- వివాహమైన 11 నెలలకే కలహాలు
- కొత్తపేట రోశయ్య కాలనీలో ఘటన
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి ప్రసాద్
- పోలీసుల అదుపులో భర్త పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన సంఘటన వేటపాలెం మండలం,కొత్తపేట పంచాయతీ పరిధిలోని, రోశయ్య కాలనీలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పాలకట్ట గ్రామానికి చెందిన అమర్తలూరి డేవిడ్, పండు దంపతుల కుమార్తె రోహిణి (24) కు వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీ రోశయ్య కాలనీకి చెందిన డక్కుమళ్ళ పవన్ కళ్యాణ్ తో గత ఏడాది సెప్టెంబర్ లో వివాహం జరిగింది. అయితే కొంతకాలం అన్యోన్యంగానే ఉన్న దంపతుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. భార్యాభర్తలు ఇద్దరు తరుచు గొడవ పడుతూ ఇద్దరి కుటుంబ సభ్యులకు ఫిర్యాదులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దలు సర్ది చెప్పి భార్యాభర్తలిద్దరని మందలించారు. అయితే వారి మధ్య సఖ్యత కుదరకపోవడంతో మంగళవారం రాత్రి భార్యాభర్తలు అరుచుకొని ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో భార్య రోహిణిని భర్త పవన్ కళ్యాణ్ గొంతు నిలిమి హత్య చేశాడు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన పవన్ కళ్యాణ్ వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సమాచారం అందుకున్న రెండవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డిఎస్పి ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని రోహిణి మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగిన ప్రాంతంలో పలు వివరాలు సేకరించారు. అయితే తమ కూతురిని ఆమె భర్త కుటుంబ సభ్యులు వివాహం జరిగినప్పటి నుంచి అనుమానిస్తూ వివాహేతర సంబంధాన్ని అంటగడుతూ నిత్యం వేధించేవారని తమతో అనేకసార్లు తమ కూతురు చెప్పింది అన్నారు. హత్యకు ముందు కూడా తమతో ఫోన్లో ఏడుస్తూ మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను అత్త ఇంటి వారే భర్తతో కలిసి హత్య చేయించారని పోలీసుల ఎదుట మృతురాలి తరపు కుటుంబ సభ్యులు వాపోయారు. ఇదిలా ఉండగా మృతురాలు రోహిణికి గతంలో ఏలూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగిందని, ఆ విషయం వివాహ సమయంలో రోహిణి కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచటంతోనే భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది అని భర్త కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ విషయం గురించి తెలిసి భార్యను నిలదీయటంతో వారి ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని ఆ పై గొడవలు హత్యకు దారితీశాయని అంటున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు టూ టౌన్ ఎస్సై చంద్రావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు.










