- రాష్ట్రంలో పాతిక వేలకుపైగా..
- లైసెన్స్ లేనివి లక్షల్లోనే
- వినియోగంపై పోలీస్‌శాఖ ఆరా
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అధికారిక, అనధికారిక ఆయుధాలు పెరిగిపోతున్నాయి. అధికారికంగా లైసెన్స్ తీసుకున్న వారి దగ్గరే పాతిక వేలకు పైగా పలు రకాల ఆయుధాలు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక లైసెన్స్ లేకుండా వాడుతున్న ఆయుధాలు లక్షల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఆయుధాలపై వారు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఒక వ్యక్తిగానీ, సంస్థగానీ ఆయుధం వినియోగించాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టరు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తుల సంరక్షణ, ప్రాణహాని ఉన్నట్లు భావిస్తే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి దరఖాస్తులను కలెక్టరు అధ్యయనం చేసి, అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కలెక్టరు తిరస్కరిస్తే, సదరు వ్యక్తి నేరుగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి విన్నవించుకోవచ్చు. అనుమతి పొందిన వ్యక్తి ఆయుధాలను అధికారికంగా విక్రయించే సంస్థ అయిన కోల్‌కతాలోని ఇండియన్ ఆర్డినెన్స్ కర్మాగారం నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తాను పొందిన అనుమతిపై మూడు వరకు ఆయుధాలు కొనుగోలు చేయవచ్చు. అయితే సాధారణంగా రెండు ఆయుధాలకు మాత్రమే అంగీకరిస్తున్నారు. అది కూడా కొన్ని రకాల ఆయుధాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆయుధాల్లో ప్రొహిబిటెడ్ బోర్, నాన్ ప్రొహిబిటెడ్ బోర్ అంటూ రెండు రకాలు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. అనుమతి పొందిన వారు నాన్ ప్రొహిబిటెడ్ బోర్ ఆయుధాలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే కాలిబర్. 35, .32, .22, .380, డబుల్ బారెల్ గన్స్ మాత్రమే ఈ జాబితాలోకి వస్తాయి. 9 ఎంఎం పిస్టల్, హ్యాండ్‌గన్స్, .38, .455, కాలిబర్ .303 రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ గన్స్, ఫుల్లీ ఆటోమెటిక్ గన్స్ అన్నవి ప్రొహిబిటెడ్ ఆయుధాల జాబితాలోకి వస్తాయి. కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ తాము కొనుగోలు చేసిన ఆయుధాల వివరాలను తక్షణమే సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది ఒక ఆయుధాన్నే కొనుగోలు చేసుకోగా, ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు మాత్రం రెండు ఆయుధాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో పాతిక వేల ఆయుధాలు అధికారికంగా ఉండగా, దేశ వ్యాప్తంగా 2016 లెక్కల మేరకు 33.69 లక్షల ఆయుధాలు కొనుగోలు జరిగినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నాటు తుపాకీల నుంచి కీలక ఆయుధాల వరకు అనధికారికంగా వాడుతున్నవి లక్షకుపైగా ఉంటాయని ఒక అంచనా కాగా, దేశంలో 6.14 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఇది దేశ భద్రతకు, సమాజ హితానికి మంచిది కాదని, అందుకే రాష్ట్రంలో అనధికార ఆయుధాలపై దృష్టి సారిస్తున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.










