Oct 31,2023 07:08

గత కొన్నేళ్ళుగా ప్రపంచ ఆకలి సూచికలో మన స్థానం అధమ స్థాయిలో ఉంటోంది. అది కూడా దిగజారుతూ వస్తోంది. ఒకవైపు ఆకలి తీవ్రత, ఆకలిగొన్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూ వుండడం, మరొక వైపు మన జిడిపి నానాటికీ పెరుగుతూ వుండడం-ఈ రెండు ధోరణులూ ఏక కాలంలో వ్యక్తం ఔతున్నాయి. ఈ ధోరణి నయా ఉదారవాద ధానాలతోబాటు కానవస్తోంది.

            అన్ని ఫాసిస్టు సంస్థలకూ ఒక ఉమ్మడి లక్షణం ఉంటుంది. వాళ్ళు జనం మీదకు వదిలే ప్రచారం బూటకం అని రుజువు చేసే ఆధారాలను వాళ్ళు పూర్తిగా తిరస్కరిస్తారు. ఆ ఆధారాలు వాస్తవమే అయినా ఆ విషయాన్ని ఒప్పుకోరు. మన దేశంలో అధికారంలో ఉన్న హిందూత్వ శక్తులు కూడా ఇదే మాదిరిగా ఉన్నారు. తమ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా దూసుకుపోతోందని, ఇంత మంచి పాలనను గతంలో ప్రజలు ఎన్నడూ చూసి వుండలేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు గాని, ఆఖరికి తమ ఆధీనంలో నడిచే ప్రభుత్వ సంస్థలు గాని ఆ ప్రచారానికి విరుద్ధంగా ఉన్న ఆధారాలను వెల్లడి చేస్తే అటువంటి ఆధారాలన్నీ తప్పుల తడకలని దబాయిస్తారు. ఇండియాలో ఫాసిస్టు హిందూత్వ శక్తుల ప్రచార సూక్తి చాలా స్పష్టం. ''మోడీ ఏం చెప్తాడో అదే సత్యం'' అన్నదే ఆ సూక్తి. అందుకు భిన్నంగా ఏ వాస్తవమైనా బైట పడితే అది తప్పు అయివుండాలి. వాళ్ళ లెక్కల్లో బహుశా అది కడు దుర్మార్గమైన ఉగ్రవాద కుట్రలో భాగం అయివుంటుంది.
          ఒక విషయాన్ని మొత్తంగానే తిరస్కరించడం వేరు, దానిని విమర్శనాత్మకంగా పరిశీలించడం వేరు. ఒకవేళ హిందూత్వ శక్తులు వెలుగులోకి వచ్చిన ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశీలించి చర్చిస్తే అది చాలా ఉపయోగకరమైన చర్చ అవుతుంది. మేధోపరమైన మథనం ఎలా జరిగినా దాని వల్ల ఉపయోగమే. వెలికి తీసిన ఆధారాలను భిన్నమైన కోణాల నుండి పరిశీలించి నిగ్గు తేల్చడానికి గాని, ఆధారాలను సేకరించడానికి మరింత మెరుగైన పద్ధతులను అనుసరించడానికి గాని అది దారి తీస్తుంది. కాని అటువంటి మేథోపరమైన విమర్శనాత్మక చర్చ హిందూత్వ వాదులకు శక్తికి మించిన పని. వెలుగులోకి వచ్చిన వాస్తవాలను, వాటి ఆధారాలను తిరస్కరించడం ఒక్కటే వాళ్ళకి తెలుసు. ఆ ఆధారాలను, వాస్తవాలను ఎందుకు తిరస్కరించాలో ఆ కారణాలను కూడా వాళ్ళు చెప్పలేరు.
        మోడీ ప్రభుత్వం వాస్తవాలను, వాటికి సంబంధించిన ఆధారాలను తిరస్కరించిన మూడు సందర్భాలను నేనిక్కడ ప్రస్తావిస్తాను. మొదటిది: వినియోగదారులు చేసిన ఖర్చు గురించి 2017-18లో చేసిన జాతీయ శాంపిల్‌ సర్వేకు సంబంధించినది. 1950 దశకంలో ప్రముఖ గణాంక శాస్త్రవేత్త పి.సి.మహలనోబిస్‌ ఈ సర్వే విధానాలను రూపొందించారు. ప్రతీ ఐదు సంవత్సరాలకూ ఒక మారు జరిగే పెద్ద శాంపిల్‌ సర్వే అది. నిజానికి ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే అది. ఐతే అటువంటి సర్వేకు సైతం కొన్ని పరిమితులు ఉండవచ్చు. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ, అది చాలా విలువైన సమాచారాన్ని వెలికి తీస్తుంది. మన దేశంలోనే గాక విదేశాలలో ఉండే పరిశోధకులకు సైతం కొన్ని తరాల వరకూ ఉపయోగపడే విలువైన సమాచారం దాని ద్వారా లభిస్తుంది.
