Jun 18,2023 07:29

ఓ దేశ చరిత్రలో 75 ఏండ్లు
చిన్న విషయం ఏమీ కాదు.
ఎక్కడా ఆనవాళ్లు కానరాని
సంపూర్ణ స్వాతంత్య్రం.
దేశదేశాల పాలనా గుణగణాలు ఎంచి
రూపొందించిన మార్గదర్శి పొత్తం
అపహాస్యం పాలవుతోంది.

ఓ జనతా!
అధికారం కోసం
అడ్డమైన గడ్డి తింటూ,
ధన రాజకీయాలతో
ఎన్నికల్ని అపహాస్యం చేస్తూ,
గద్దెనెక్కినాక
వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ,
పరిరక్షించాల్సిన ''మార్గదర్శి''నే
బలిపీఠంపై కెక్కిస్తూ,
అభివృద్ధి దృక్కోణంలో కాక
రాజకీయ దృక్కోణంలో
పాలన సాగిస్తూ,
ప్రజాస్వామ్య ఉనికినే
ప్రశ్నార్థకం చేస్తోన్న
పాలకుల నైజం గుర్తించు.

భావోద్వేగాలను రెచ్చగొట్టే
కుతంత్రాలతో,
మార్గదర్శకులు ప్రవచించిన
ఆశయాల అమలులో
విఫలమైన నాయక గణాన్ని
సార్వభౌమాధికారం కల్గి ఉన్న నీవు
నీకు నీవే చైతన్యమై
తరిమి తరిమి కొట్టు.
పలుచబడుతోన్న
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు.

ఓ పాలకులారా!
మహామహులు కలలుగన్న
పూర్ణ స్వరాజ్యానికి
బానిస సంకెళ్లు తగిలించొద్దు.
దేశ ప్రజల కష్టాన్ని
తిమింగలాలకు తాకట్టుపెట్టొద్దు.

వేమూరి శ్రీనివాస్‌
99121 28967