Jan 08,2023 10:13

ఏ కన్నతండ్రీ కంటపడకూడని అసహ్య దృశ్యం, ఏ కన్నతండ్రీ సహించలేని దాష్టీకం.. రమణారావు క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. కళ్ళజోడు తుడిచి చూశాడు. కళ్ళు రెండూ చేతుల్తో నులిమికొని మరీ చూశాడు.
అవును.. వాడు అక్షరాలా రాఘవే. తన కన్నబిడ్డ. తన అనురాగానికి చిహ్నంగా పుట్టిన గారాల కొడుకు. అందరిలాంటి వాడు కాదని తను మనసావాచా నమ్మిన క్రమశిక్షణాపరుడు. తను చేస్తున్న అవినీతి నిర్మూలనోద్యమానికి సరిగ్గా పోలిక ఇవ్వదగిన ఆదర్శ యువతరంగం.
ఆ తరంగాన్నేనా తనిప్పుడు చూస్తున్నది? గోల్కొండ శిథిలాల మధ్య వొక కన్నెతనాన్ని శిథిలం చేస్తున్న వీడు రాఘవేనా..?
ఎవరా అమ్మాయి..? వీడిది ప్రేమా..వ్యామోహమా.. ఇదే వీడి జీవితమా? ఆ అమ్మాయి.. యవ్వనాన్ని అమ్మకానికి పెట్టుకున్న అంగడి బొమ్మా? ఆ పదహారేళ్ళ ప్రాయంలో గుడ్డినమ్మకమే కానీ యవ్వనం అమ్ముకోవడమనే భావాన్ని అంగీకరించలేకపోయాడు రమణారావు. ఆ కమ్ముకున్న సిగ్గు తెరలు, చనువుగా ఆ వారింపులు, వొళ్ళంతా అల్లుకున్న నిగారింపులూ.. అన్నీ కలబోసి ఆమె జీవిత నేపథ్యానికి అద్దం పడుతుంటే, ఆ పక్కనే ఉన్న పుస్తకాలు ఆ అమ్మాయి కాలేజీ చదువుతోందని అడక్కుండానే సాక్ష్యమిస్తున్నాయి.
ఆ మాటకొస్తే రాఘవా కాలేజీయే. ఇంటర్లో జిల్లాలోనే ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకున్నాడు. కాబట్టే కార్పొరేట్‌ కాలేజీలో పిలిచి మరీ సీటిచ్చారు. అక్కడా తన స్థాయిని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. అలాంటి రాఘవలో మరో కొత్త మనిషి అంతరంగికంగా నివాసముంటున్నాడని ప్రత్యక్షంగా చూసినప్పుడుగానీ అర్థంకాలేదు రమణారావుకి. కెమెరా క్లిక్‌ మన్న శబ్దానికి ఉలిక్కిపడి, తల తిప్పి చూశాడు. కపూర్‌.. తన అసిస్టెంట్‌.. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ యాంటీకరప్షన్‌. తను చూస్తున్న దృశ్యాన్నే సెల్‌ కెమెరాతో క్లిక్‌ చేశాడు. అతడికి తెలీదు అక్కడున్న అబ్బాయి తన బాస్‌ కన్నకొడుకేనన్న సంగతి.
'డర్టీ ఫెలోస్‌.. ఇంత గొప్ప హిస్టారికల్‌ మాన్యుమెంట్‌ని సెక్స్‌ సుఖాల కేంద్రంగా వాడుకుంటున్నారు. ఇలాంటి వెధవలే సార్‌! రేపు ఆ అమ్మాయి నలుగుర్లో నోరు విప్పుతుందేమోనని యాసిడ్‌ పోసి చంపేస్తుంటారు. రేపేదైనా జరిగితే పోలీసు డిపార్ట్మెంట్‌కి క్లూగా ఉపయోగపడుతుందనే క్లిక్‌ చేశాను' అంటూ ఆవేశపడిపోయాడు కపూర్‌.
'ఊ.. ఊ.. ఎస్‌.. ఎస్‌.. డన్‌ ఎ రెస్పాన్సిబుల్‌ జాబ్‌..' అంటూ తలతిప్పుకున్నాడు రమణారావు, కపూర్‌ తన ముఖంలోని రంగుల్ని చదువుతాడేమోనని.
'సార్‌..' సరిగ్గా అప్పుడే క్లయింట్‌ వచ్చాడు.
'ఆ.. చెప్పు.. వచ్చాడా?' అంటూ ఆదరాబాదరాగా ప్రశ్నిస్తున్న బాస్‌ గొంతు వణకడం తొలిసారి గమనించాడు కపూర్‌.