2017-18 సర్వే భారతదేశంలో పెరుగుతున్న పేదరికం ఎంత దయనీయంగా ఉందో వెల్లడించింది. దాంతో మోడీ ప్రభుత్వం ఆ సర్వే వివరాలను బహిరంగ పరచనివ్వలేదు. అంతేగాక, అటువంటి సర్వేలు ఇకముందు జరగకుండా నిలుపు చేసేసింది. ప్రభుత్వం ఆ వివరాలను తొక్కిపెట్టేలోపే అందులో కొన్ని వివరాలు బైటకొచ్చాయి. వాటిని బట్టి చూస్తే గ్రామీణ భారతంలో రోజుకు తలసరి కనీసం 2200 కేలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని పొందలేకపోతున్న ప్రజలు 2011-12 నుండి 2017-18 మధ్య కాలంలో 68 శాతం నుండి 78.5 శాతానికి పెరిగారు.
         ఈ సర్వే వివరాలను చూసి ప్రభుత్వం అప్రమత్తం అయ్యేబదులు ఆ సర్వే వివరాలను మొత్తంగా తొక్కిపెట్టివేయడమే కాకుండా, ఇకముందు ఆ తరహా సర్వేలు అనేవి అసలు జరగరాదని ఆదేశించింది! ఆ సర్వేపై సందేహాలు ఉంటే మళ్ళీ తాజాగా సర్వే జరపమని ఆదేశించి వుండవచ్చు (గతంలో 2009-10 సర్వే కూడా పేదరికం స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు వెల్లడిస్తే అప్పటి యుపిఎ ప్రభుత్వం 2011-12లో మళ్ళీ సర్వే జరపాలని ఆదేశించింది). లేదా ఒక నిపుణుల కమిటీని నియమించి ఆ సర్వే వెల్లడించిన విషయాల ప్రభావం ఏమిటో, పరిస్థితులను చక్కదిద్దే మార్గాలు ఏమిటో సూచించమని కోరవచ్చు. కాని మోడీ ప్రభుత్వం ఏకంగా ఆ సర్వే వివరాలనే కప్పిపెట్టింది. తాము చేసే ప్రచారానికి భిన్నంగా ఉండే వాస్తవాల పట్ల ఫాసిస్టు శక్తులు ప్రతిస్పందించే తీరు ఈ విధంగానే ఉంటుంది.
          నా రెండో ఉదాహరణ ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేకు సంబంధించినది. ఈ సర్వే 2019-21 మధ్య నిర్వహించారు. 2015-16లో జరిపిన 4వ సర్వే నాటికే చిన్న పిల్లలలోను, మహిళలలోను అధికంగా ఉన్న రక్తహీనత 5వ సర్వేలో మరింత తీవ్ర స్థాయికి చేరినట్టు తేలింది. 6 నెలల నుండి 5 ఏళ్ళ లోపు ఉన్న పిల్లల్లో రక్తహీనత 59 నుండి 67 శాతానికి చేరింది. వారిలో ఒక మోస్తరు నుండి తీవ్ర స్థాయిలో రక్త హీనత ఉన్నవారు 30.6 నుండి 38.1 శాతానికి పెరిగారు. స్వల్ప స్థాయిలో రక్తహీనత ఉన్నవారు 28.4 నుండి 28.9 శాతానికి, అంటే స్వల్పంగానే పెరిగారు. ఇక 49 ఏళ్ళ వరకు వయస్సు ఉన్న మహిళలలో రక్తహీనత 53 నుండి 57 శాతానికి పెరిగింది. వారిలో కూడా ఒక మోస్తరు నుండి తీవ్ర స్థాయిలో రక్తహీనత ఉన్నవారి శాతం 28.4 నుండి 31.4 శాతానికి పెరిగింది. మహిళలతో పోల్చితే పురుషులలో రక్తహీనత తక్కువే ఉంది. అయినప్పటికీ, 49 ఏళ్ళ లోపు పురుషులలో రక్తహీనత 23 నుండి 25 శాతానికి పెరిగింది. వారిలో ఒక మోస్తరు నుండి తీవ్ర స్థాయిలో రక్తహీనత ఉన్న వారు 5 నుండి 8 శాతానికి పెరిగారు. సగటు రక్తహీనత స్థాయి కన్నా గ్రామీణ ప్రాంతంలో జీవించే పిల్లలు, పెద్దల్లో రక్తహీనత ఉన్నవారి శాతం, తీవ్ర స్థాయిలో ఉన్నవారి శాతం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలలో దీని తీవ్రత బాగా ఎక్కువగా ఉంది.
