ఘాట్ రోడ్డులో ఆగిన భారీ లారీ... గంటలతరబడి నిలిచిన వాహనాలు
ప్రజాశక్తి-అనంతగిరి (అల్లూరి) : ఘాట్ రోడ్డు శివలింగపురం టైడా రెండో మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో సిమెంట్ లోడుతో ఉన్న భారీ లారీ నిలిచిపోవడంతో రాకపోకలకు గంటల తరబడి ఆలస్యం ఏర్పడింది. మైదాన ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతంలో సిమెంట్ రవాణా చేస్తున్న తారస్ లారీ మధ్యాహ్నం సమయంలో మలుపు వద్ద సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. దీనితో మైదాన ప్రాంతం నుండి ఏజెన్సీ ప్రాంతం నకు వెళ్లే వాహనాలు ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతానికి వెళ్ళు పలు వాహనాలు తిరగక గంటల తరబడి నిలిచిపోవడమే కాకుండా గురువారం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు కిలో మీటర్ల రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు గంటల తరబడి ఆలస్యం కలిగింది. ఘాట్ రోడ్డులో నిబంధనల ప్రకారం ... రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ అధిక లోడులతో రవాణా చేస్తుండడంతో ఎక్కడ పడితే అక్కడ లోడుతో ఉన్న వాహనాలు రోడ్డుపైకి నిలిచిపోవడమే కాకుండా మరికొన్ని వాహనాలు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలు ఘాట్ రోడ్డు లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత వాహన ఓనర్లు వాహనాలను పరిమితిని బట్టి లోడులో రవాణా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు. స్ధానిక పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరి జెసిబి ద్వారా రోడ్డు విస్తరణ చేపట్టాడంతో శుక్రవారం 12 గంటల నుండి ట్రాఫిక్ కంట్రోల్ అయ్యి వాహనాల రాకపోకలు కొనసాగాయి.










