Jan 29,2023 08:12

ప్రపంచీకరణతో ప్రతి ఒక్కటీ వ్యాపారమయం అయిపోతోంది. వైద్యరంగమూ దానికి అతీతం కాదు. కార్పొరేట్ల కాసుల కక్కుర్తి కరోనా విలయ కాలంలో ఎందరి ప్రాణాలను బలిగొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేక అవసరాలు గల బిడ్డ (స్పెషల్‌ చైల్డ్‌) తల్లిగా నాకు ఇంకా ఎన్నో అనుభవాలు. నేను డాక్టర్నయినా వైద్యుల నిర్లక్ష్యం ఒక్కోసారి అంతులేని ఆవేదనను, కోపాన్ని తెప్పించేది. ఇంకోసారి నిలువెల్లా నిస్సహాయత ముంచెత్తేది. కష్టమొచ్చినా, బాధ కలిగినా నోరు తెరచి చెప్పుకోలేని నా బిడ్డతో కలిసి , ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న రోజులెన్నో! అటువంటిది విదేశీ పర్యటన కోసం వచ్చిన ఒక వైద్యురాలు, నా బిడ్డను చూడగానే స్పందించిన తీరు, భాష తెలియకపోయినా కష్టాన్ని పంచుకోవడానికి, ఓదార్చడానికి తపించిన తీరు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకన్నా ఆమె పట్ల గౌరవాన్ని కలిగించింది. ఆమెకు నేను ఏమవుతాను?.. ఏమీ కాను.. మహా అంటే.. ఆమెను చూడటానికి వచ్చిన వేలాది మందిలో ఒకరిని. పోనీ.. ఫీజుగా ఏమైనా ఇచ్చానా అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక్కడ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వేల రూపాయలు కుమ్మరించినా కలగని ధైర్యం.. ఆమె నాకు ఎలా ఇవ్వగలిగింది? ఇంతకూ ఆమె ఎవరో చెప్పలేదు కదూ! క్యూబా నుండి భారత పర్యటనకు వచ్చిన డాక్టర్‌ అలైదా గువేరా. ప్రపంచ విప్లవకారుడు చే గువేరా కుమార్తె! ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించే సోషలిస్టు వ్యవస్థలో ప్రజా వైద్యులు ఎలా ఉంటారో అందరితో పంచుకోవాలనిపించింది!
మా బాబుకి రెండున్నరేళ్లప్పుడు దెబ్బ తగిలితే, పిల్లల డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళాం. మాటల మధ్యలో 'ఇంతకన్నా పెద్ద దెబ్బ మెదడుకు ఎప్పుడో తగిలింది. ఇదేముంది?' అని ఆయన అన్నారు. ఆ మాట వినగానే నాకు గుండె గతుక్కుమంది. అయినా, ప్రాక్టికల్‌గా అలా చెప్పేశారని.. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఈ నాలుగేళ్లలో చాలామంది న్యూరాలజిస్టులను కలిశాను. అందరి దగ్గరా ఎదురైన అనుభవం ఒక్కటే. కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే చూసి, మందులు రాసేసి పంపేవారు. కొందరైతే బిడ్డను తాకడానికి కూడా సిద్ధపడేవారు కాదు. ఇటీవల గుంటూరులో ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌ని రెండు గంటలు వేచి ఉండి కలిశాను. ఆయన బాబును కనీసం ముట్టుకోలేదు. అయినా, ఎంఆర్‌ఐతో పాటు మరెన్నో పరీక్షలు రాసేశారు. అసిస్టెంట్‌కు ప్రిస్క్రిప్షన్‌ గురించి చెప్పినంత సమయం కూడా ఆయన బాబును పరీక్షించలేదు. నాకు తెలిసిన ఇంకో పేరెంట్‌ అనుభవం.. పాపకి ఫిట్స్‌ వచ్చి, చెన్నైలో టాప్‌ 3 న్యూరాలజిస్ట్‌లలో ఒక డాక్టర్‌ దగ్గరికి తీసుకువెళ్లినపుడు.. 'అపాయింట్‌మెంట్‌ టైమ్‌ అయిపోయింది. చూడను' అనేశారు. బతిమిలాడితే 'ఇప్పుడు ఈ పాప బతికుండి, ఏం చేస్తుంది?' అన్నారు. ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లి ఉంటుంది?
ఇటువంటి చేదు అనుభవాలు కలిగిన నేను ఇటీవల విజయవాడ వచ్చిన డాక్టర్‌ అలైదా గువేరాను కలిశాను. తెలిసినవారి చేత ఒక మాట చెప్పించినప్పటికీ, నేను.. ఆమె ఏమంటుందో, అసలు చూడటానికి ఒప్పుకుంటుందో లేదో అన్న సందేహాలు నన్ను వెంటాడుతుండగా.. బాబును తీసుకుని నేరుగా ఆమె బస చేసిన హోటల్‌ వద్దకు వెళ్ళి ఆమెను కలిశాను. బాబును చూడగానే దగ్గరకు వచ్చి బాబు తల నిమిరి, ఛాతీ, పొట్ట తడిమి పరీక్షిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మొదట దీనికి శాశ్వత పరిష్కారం లేదనే చెప్పారు ఆమె కూడా. ఆ తరువాత బాబు ఏం చేయగలడు, ఏం చేయలేడు అనే విషయాలను అనువాదకుడి సహాయంతో అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎటువంటి ప్రదేశంలో నివసించాలి.. ఏమేమి ఆరోగ్యసమస్యలు వస్తాయి.. వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. బాబుతో ఎంత ప్రేమగా ఉండాలి.. ఇలా ఎన్నో విషయాలు మాకు వివరించారు. బాబుకు మ్యూజిక్‌ అంటే ఇష్టమని చెప్పగానే స్పానిష్‌ భాషలో మూడు పాటలు పాడి, బాబుని ఆనందపరిచే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే 20 నిమిషాలు గడిచిపోయాయి. వేల రూపాయలు ఫీజు తీసుకున్నా ఐదు నిమిషాలు పేషెంట్‌ కోసం కేటాయించడానికి నానా ఇబ్బందులు పడే అనేకమంది కార్పొరేట్‌ డాక్టర్లకు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దేశం కాని దేశంలో, భాష తెలియకపోయినా వైద్య సహాయం చేయడానికి శతథా ప్రయత్నించిన డాక్టర్‌ అలైదా గువేరాకు పోలిక ఎక్కడీ ఈ మానవత్వం, మంచితనం, ప్రేమను పంచడం ఆమె తన తండ్రి చే గువేరా నుండి పుణికిపుచ్చుకున్నారా? లేక క్యూబా వైద్య విధానంలోనే అది ఇమిడి ఉందా? ఏది ఏమైనా డాక్టర్‌ అలైదా నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 'మందు వ్యాధిని నయం చేస్తుంది. కానీ రోగాన్ని ఎదుర్కోవడానికి కావలసిన మానసిక స్థైర్యం వైద్యులే అందించాలి!' అనే కార్ల్‌ జంగ్‌ మాటలకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్‌ అలైదా గువేరా. మా అందరి తరఫున ఆమెకు సెల్యూట్‌!

- డాక్టర్‌ దివ్య బెండి