           ఈ వాస్తవాల పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? నిపుణులను రంగంలోకి దించి, ఆ వాస్తవాలను నిగ్గు తేల్చి, పెరుగుతున్న రక్తహీనతను అరికట్టేందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టడం పోయి, ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రమూ శ్రద్ధ కనపరచకుండా, ఆ సర్వే నిర్వహించిన అంతర్జాతీయ జనాభా అధ్యయన సంస్థ డైరక్టర్‌ను విధుల నుండి సస్పెండ్‌ చేసింది (ఆ డైరక్టర్‌ వెనువెంటనే రాజీనామా చేశారు. రాజీనామా చేయగానే ఆ సస్పెన్షన్‌ ను రద్దు చేశారు. దీనిని బట్టి సస్పెండ్‌ చేయడానికి చూపించిన కారణాలు బూటకం అని స్పష్టం ఔతోంది)! వాస్తవాల పట్ల ఫాసిస్టులు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేదానికి ఈ ఉదంతం మరో ఉదాహరణ.
           నా మూడో ఉదాహరణ ప్రపంచ ఆకలి సూచికకు సంబంధించినది. ఆకలి బాగా స్వల్ప స్థాయిలో ఉన్న దేశాలను ఈ సూచిక తయారీకి పరిగణన లోకి తీసుకోరు. 2023కు సంబంధించిన ఆకలి సూచికలో 125 దేశాలకు గాను మన దేశం 111వ స్థానంలో ఉంది. మన పోరుగునే ఉన్న పాకిస్తాన్‌ 102వ స్థానంలో, బంగ్లాదేశ్‌ 81వ స్థానంలోను, శ్రీలంక 61వ స్థానంలోను, నేపాల్‌ 69వ స్థానంలోను ఉంటే మనం మాత్రం 111వ స్థానంలో ఉండడమే కాకుండా ఏటికేడూ ఆ స్థానం ఇంకా దిగజారుతోంది !
           ఇంత కలవరపరిచే ఈ నిర్ధారణల పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? చిన్నపాటి ఆందోళన కూడా వ్యక్తం చేయలేదు. ఏ పాటి శ్రద్ధా కనపరచలేదు. ఆ నిర్ధారణలను మొత్తంగా తిరస్కరించింది. ఒక కేంద్ర క్యాబినెట్‌ మంత్రి ఏకంగా హాస్యాస్పదమైన, తెలివితక్కువ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ప్రపంచ ఆకలి సూచికను లెక్కించడానికి నాలుగు కొలబద్దలను ప్రాతిపదికగా తీసుకుంటారు. అవి (1) పోషకాహార లోపం, (2) 5 ఏళ్ళలోపు పిల్లల్లో మరణాల రేటు, (3) పిల్లల్లో ఎదుగుదల లేకుండా గిడసబారిపోవడం, (అంటే వయస్సుకు తగ్గ ఎత్తుకు ఎదగకపోవడం), (4) పిల్లల్లో కృశించిపోయే లక్షణం (అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం). ఆకలి సూచిక లెక్కకు పెద్దవాళ్ళను కాకుండా పిల్లల పరిస్థితినే అతిగా లెక్కలోకి తీసుకున్నారన్న ప్రభుత్వ వాదన కాస్సేపు సరైనదే అనుకుందాం. కాని, తక్కిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నదన్న చేదు వాస్తవాన్ని ఆకలి సూచిక వెల్లడిస్తోంది. దానిని ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేయలేం. అటువంటప్పుడు ప్రభుత్వం చెప్పే సాకుల ప్రాతిపదికన ప్రపంచ ఆకలి సూచిక నిర్ధారణలను తోసిపుచ్చడం ఏ మాత్రమూ తగదు.
