ఇంకొంచెం ఓపిక పట్టు
వాళ్ళ అడుగుల చప్పుడు ఆగే వరకు
వాళ్ళ చూపుల వేట మరలే వరకు
ఇంకొంచెంసేపు ప్రాణం ఉగ్గపట్టు
వాళ్ళ ఊపిరి బుసలు చల్లారే దాకా
వాళ్ళ పండ్లు కొరికే శబ్దాలు ఆగేదాకా
మెల్లగా గాలి పీల్చు ఒకేసారి కాకుండా
గుక్క పెట్టి ఏడువు వినిపించకుండా
ఆ ఏడుపును కాసేపు స్తంభించాలి
అట్లాగే ఓ దీర్ఘ ఆర్తనాదం పేగులకు చుట్టుకుని
నరాలకు పాకి కళ్ళలోంచి
రక్తపు చినుకులు రాలాలి
మొఖం కంది ముక్కుపుటాలు అదరాలి
ఎద ఎత్తెత్తేయాలి
అఖండ సహనంతో పిడికిళ్ళను నింపు
నువ్వలా అవ్వొద్దు.. బోరున విలపించే
ఔత్సాహిక నటుల్లా అసలే ప్రవర్తించొద్దు
ముందు ముందు కొండలను
నింపుకోవాలి గుండె లోపల
కేవలం స్వేచ్ఛగా నీలా జీవించగలవు అప్పుడే
ఏ భయం లేక ఏ నిర్దేశన లేక నిఘా లేక...
మెదడు రెండు పచ్చలై అందులో
మురికి కాలువలు శుభ్రపడినప్పుడు
మల్లెతీగలు వ్యాపించినప్పుడు
పుప్పొడి విరగబూసినప్పుడు
తడి గడ్డి ముత్యాల జ్ఞాన బిందువులను
రాలుస్తున్నప్పుడు
సాటి మనిషిలో సొంత మనిషిని
చూస్తున్నప్పుడు అలవడుతుంది
నిఖార్సయిన ప్రేమతత్వం మనిషిమత్వం..!!
రఘు వగ్గు
96032 45215