May 19,2023 07:18

        కూటి కోసం.. కూలి కోసం.. పనులు చేసుకుని బతుకుదామని బయల్దేరిన శ్రమజీవులు మార్గమధ్యంలోనే ప్రమాదాల బారినపడి బలవుతున్నారు. ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన భారీ ప్రమాదాలన్నింటిలోనూ ప్రాణాలు కోల్పోయింది బడుగుజీవులే కావడం విషాదం. ఈ వారంలో మన రాష్ట్రంలో మూడు భారీ ప్రమాదాలు జరగ్గా, వాటిలో మరణించిన వారిలో 17 మంది మహిళలే కావడం విషాదం. వీటిలో రెండు ప్రమాదాల్లో మరణించిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని మహిళలు. అందువల్లే సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఒక ఘటనలో 23 మంది, మరో ఘటనలో 14 మంది ప్రయాణించారు. తెలంగాణ నార్కట్‌పల్లి-మన రాష్ట్రంలోని అద్దంకిని కలిపే ఆ రహదారిలో అంతవరకూ నాలుగు రోడ్ల లైనులో వేగంగా వచ్చిన వాహనాలు సింగిల్‌లైనులోనూ అదే స్పీడులో రావడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో నాలుగులైన్ల రోడ్డు పూర్తయినా.. వివాదాలు పరిష్కారం కాకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు హాట్‌ స్పాట్‌గా మారింది. గత మూడేళ్లలో 12 ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిరపకాయల పని కోసం తెలంగాణ నుంచి బయల్దేరిన 23 మందిలో ఆరుగురు మరణించడం, ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో ఆ గిరిజన కుటుంబాల జీవనం చిన్నాభిన్నమైంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసి తిరిగివస్తున్న యానాం ప్రాంతానికి చెందిన ఏడుగురు మహిళలు కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించగా, మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సును క్లీనర్‌ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
            రహదారులు రక్తసిక్తం కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య 13 లక్షలకు పైమాటే. మరో రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకూ తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఈ గాయాల వల్ల వికలాంగులై జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం, క్షతగాత్రుల సంఖ్యలో మూడో స్థానంలో ఉండటం... మన దేశంలో రహదారుల భద్రత దుస్థితిని చాటిచెబుతోంది. 2020 లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే 69.80 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. 2020లో దేశంలో 3,74,397 మంది మరణిస్తే, 2021లో 3,97,530 మంది బలయ్యారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ 40,510 మరణాలతో.. 10.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌ 36,521 మరణాలతో.. 9.2 శాతం ప్రమాదాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా నాలుగు శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం 16,044 మంది బలయ్యారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రమాదాలకు ఐదు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో పరధ్యానంగా నడపటం, అత్యధిక వేగంతో నడపటం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, రహదారులు ఛిద్రమై ప్రమాదకరంగా ఉండటం. నూతన సాంకేతిక నైపుణ్యంతో అతి వేగంగా దూసుకెళ్లే వాహనాలు మార్కెట్‌లోకి వస్తుండగా, అందుకు అనుగుణంగా రహదారులు మెరుగుపడటం లేదు. దీంతో, వాహన వేగం ఎందరి ప్రాణాలనో బలిగొంటోంది.
            మరోవైపు... రోజురోజుకూ ఉపాధి మార్గాలు కుంచించుకుపోవడం, ఉపాధి హామీకి సైతం సవాలక్ష కొర్రీలు ఉండటం... తదితర కారణాల వల్ల దూర ప్రాంతానికైనా వెళ్లి పనులు చేసే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది. రోజూ పనులు దొరక్కపోవడంతో కుటుంబం గడవడం కష్టమవుతోంది. దీంతో, భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు మహిళలు సైతం పనులకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధిక ఛార్జీలు భరించలేక ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. 'బేటీ బచావో.. బేటీ పఢావో..' అని నినాదమిచ్చిన మోడీ ప్రభుత్వం గానీ, అక్కచెల్లమ్మలు అంటూ నిత్యం జపం చేసే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉపాధి, ఉద్యోగ కల్పనకు శ్రద్ధపెట్టింది లేదు. దీంతో, రొయ్యల శుద్ది లాంటి కష్టమైన పనులు చేస్తూ... ఎటువంటి భద్రత లేని ప్రయాణం చేస్తూ బలవుతున్న వ్యవసాయ కార్మికులు, మహిళలు రాష్ట్రంలో పెరుగుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.