Mar 14,2023 07:22

కాలంతో నడిచేవారు కొందరుంటే కాలాన్ని నడిపించేవారు చాలా అరుదుగా వుంటారు. అటువంటి అరుదైన మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌. ఇరవయ్యో శతాబ్దిని ఆయన ప్రభావిం చేసినంతగా ఇంకెవరూ ప్రభావితం చేయలేద నడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన మరణించి 140 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రభావితం చేస్తూనే వున్నాడు. ఆయన చూపిన మార్గంలో కోటాను కోట్ల మంది ప్రజలు పయనిస్తూనే వున్నారు.
        అప్పటి వరకు వెనుకబడిన ఐరోపా ఖండంలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలు కొత్త సమాజ నిర్మాణానికి బాటలువేశాయి. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారుడితోపాటు కార్మికవర్గం పుట్టుకొచ్చింది. భూస్వామ్య యుగంలోని అర్ధబానిస జీవితానికి విముక్తి లభిస్తుందని అనుకున్న ఆధునిక మానవుడికి ''లాభం'' రూపంలో కొత్తరకం దోపిడీకి తెరలేచింది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం పిడికిలెత్తి పోరాడింది. పనిగంటల తగ్గింపు, జీవించటానికి సరిపడా వేతనం, మెరుగైన పనిపరిస్థితులు, ప్రజాస్వామిక హక్కుల కోసం కార్మిక సంఘాలు పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రభుత్వాలపై తిరుగుబాటు చేశాయి.
         1818 మే 5న జర్మనీ లోని ''ట్రయర్‌'' నగరంలో కారల్‌మార్క్‌ ్స జన్మించాడు. 17 ఏళ్ళ వయసులో స్కూలు చదువు ముగించిన మార్క్‌ ్స గురించి ప్రోగ్రెస్‌ రిపోర్టులో ఇలా వుంది. ''అతడు చాలా తెలివిగల విద్యార్ధి. ప్రాచీన సాహిత్యంలోనూ, జర్మన్‌ భాషలోనూ, చరిత్ర పాఠాల్లోనూ అత్యంత ప్రతిభ కనబరిచాడు. గణితంలో అమోఘమైన ప్రజ్ఞ చూపాడు.'' వృత్తి ఎంపికలో యువకుని భావాలు అనే తొలి వ్యాసంలోనే మార్క్స్‌ ''అత్యధిక ప్రజలకు అమిత సంతోషం కలిగించేవాడే నిజమైన అదృష్టవంతుడు'' అన్నాడు. ఆ విధంగానే తన జీవిత సర్వస్వాన్ని పీడిత పజల విముక్తి కోసం అంకితం చేశాడు. ఆనాటి యూరప్‌ ఖండం లోని విప్లవ భావాలను వంటబట్టించుకొని జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ శిష్యుడిగా మారాడు. రాబర్డ్‌ ఓపెన్‌, సెయింట్‌ సైమన్‌ రచనల అధ్యయనంతో సోషలిస్టు భావాలతో ముందడుగు వేశాడు. 1842లో ఎంగెల్సుతో పరిచయం ఏర్పడింది. 1843లో తను ప్రేమించిన జెన్నీ వెస్ట్‌ఫాలెన్‌ను వివాహమాడాడు. కార్మిక వర్గం కోసం నూతన పత్రికను నెలకొల్పేందుకు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరారు. ఫ్రాన్స్‌ విప్లవం కార్మిక వర్గానికి ద్రోహం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ''వ్యక్తిగత ఆస్తిపై ఆధారపడిన వ్యవస్థ కార్మికుల శ్రమను దోచుకునే స్వేచ్ఛను మాత్రం పెట్టుబడిదారులకిచ్చింది'' అని విశ్లేషించాడు. 1846లో ''జర్మన్‌ భావజాలం'' అనే గ్రంథం ద్వారా నూతన సిద్ధాంతమైన ''గతితార్కిక భౌతికవాద'' సూత్రాలను ప్రతిపాదించాడు.
          ప్రవాసుల లీగుతో ప్రారంభించి అంతర్జాతీయ కమ్యూనిస్టు సంఘం వరకు అనేక కార్మికవర్గ సంఘటిత సంస్థలను నిర్మించే దానిలో మార్క్స్‌ ప్రధాన పాత్ర నిర్వహించాడు. ఆయా కాలాల్లో నిర్మించబడిన పోరాటాలన్నింటికీ మార్క్స్‌ మార్గదర్శిగా నిలిచాడు. చారిత్రక భౌతికవాదం, వర్గపోరాటం, సోషలిస్టు విప్లవాల గురించి వివరణ ఇస్తూ అంతిమంగా ''ప్రపంచ కార్మికులారా ఏకం కండు, పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప'' అనే పిలుపుతో ముగించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కార్మిక వర్గానికి వెలుగుబాట చూపింది. యూరప్‌లో జరిగిన అన్ని విప్లవాల్లో పాల్గొనడం ద్వారా వచ్చిన అనుభవం నుండి మార్క్స్‌, కార్మిక వర్గానికి బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం జరగాలని పిలుపునిచ్చాడు.
         జర్మనీలో పుట్టినా యూరప్‌ లోని అనేక దేశాల నుండి బహిష్కరణకు గురై చివరకు 1849 నుండి లండన్‌లో ప్రవాసిగా జీవితం గడిపాడు. చివరికి 1883 మార్చి 14న శాశ్వతంగా అక్కడే కన్నుమూశాడు. ఆయన సమాధి దగ్గర ఎంగెల్స్‌ చేసిన ప్రసంగం ఇలా వుంది. ''మార్క్స్‌ తన కాలంలో అందరి కంటె ఎక్కువగా ద్వేషించబడిన, నిందించబడిన వ్యక్తి. ప్రభుత్వాలు నియంతృత్వం, ప్రజాస్వామికం ఏ పేర్లతో వున్నా తమ భూభాగాల నుండి ఆయన్ని బహిష్కరించాయి. బూర్జువాలు, మితవాదులు, అతివాదులు ఆయన మీద నిందలు గుప్పించడానికి పోటీపడ్డారు. మరి ఆయన సైబీరియా నుండి కాలిఫోర్నియా దాకా యూరప్‌, అమెరికా ఖండాల్లోని సకల భాగాలలోని లక్షోపలక్షల విప్లవ కార్మికుల చేత ప్రేమించబడి, పూజింపబడి, వాళ్ళకు దు:ఖం మిగుల్చుతూ నిష్క్రమించాడు. ఆయనకు చాలా మంది వ్యతిరేకులున్నపటికీ వ్యక్తిగత శత్రువు ఒక్కరు కూడా లేరని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన కృషి కూడా''.
        ప్రస్తుత దుర్మార్గపు దోపిడీ వ్యవస్థ సమర్థకులు మార్క్సిజానికి కాలం చెల్లిందని కారుకూతలు కూస్తున్నా, ఇప్పటికీ ప్రపంచంలోని కోట్లాది కార్మికులు, పీడిత తాడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు తమ విముక్తి కోసం మార్క్సిజం వెలుగులో పోరాడుతున్నాయి. ఒక దశాబ్దంలోనే రెండు పెట్టుబడిదారీ సంక్షోభాలను ప్రపంచం చవిచూస్తున్న ఈ తరుణంలో మార్క్సిజం ప్రాసంగికత మరింత పెరిగింది. సమాజాన్ని ముందుకు నడిపించగల చోదక శక్తి మార్క్సిజమే.

- కారుసాల శ్రీనివాసరావు,
సెల్‌ : 9490300371