- వచ్చే ఏడాది రూ.6,791 కోట్ల ఆదాయ ఆర్జన
- 75 శాతానికి ఒఆర్ పెంపు
- కొత్త నియామకాలపై కొరవడిన కార్యాచరణ
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఆర్‌టిసిని ప్రజా రవాణా శాఖగా మార్చిన తరువాత ఆ సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం చాలా వరకు తగ్గాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెరుగుతున్న డీజిలు ధరలకు అనుగుణంగా ప్రయాణికుల నుంచి టికెట్ల రూపంలో భారీగా వసూలు చేస్తోన్న ప్రభుత్వం క్రమంగా ఆర్‌టిసిని సేవా రంగం నుంచి 'వ్యాపారం' వైపు అడుగులు వేయిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోల నుంచి 11,285 బస్సులను 110.84 కోట్ల కిలోమీటర్లు నడిపి 68 శాతం ఒఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) సాధించింది. తద్వారా రూ.4168.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆర్‌టిసికి భారీ లక్ష్యాలను నిర్దేశించింది. 153 కోట్ల కిలోమీటర్లతో 75 శాతం ఒఆర్‌తో పనిచేసి రూ.6,742 కోట్ల ఆదాయాన్ని సాధించాలని ప్రభుత్వం రూపొందించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ లక్ష్యాల సాధనకు కొత్త బస్సులు కొనుగోలు, గ్యారేజీ సామర్థ్యం పెంపు, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈ అంశాలను పక్కనబెట్టింది. వ్యాపార సంస్థల తరహాలో భారీ లక్ష్యాలను కార్మికుల ముందుంచింది. ఇప్పటి వరకు 11,149 బస్సులు నడుపుతుండగా వీటిలో 8,743 బస్సులు ఆర్‌టిసికి చెందినవి కాగా, 2,406 బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. 2023-24 సంవత్సరంలో పాత బస్సులను మరమ్మతులు చేసి రీ మోడల్ చేయాలని, మరికొన్ని అద్దె బస్సులను తీసుకోవాలని నిర్ణయించారు. అద్దె బస్సులను 21 శాతం నుంచి 32 శాతానికి పెంచడం ద్వారా సంస్థకు మరో రూ.90 కోట్ల వరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదా అవుతుందని అంచనా వేశారు. 2021-22లో రూ.3448.90 కోట్ల ఆదాయం రాగా, రూ.2022-23 పూర్తయ్యే సరికి రూ.5582.66 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ఆదాయం మరో 20 శాతం పెంచుకుని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,791.90 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యం నిర్దేశించారు. ఈ లక్ష్యాల సాధనకు 3,354 బస్సులు అవసరమని ఆర్‌టిసి అంచనా వేసింది. 3,354 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో వెన్నెల ఒకటి, డాల్ఫిన్ క్రూయిజ్ 37, ఇంద్ర 14, మెట్రో లగ్జరీ 24, సూపర్ లగ్జరీ 775, అల్ట్రా డీలక్స్ 281, ఎక్స్‌ప్రెస్ 804, సప్తగిరి 309, మెట్రో ఎక్స్‌ప్రెస్ 148, పల్లెవెలుగు 757, సిటీ ఆర్డినరీ 204 బస్సులు ఉన్నాయి. గతేడాది తిరుపతిలో వంద ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసినా ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని సమాచారం.
నియామకాలు లేకుండా ఎలా సాధ్యం
ఆర్‌టిసిలో కొత్త నియామకాలు జరగడం లేదు. డ్రైవర్లు ఉద్యోగ విరమణ చేసినా తిరిగి కాంట్రాక్టు పద్ధతిలో వారినే కొనసాగిస్తున్నారు. కండక్టర్ల నియామకం లేకుండా అద్దె బస్సు డ్రైవర్లకు సైతం టిమ్‌లు ఇస్తున్నారు. ఒక్కో సందర్భంలో ఆర్‌టిసితో సంబంధం లేని ఇతర వాహనాల డ్రైవర్లను సైతం ఆర్‌టిసి బస్సులను నడిపేందుకు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొస్తున్నారు.
నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలి : ఎస్‌డబ్ల్యుఎఫ్
సిబ్బంది నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.సుందరయ్య డిమాండ్ చేశారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. కార్మికులకు వైద్య సదుపాయాలు సరిగా అందడం లేదని తెలిపారు. గతంలో కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు కార్మికులకు అందిన వైద్య సదుపాయాలను యథాతథంగా అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న టికెట్ల ఆదాయంలో ప్రభుత్వం ప్రతి నెల రూ.125 కోట్ల వరకు తన ఖాజానాలో జమ చేసుకుంటోందన్నారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు.