          ఇంతకూ సదరు మంత్రిగారేమని శలవిచ్చారు? రోజంతా ప్రయాణంలో ఉన్నందువల్ల తానూ ఆకలిగా ఉన్నానని, ఒకవేళ ఎవరైనా ఫోను చేసి అడిగితే ఆ విషయాన్నే చేప్పేదానినని, అప్పుడు తానూ పోషకాహార లేమితో బాధపడుతున్న వ్యక్తిగానే లెక్కించబడతానని ఆమె అన్నారు. ఆకలి సూచికను లెక్కించడానికి మన దేశంలో 3000 మంది నుండి మాత్రమే వివరాలు సేకరిస్తారు గనుక ఆ సూచిక నిర్ధారణలను పట్టించుకోనక్కరలేదని అమె అన్నారు.
           ఈ సందర్భంలో మూడు విషయాలను స్పష్టం చేయాలి. ప్రపంచ ఆకలి సూచికను లెక్కించడానికి ఉపయోగించే కొలబద్దల్లో పోషకాహార లభ్యత అన్నది ఒక్క కొలబద్ద మాత్రమే. పైగా పోషకాహార లేమిని లెక్కించడానికి కేవలం వ్యక్తులు చెప్పినదాన్నే కాకుండా అధికారికంగా ప్రభుత్వాలు రూపొందించే సమతుల్యాహార లభ్యత గణాంకాలను కూడా లెక్కలోకి తీసుకుంటారు. బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టాక వినిమయదారుల ఖర్చు తీరుతెన్నులను సేకరించే విధానానికి స్వస్తి చెప్పింది. కనుకనే నేరుగా కొంతమందిని కలిసి వారినుండి వివరాలు సేకరించవలసిన అగత్యం ఏర్పడింది.
          గత కొన్నేళ్ళుగా ప్రపంచ ఆకలి సూచికలో మన స్థానం అధమ స్థాయిలో ఉంటోంది. అది కూడా దిగజారుతూ వస్తోంది. ఒకవైపు ఆకలి తీవ్రత, ఆకలిగొన్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూ వుండడం, మరొక వైపు మన జిడిపి నానాటికీ పెరుగుతూ వుండడం-ఈ రెండు ధోరణులూ ఏక కాలంలో వ్యక్తం ఔతున్నాయి. ఈ ధోరణి నయా ఉదారవాద విధానాలతోబాటు కానవస్తోంది. ఈ ఫాసిస్టు శక్తులు అధికారం లోకి రాకముందు నుండీ ఇదే ధోరణి ఉంటూ వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ ధోరణి మరింత ముదిరింది.
       కొందరు వ్యక్తుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించడం వల్ల ఈ ఆకలి సూచికను మంత్రిగారు తప్పుబట్టారు. వినిమయదారుల సర్వేకు బిజెపి ప్రభుత్వం స్వస్తి చెప్పింది గనుకనే ఆ వ్యక్తిగత సర్వే అవసరమైంది. పైగా బిజెపి అధికారంలోకి రాకముందు నుండీ ఆకలి సూచికలో మన స్థానం దిగజారుతూ వస్తోంది. అందుచేత మంత్రిగారి వాదన చెల్లదు. పైగా, ఈ సూచికను రూపొందించడం కోసం అన్ని దేశాల్లోనూ వ్యక్తుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. చాలా దేశాల్లో మనకున్న గణాంక వ్యవస్థ వంటి పటిష్టమైన వ్యవస్థలు లేకపోవడమే దానికి కారణం. ఇక మన స్థానం దిగజారిపోవడం అనే ధోరణి వ్యక్తుల నుండి సమాచారం సేకరించే పద్ధతిని అనుసరించక ముందునుంచీ కనిపిస్తూ వుంది.
          ఒకపక్క మన జిడిపి పెరుగుతున్నప్పటికీ, పలు సంస్థలు వేర్వేరు ఆధారాల ప్రాతిపదికలను ఉపయోగించి రూపొందించిన సూచికలు మన దేశంలో పోషకాహార లేమి ఎక్కువగా ఉన్నదని, పైగా నానాటికీ అది మరింత ఎక్కువగా పెరుగుతోందని సూచిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. మన దేశాన్నేలుతున్న ఫాసిస్టు తరహా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆ సూచికల నిర్ధారణలను తిరస్కరిస్తోంది. తద్వారా తన అసలు స్వభావాన్ని బైటపెట్టుకుంటోంది. ఈ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే, మన దేశంలో చాలా శ్రద్ధతో పలు దశాబ్దాల కృషితో నిర్మించుకున్న గణాంక వ్యవస్థను ఈ ప్రభుత్వం అతి త్వరలోనే నాశనం చేయకమానదు.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

prabhat