'ఇంకా రాలేదు సార్‌! కానీ అదిగో ఆ మొండిగోడ దగ్గరికే వస్తానన్నాడు. నన్నక్కడ ఉండమంటారా సార్‌!?' అనడిగాడు లంచం ఇవ్వడానికి వచ్చిన క్లయింట్‌. తన అక్రమ కట్టడాన్ని సరైందిగా చూపడానికి పాతిక వేలు లంచం అడిగిన రీజనల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ పైన కంప్లైట్‌ చేశాడతను.
'ఓ.కే. అక్కడే ఉండు' అని అతణ్ణి పంపించేసి, కపూర్‌తో అన్నాడు రమణారావు 'మిస్టర్‌ కపూర్‌! ఈ కేసు మీరే పర్సనల్‌గా డీల్‌ చేయండి. నాక్కొంచెం పనుంది. నేను ఆఫీసులో కలుస్తాను'.
అతడి జవాబు కోసం ఎదురుచూడలేదు రమణారావు. ఆ శిథిలాల వైపు చూడకుండానే వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు. గోల్కొండ నుంచి ఆఫీసుకి వెళ్ళలేదు రమణారావు.

                                                                                  ***

'ఏరా ఇవ్వాళా తాగొచ్చావా?' భర్త వింటాడని గుసగుసలాడింది భానుమతి. అతను డ్యూటీలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అవినీతి నిర్మూలనాధికారే. ఆ విషయం భార్యగా కంటే అతణ్ణి దగ్గర్నుంచి చదివిన మనిషిగా బాగా తెలుసామెకి. అందుకే స్వరం తగ్గించి మరీ అడిగింది.
'అబ్బా.. ఫోన్‌ చేసి నీకు చెప్పాను కదమ్మా. ఇవాళ రవిగాడి బర్త్‌ డే, బీర్లు వోపెనౌతాయని' సమాధానం చెప్పడానికి ఎంత విసుగో రాఘవకి.
'సర్లే.. శబ్దం రాకుండా అన్నీ పెట్టుకుని తిని, నిద్రపో. ఆయనకి తెలిస్తే గుండె పగిలిపోతుంది.
'నీకిష్టమని గుత్తొంకాయ చేశాను. మరింత వేసుకుని తిను'. తల్లి గుండెకి మమకారం ఎక్కువ. తండ్రి గుండెకి కారుణ్యం తక్కువ. వొకరు కడుపు చూస్తే, మరొకరు క్రమశిక్షణ చూస్తారు. బహుశా కుటుంబమంటే ఆ రెండు దృక్పథాల అమరికేనేమో.
'పీకలదాకా మెక్కేసొచ్చానమ్మా! ఇంక తినలేను' మాట తూగుతున్నాడు రాఘవ.
'రోజూ ఇదే వరసై పోయిందిరా నీకు. రేపట్నుంచి రాత్రిళ్ళు నీ కోసం వంట చేయను' అన్నదే కానీ, భానుమతి రేపు కూడా రాఘవ కోసం వంట చేస్తుంది. అదే కదా తల్లి ప్రేమ.
రాఘవ మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళేదాకా భర్త గది వైపూ, కొడుకు వైపూ తల తిప్పి తిప్పి చూస్తూనే ఉంది భానుమతి. భర్త వినే అవకాశమే లేదన్నది ఆమె భావన.
కానీ తలుపు చాటు నుంచి కొడుకు విశ్వరూపాన్ని దర్శించుకున్నాడు రమణారావు. గుండెల్లో వొక తుఫాను. ఆలోచనల్లో వొక ప్రభంజనం. ఓ కన్నతండ్రికీ, ఓ అవినీతి నిర్మూలనాధికారికీ మధ్య హోరాహోరీ సంఘర్షణ. తన దృష్టిలో కన్న కొడుక్కీ అవినీతి అధికారికీ వేర్వేరు రూల్సు లేవు. ఇద్దరూ దోషులే.. చేసింది నేరమైనప్పుడు.
