
'దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటివారు' అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు జ్యోతిరావ్ ఫూలే. కులం పేరుతో తరతరాలుగా, అన్ని రకాలుగా అణచివేతకు గురైన దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త జ్యోతిరావ్ గోవిందరావు ఫూలే.
సామాజిక తత్వవేత్తగా, ఉద్యమకారుడుగా, సంఘ సేవకుడిగా ఫూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా...కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడాడు.
పూణే లోని జంబూర్దాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే జన్మించాడు. 13వ ఏటనే సావిత్రిబాయితో ఆయనకు వివాహం జరిగింది. 1841-47 మధ్య ఉన్నత విద్యనభ్యసించిన ఫూలే తన భార్యకి ముందుగా విద్య నేర్పాడు. తరతరాలుగా చదువులు నిరాకరించబడ్డ శూద్ర, అతిశూద్ర మహిళలకు సావిత్రిబాయి ద్వారా పాఠశాలలు స్థాపించాడు. శ్రమ జీవుల కోసం 1855 లోనే రాత్రిబడులు స్థాపించి నిరక్షరాస్యతను పారదోలే దార్శనికుడయ్యాడు. అంటరాని వాళ్ళకు తన ఇంట్లోనే నీళ్ళ బావి నిర్మించి ఔదార్యం చూపాడు. వెలివేయబడ్డ బ్రాహ్మణ స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయమిచ్చాడు. అంతే కాదు! అక్రమ సంతానంగా ముద్ర వేయబడ్డ బిడ్డను దత్తత తీసుకున్నాడు. పురోహితుల దోపిడీని వ్యతిరేకించినప్పటికీ అనేక మంది బ్రాహ్మణ వితంతువులకు ఫూలే ఆశ్రయం కల్పించాడు.
1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక్ సమాజ్' స్థాపించి ఎన్నో సేవలను అందించి మహాత్మునిగా ఘనతకెక్కాడు. ప్రతి కులానికి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఫూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించాడు. సామాజిక అసమానతలకు, విద్యా-ఉద్యోగ అవకాశాలు లోపించిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే పోరాడి ముందు చూపు ప్రదర్శించాడు.
ఫూలే బి.సి 'మాలి' కులానికి చెందిన వాడవడం వల్ల తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో బ్రాహ్మణవాదాన్ని విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాల్సిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. 1948 ఆగస్ట్‌లో బ్రాహ్మణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించినా చివరికి తన తండ్రి ఇంటి నుండి వెళ్లగొట్టినా... మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, బాలికల బతుకుల్లో వెలుగులు చూడాలనే దార్శనికత, ఉన్నత ఆశయంతో, తన భార్య సావిత్రి బాయినే తొలి మహిళా ఉపాధ్యాయనిగా చేసి ఎంతో ధైర్యంగా బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించారు. అస్పృశ్యులను కూడా అక్కున చేర్చుకుని చదువు బోధించారు. ఫూలే ఆనాడు తన ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా బాలికల కోసం పాఠశాల ప్రారంభించబట్టే మహిళలు విద్య నేర్చుకుని ముందడుగు వేయగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. మహిళా సాధికారతకు బీజం వేసిన మహనీయులు మహాత్మా ఫూలే, సావిత్రి బాయి దంపతులని నేటి సమాజం స్మరించుకోవాలి.
పురోహిత వర్గ దోపిడీకి, రైతుల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి సరళమైన భాషలో రచనలు చేశాడు. నాటకాలు రాసి ప్రదర్శింపజేశాడు. బాట్‌జీ (బ్రాహ్మణులు), సేట్ జీ (వ్యాపారస్తులు) వ్యవస్థల దోపిడీని నిష్కర్షగా చీల్చి చెండాడాడు. పీష్వాల నిరంకుశ పాలన, పురోహిత వర్గాల దోపిడీపై జరిపిన నిరంతర పోరాటం ఆయనను డాక్టర్ అంబేద్కర్‌కు సైతం గురుతుల్యుడిని చేసింది. సామాజిక విప్లవకారునిగా మలిచింది.
ఏ రోజునైతే మనిషి బానిసగా మారతాడో, ఆ రోజునే అతని సద్గుణాల్లో సగభాగం నశిస్తాయన్న...గ్రీకు మహాకవి హోమరు మాటల స్ఫూర్తితో శూద్ర, అతి శూద్ర జాతుల విముక్తి కోసం ఫూలే జీవితాంతం దృఢంగా పోరాడాడు.
'శూద్రులు' (అల్పులు), 'మహరి' (గొప్ప శత్రువు), 'అంత్యజ', 'చండాల' లాంటి అవమానకరమైన పేర్లతో ఈ దేశపు కష్టజీవులకు ఆర్యులు తగిలించిన పేర్లను ఆయన తీవ్రంగా ఖండించాడు. 'భూసురులు', 'ఆర్యులు'గా తమను తాము స్తుతించుకున్న బ్రాహ్మణీయుల దోపిడీని అడుగడుగునా చెండాడాడు. దేవదానవుల యుద్ధాల గురించిన అనేకమైన కట్టుకథలతో పురాణాలు నిండి ఉన్నాయని ఫూలే విమర్శించాడు.
కుల వ్యవస్థ అనేది శ్రమజీవుల విభజన, హెచ్చుతగ్గుల నిచ్చెన మెట్ల వ్యవస్థ అని 1873 లోనే ఫూలే విశ్లేషించాడు. ఈ కుల వ్యవస్థ నుంచి శూద్రులు, అంటరాని కులాల వారిని విముక్తం చేయడానికి 1873 సెప్టెంబర్ 24న ఫూలే ప్రారంభించిన సత్యశోధక ఉద్యమం ఇంకా పరిపూర్తి కాలేదు. అది ప్రవచించిన మానవీయ సుఖశాంతులు, ఐక్యత, సమానత సాధించే లక్ష్యాల కోసం పోరాడవలసి వుంది. బొంబాయి మిల్లు కార్మికుల సంఘం స్థాపించేలా ఆనాడే మహాత్మా ఫూలే, నారాయణ లోఖండేకి మార్గదర్శనం చేశారు. ఈ విధంగా ఫూలే తన కాలంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ముందుకు వచ్చాడు.
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే సందేశాన్ని అందించిన ఫూలే తన గురువని డా||బి.ఆర్. అంబేద్కర్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆయనకు సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక ఫూలే రచించిన మహత్తర గ్రంథం 'గులాంగిరి'. నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన ఫూలే...దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ...1890 నవంబరు 28న కన్నుమూశాడు. కుల వివక్షను ఎదిరించి బడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహనీయునిగా ఫూలే పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
/ వ్యాసకర్త సెల్ : 7780103155 /
డా|| మొగిలి దేవ ప్రసాద్