించారు. తిరుమల కొండపై కార్మికుల సమ్మె నేపథ్యంలో ఇ.ఓ నుంచి సాధారణ ఉద్యోగి వరకు పారిశుధ్య పనులలో భాగస్వాములవ్వాలని టిటిడి ఇ.ఓ ఆదేశించారు. ఈ పనిని ఓ దైవ కార్యక్రమంగా, దేవుడి చెంత అసౌకర్యాలను తగ్గించే శక్తులుగా తమను తాము వెల్లడి చేసుకోవటానికి అధికారులు ఉత్సాహపడుతున్నారు.
టిటిడి లోని అధ్యాపకులు శాశ్వత ఉద్యోగులు, డిప్యూటీ ఇ.ఓ లకు పారిశుధ్య పనులు నెల రోజులు కేటాయించబడ్డాయి. ఉద్యోగులు తమ విధులను మానుకొని తిరుమల కొండపై చీపురు, చేట చేతబట్టి పారిశుధ్య పనులలో నిమగమై ఉండాలని యాజమాన్యం ఆదేశించింది. ప్రస్తుతం ఈ పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
మల, మూత్రాలు శుద్ధి చేయాల్సిన చోట మున్సిపల్‌ కార్మికులు, పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న కృషిని టిటిడి ఇ.ఓ అభినందించారు. సమ్మెలో వున్న సులభ కార్మికులపై అన్నివైపుల నుంచి విషం కక్కటానికి ఒక పథకం ప్రకారం టిటిడి యాజమాన్యం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. దేవుని దగ్గర సమ్మెకు పూనుకోవటం ఏమిటి? దేవుడు వీళ్లని క్షమిస్తాడా? ముందస్తు సమాచారం ఇవ్వలేదని కొత్త పల్లవిని అందుకున్నారు.
2021వ సంవత్సరంలో టిటిడి ఎఫ్‌.ఎం.ఎస్‌ కార్మికులు 14 రోజులపాటు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. తుఫానుతో తిరుపతిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, కార్మికులు రేయి, పగలు తేడా లేకుండా 24 గంటలు టిటిడి పరిపాలనా భవనం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాటి ఇ.ఓ జవహర్‌ రెడ్డి కార్మికుల ఉద్యమం పట్ల కఠిన వైఖరి అవలంభించారు. సమ్మె మాని విధులకు హాజరైతే తప్ప చర్చలు లేవని మంకుపట్టు పట్టారు. కార్మికులు ఏమాత్రం సడలింపు ఇవ్వకుండా నిరసన కొనసాగించారు. సిఐటియు నేతలతో చర్చలు లేవు. కార్మికులు నేరుగా వస్తే మాట్లాడతామని మొండి వాదనలు చేశారు. ఆఖరుకు చర్చలకు హాజరైన కార్మికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశారు. విధిలేక 14వ రోజున కార్మికులపై పోలీసులను ఉసిగొల్పి లాఠీఛార్జి చేయించారు. తీవ్ర గాయాలతో కార్మికులు అరెస్టయ్యారు. నిర్బంధాన్ని లెక్కచేయక, రోడ్లపై కూడా ఉండనివ్వని పరిస్థితిలో నాడు సిఐటియు కార్యాలయం కేంద్రంగా కార్మికులు సమ్మెను కొనసాగించారు. విధి లేని పరిస్థితుల్లో అధికారులు దిగివచ్చి ఐ.ఎ.ఎస్‌ లతో కూడిన కమిటీని ఏర్పరచి, నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులతో ఒప్పందానికి వచ్చారు.
2021 అక్టోబర్‌లో వేసిన కమిటీ నేటివరకు సమావేశం కాలేదంటే కార్మిక సమస్యల పట్ల టిటిడి యాజమాన్య నిర్లక్ష్యం అర్థం అవుతుంది. 2023 ఏప్రిల్‌ నెలలో సులభ్‌ కార్మికులు సామూహిక సమ్మెకు అనివార్యమై పూనుకున్నారు. తమ వైఫల్యం కారణంగానే సమ్మె జరుగుతుందన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి, దేవుని దగ్గర సమ్మెలేమిటని అధికారులు దబాయిస్తున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన టిటిడి ఉన్నతాధికారులు వాటికి తిలోదకాలిచ్చి చీపుర్లు చేతబట్టారు. తాము పట్టింది చీపురు కాదని, కార్మికుల మెడపై పెట్టిన కత్తి అని ఉద్యోగులు గమనించాలి. సులభ్‌ కార్మికులు, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులు, శాశ్వత ఉద్యోగుల మధ్యన చిచ్చు పెట్టేందుకు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదన్న వాస్తవాన్ని ఉద్యోగ, కార్మికులు గమనించాలి.
నోరు, వాయి లేని సులభ్‌ కార్మికులతో మేము చర్చించడం ఏమిటి? వారు ఏజెన్సీకి సంబంధించిన వారు, వారి సౌకర్యాలు వారే చూసుకోవాలి. తమకు ఏం సంబంధమని మాట్లాడుతున్నారు. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్న చోట తమకు సంబంధం లేదని ఇ.ఓ చట్టవ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ సమస్యకైనా ప్రిన్సిపల్‌ ఎంప్లాయర్‌ టిటిడిదే బాధ్యతని చట్టం చెబుతున్నా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు మాట్లాడటం మరీ అన్యాయం.
టిటిడిలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు ప్రకటించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు నోరు మెదపటం లేదు. బోర్డు ఛైర్మన్‌ హోదాలో కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన వై.వి.సుబ్బారెడ్డి అగుపడటం లేదు. 2021 అక్టోబర్‌లో వరద ప్రాంతాలను సందర్శించటానికి తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి 24 గంటలలో తన హామీ అమలవుతుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి వచ్చి, వెళ్లి ఒకటిన్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ 24 గంటలు మాత్రం ఇంకా గడవలేదు.
పాతికేళ్లకు పైగా సులభ్‌లో పనిచేస్తున్న కార్మికులు తమకు వేతనాలు పెంచాలని, లడ్డూ కార్డు, గుర్తింపు కార్డులు కావాలని కోరుతూ రోడ్డెక్కారు. కాంట్రాక్టు విధానంతో సంబంధంలేని లక్ష్మి, శ్రీనివాసా కార్పొరేషన్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. టిటిడి ఆధ్వర్యంలోని స్విమ్స్‌, ఆయుర్వేద హాస్పిటల్‌లో పారిశుధ్య కార్మికులను కార్పొరేషన్‌లో కలిపి, తిరుమల కొండపై దేవుని చెంత పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను విలీనం చేయకుండా, కాంట్రాక్ట్‌ వ్యవస్థలోనే కొనసాగించటం కార్మికుల ఆగ్రహానికి కారణం. బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులకు సేవలందించి, పారిశుధ్య పనులు చేపడుతున్న ఎఫ్‌ఎంఎస్‌, సులభ్‌ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని నిరాకరిస్తున్నారు. తాము లడ్డూ, వడకు కూడా అనర్హులమయ్యామా? ఏమిటీ వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా అధికారులు నీళ్ళు నములుతున్నారు.
తమను కార్పొరేషన్‌లో కలపమంటున్న సులభ్‌, ఎఫ్‌.ఎం.ఎస్‌ కార్మికులను కలపకుండా, కార్పొరేషన్‌లో కలపవద్దు మొర్రో అంటున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కార్పొరేషన్‌లో బలవంతంగా కలిపారు.
905 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికులది మరో గోడు. 362 మంది టిటిడి అటవీ కార్మికులకు 2019వ సంవత్సరంలో టైమ్‌ స్కేలు అమలు పరుస్తున్నట్టు టిటిడి బోర్డు తీర్మానించింది. ఆచరణలో బోర్డు తీర్మానాన్ని అమలు పరచకుండా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పారని 162 మంది కార్మికులను టిటిడి పర్మినెంటు చేసింది. సిఐటియులో ఉన్న 200 మంది కార్మికులను పర్మినెంటు చేయకపోగా, బోర్డు తీర్మానం ప్రకారం టైమ్‌ స్కేలు అమలు జరపలేదు. చివరకు వీరందరిని కార్పొరేషన్‌లో కలవాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు, దేవస్థానం 'లా' అధికారి, టిటిడి అధికారిక న్యాయవాదులు సైతం అటవీ కార్మికుల పట్ల వివక్ష మంచిది కాదని రాతపూర్వకంగా హెచ్చరికలు చేసినా, టిటిడి యాజమాన్యం పెడచెవిన పెడుతున్నది.
ఏతా వాతా టిటిడిలో తాజాపరిస్థితి ఏమంటే ఎక్కడీ ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అత్యంత అమాయకులు, పేదలు, దళితులైన కార్మికుల కష్టాల గురించి పట్టించుకొని చర్చించడం మాట అటుంచి అన్నివైపుల నుంచి ఈ కార్మికులపై దాడికి పూనుకుంటున్నారు.
టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టిటిడి ఇ.ఓ, జిల్లా కలెక్టర్‌, ఎస్‌.పి లు సంయుక్తంగా తిరుమల కొండపై ఉద్యోగులు, అధికారులు, మీడియాతో ఆత్మీయ సమావేశం పేరిట ఈ పేద కార్మికులపై విరుచుకుపడ్డారు. కసరత్తు చేసిన కండల వీరుడు మూలనున్న ముసలమ్మపై దాడి చేసినట్టు అత్యున్నత అధికారాలు కల్గిన ఐఎఎస్‌, ఐపిఎస్‌లు గొంతులేని సులభ్‌ కార్మికుల గొంతు నొక్కుతున్నారు.
పోరాడుతున్న సులభ్‌ కార్మికులకు సంఘీభావంగా సిఐటియు ప్రత్యక్షంగా మద్దతునిచ్చి నిలబడింది. సిఐటియు తప్ప ఏ సంఘమైనా పెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీతోనైనా ఉండండని కార్మికులపై అధికారులు, సులభ్‌ సేటు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రమైన ఒత్తిడిని తెచ్చాయి. టిటిడిలో అత్యంత బలహీనులైన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈ స్థాయిలో దాడికి పాల్పడటం సమంజసమా? అని నాగరిక సమాజం టిటిడిని ప్రశ్నిస్తున్నది.
మానవ సేవే-మాధవ సేవ అని ప్రచారం చేసే చోట మల, మూత్రాలను శుద్ధి చేసి వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతున్న వారి పట్ల టిటిడి వైఖరి అమానవీయం. ధర్మాన్ని రక్షించండి-ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసే టిటిడి అన్యాయానికి గురవుతున్న కార్మికులకు అండగా నిలవాల్సిన తరుణమిది.

(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు,
సెల్‌: 94900 98840 )
కందారపు మురళి

కందారపు మురళి