భానుమతి భర్త గదిలోకి అడుగుపెట్టేసరికి రమణారావు డ్రస్‌ సర్దుకుంటూ కనిపించాడు. ఎక్కడికని అడగాలనుకొని పెదాల దాకా వచ్చిన మాటని వెనక్కి తీసుకుంది. తనకి అర్ధరాత్రిళ్ళూ.. అపర రాత్రిళ్ళూ.. ఇలా వెళ్ళడం మామూలే. ఆ లంచమడిగేవాడు ఏ ఉదయమో, సాయంత్రమో అడిగి చావడు. ఏ అర్ధరాత్రో, ఏ ఊరి చివరి క్లబ్బులోనో తెచ్చివ్వమంటాడు. ఆ ఇచ్చేవాడు గుట్టుగా ఇచ్చి, పని చేయించుకోడు. పట్టిచ్చి మరీ పని చేయించుకోవాలనుకుంటాడు. దానివల్ల సాధించేదేవిటో ఎంత ఆలోచించినా భానుమతికి ఎప్పుడూ అర్థంకాలేదు. గ్యారేజీలోంచి కారు తీసి, తనే గేటు తెరుచుకొని, కారు గేటు దాటాక దిగి, మళ్ళీ గేటు యథాప్రకారం మూసేసి, కారు ముందుకు పోనిచ్చాడు రమణారావు. రాత్రి పదకొండున్నర సమయం. అయినా తన అసిస్టెంట్‌ కపూర్‌కి ఇబ్బంది కలిగిస్తున్నానేమో అనుకోలేదు. మొబైల్‌లో నెంబర్‌ డయల్‌ చేశాడు.
'హలో సార్‌!' నిద్రమత్తు ధ్వనించినా తన నెంబరు చూశాడని అర్థమైపోయింది.
'సారీ కపూర్‌! అర్ధరాత్రి డిస్టర్బ్‌ చేస్తున్నాను. నువ్వు గోల్కొండలో క్లిక్‌ చేసిన ఫోటో ఇప్పుడే నాకు ఫార్వర్డ్‌ చేయగలవా? ప్లీజ్‌! డూ ఇట్‌' రిక్వెస్టింగ్‌గానే ఆర్డర్‌ చేశాడు.
'అలాగే సార్‌!' మరో నిమిషానికంతా తన మొబైల్‌లో మెసేజ్‌ ఎంట్రీ వచ్చేసింది. ఆ ఫోటో చూడగానే మరోసారి నెత్తురు ఉడికిపోయింది రమణారావుకి.
'డామిట్‌..' కారు వేగం మరింత పెంచాడు.
టూ టవున్‌ ఇన్‌స్పెక్టర్‌ ముఖంలో ఆశ్చర్యం.
'అదేమిటి సార్‌! ఏదో యంగ్‌బారు.. వయసులో ఉన్నాడు.. ఆవేశపడి చిన్న పొరపాటే చేశాడనుకోండి. కన్నతండ్రిగా మీరే కొడుకు మీద కంప్లైంట్‌ ఇవ్వడం.. మరోసారి ప్రశాంతంగా ఆలోచించండి సార్‌!' ఆ మాటకొస్తే ఇన్‌స్పెక్టరూ ఇద్దరు బిడ్డల తండ్రే!
'ఇన్‌స్పెక్టర్‌ గారూ! వాడిని కన్నతండ్రి కంటే ముందే నేను అవినీతి నిరోధక శాఖాధికారిని. నాకు ఉద్యోగ బాధ్యతే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉంది. ప్రేమను దుర్వినియోగం చేయడం కూడా అవినీతే.. అందుకే అవినీతి నిరోధక శాఖాధికారిగా మీకు సాక్ష్యంతో సహా కంప్లైంట్‌ ఇస్తున్నాను. ఈ సంఘటన చూసిన నా అసిస్టెంట్‌ ఏమన్నాడో తెలుసా.. 'ఇలాంటి వెధవలే సార్‌! రేపు ఆ అమ్మాయి నలుగుర్లో నోరు విప్పుతుందేమోనని యాసిడ్‌ పోసి చంపేస్తుంటారు. రేపేదైనా జరిగితే పోలీస్‌ డిపార్టుమెంట్‌కి క్లూగా ఉపయోగపడుతుందని క్లిక్‌ చేశాను' అన్నాడు. అదీ సామాజిక బాధ్యత. మీరు ఈ రాత్రికే అతణ్ణి మీ అదుపులోకి తీసుకోవచ్చు..' అంటూ లేచి వచ్చేశాడు రమణారావు.
అక్షరం వొక్కటే.. 'అ' దానికి గుణింతం చేరుస్తూ పోతే 'ఇ ఈ ఉ ఊ ఋ ౠ' లుగా మారుతుంది. సరిగ్గా రమణారావు పరిస్థితి అదే.
అవినీతి నిరోధక శాఖాధికారిగా అతని బాధ్యత పూర్తయింది. అయితే తండ్రిగా కర్తవ్యం మిగిలే ఉంది.
రేపు కన్నతండ్రిగా రాఘవని ఎలా సంస్కరించాలా అని ఆలోచిస్తున్నాడు.

ఈతకోట సుబ్బారావు
94405 29785