Oct 04,2022 06:55

రోజూ నీళ్ల చారు, గొడ్డుకారంతో కడుపు నింపుకొనే పేదలు పండగ రోజన్నా పప్పు, పాయసం తినాలనుకోవడం వాళ్ల స్థాయికి పెద్ద కోరిక. దసరాకు ఆ కోర్కెనూ తీర్చలేకుంది ప్రభుత్వం. రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు, పంచదారకు ఎగనామం పెట్టింది. పండగొస్తే రేషన్‌ షాపుల్లో అదనంగా సరుకులివ్వడం తెలిసిందే. అదనపు సరుకుల సంగతేమో, ప్రతి నెలా ఇచ్చే వాటికీ కత్తెర వేయడం పేదలకు కాస్తో కూస్తో అందుతున్న ఆసరాకు గండికొట్టడమే. తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యంతో పాటు కిలో కందిపప్పు, అర కిలో చక్కెర పంపిణీ చేస్తామంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక కోటీ 45 లక్షల కార్డులుండగా, 14.5 వేల టన్నుల కందిపప్పు, 7 వేల టన్నుల పంచదార సేకరించాలి. కానీ పౌరసరఫరాల శాఖ వద్ద పది శాతం నిల్వలే ఉన్నాయి. అందరికీ ఎలా పంపిణీ చేస్తారు? కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకునే ఎత్తేగా? సరఫరాదారులకు పాత బకాయిలు పేరుకుపోయినందున సేకరణ జరగలేదంటున్నారు. పేదలకు అందించే కొద్దిపాటి సరుకులకయ్యే సొమ్ము ఖజానాలో లేదనుకోగలమా?
కొన్ని మాసాలుగా కందిపప్పు, చక్కెర పంపిణీ అస్తవ్యస్తంగా తయారైందని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. కందిపప్పు 30 శాతం మందికి, పంచదార 70 శాతం మందికే అందుతున్నాయి. అదేంటంటే, పేదలు తీసుకోవట్లేదని సాకులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక మాదిరి క్వాలిటీ కందిపప్పు కిలో రూ.110 పలుకుతోంది. అదే వాల్‌మార్ట్‌, రిలయన్స్‌, వంటి సూపర్‌ బజార్లలోనైతే రూ.140. అంత ధర పెట్టి పేదలు కొని తినలేకపోతున్నారు. కొంచెం తక్కువకొచ్చే రేషన్‌ దుకాణాల వంక ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వమేమో డిమాండ్‌ లేదని తప్పించుకుంటోంది. ఇచ్చే అరకొరకూ ధర పెంచేసింది. రెండేళ్ల క్రితం రేషన్‌ షాపులో కిలో కందిపప్పు రూ.40 కాగా ఇప్పుడది రూ.67 అయింది. పంచదార రూ.20 కాస్తా రూ.26 అయింది. కోవిడ్‌ వేవ్‌లతో పేదల బతుకులు భారమైన సమయంలోనే ప్రభుత్వం ధరలు పెంచింది. తక్కిన కొద్దిపాటి సబ్సిడీ సైతం భరించడానికి వెనకాముందాడుతోంది. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో రేషన్‌ దుకాణాల్లో బియ్యంతోపాటు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయల వంటి 14 రకాల నిత్యావసరాలను అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒకటీ రెండు సరకులకూ కోతలు పెట్టడం పేదల పక్షపాతం ఎలా అవుతుంది? ఇంటింటికీ వలంటీర్ల ద్వారా ప్యాకింగ్‌ సంచుల్లో రేషన్‌ సరఫరా చేస్తామని చేతులెత్తేసింది. సన్న బియ్యం అని చెప్పి మాట మార్చి తినగలిగే నాణ్యమైన బియ్యం అంది. ప్రత్యేక వాహనాలను వీధి మూలమలుపుల్లో నిలబెట్టి రేషన్‌ తీసుకోమంటోంది. కూలి పనులు చేసుకొనే బీద బిక్కి రేషన్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చింది. రేషన్‌ డీలర్ల వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది.
    ఎ.పి.లో రేషన్‌ కార్డుల ఏరివేత యుద్ధ ప్రాతిపదికన సాగడం ఆందోళనకరం. ఏడాదిలో మూడున్నర లక్షల కార్డులు తగ్గిపోయాయి. సచివాలయాల్లో కొత్త కార్డుల జారీ ఒక పట్టాన జరగట్లేదు. కేంద్రం ఆదేశాలతోనే కార్డులకు కత్తెర పెడుతున్నారు. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో నగదు బదిలీ కోసం ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఎ.పి.లో గల 1.45 కోట్ల కార్డుల్లో కేవలం 89 లక్షలే ఆహార భద్రతా చట్టం పరిధిలోకొస్తాయని కేంద్ర బిజెపి ప్రభుత్వం మెలిక పెట్టింది. తతిమ్మా 56 లక్షల కార్డుల సబ్సిడీ పూర్తి భారం రాష్ట్రంపై పడింది. అన్ని కార్డులకూ ఫుడ్‌ సెక్యూర్టీని వర్తింపజేయమని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని అడగలేకపోతోంది. ప్యాకింగ్‌ సరుకులపై జిఎస్‌టి వేసినా మౌనమే. భారాన్ని తగ్గించుకునేందుకు పేదల కూటికి కోతలకు దిగుతోంది. నయా-ఉదార విధానాలొచ్చాక ప్రజాపంపిణీపై దాడి తీవ్రమైంది. ఆహారధాన్యాల సేకరణను ప్రైవేటీకరించే మోడీ ప్రభుత్వ నిర్ణయం పిడిఎస్‌ను మరింత నిర్వీర్యం చేస్తుంది. పేదలకు ఆహారాన్ని దూరం చేస్తోంది. ఈ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వెనక్కికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కోతలు లేకుండా రేషన్‌ సరుకులు అందించాలి. కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు సాధించాలి.