
వాస్తవానికి రోజంతా ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్‌కు ఆర్.ఇ విద్యుత్ అనుబంధంగా ఉండాలి. మోడీ ప్రభుత్వ వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంది. పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్‌ను ఎక్స్చేంజ్‌ల ద్వారా యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకొనేందుకు అనుమతిస్తూ సిఇఆర్‌సి ఉత్తర్వు జారీ చేసింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన కొద్దీ, విద్యుత్ కొరత పెరిగి, మార్కెట్లో విద్యుత్ చార్జీలు పెరుగుతాయని అనుభవం స్పష్టం చేస్తున్నది. ఈ మోడీ ప్రభుత్వ తలతిక్క విధానాలు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని పెంచి, వినియోగదారులపై చార్జీల భారాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని లేదా రెండింటిని పెంచాల్సిన పరిస్థితికి దారితీస్తున్నాయి.
పునరుత్పత్తి అయ్యే విద్యుత్‌ను (ఆర్.ఇ) ప్రొత్సహించే పేరుతో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఒకే అంశంపై కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ పేరుతో కాలుష్యకారకమైన బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వినియోగించటం తగ్గించాలని, ఆర్.ఇ ని ప్రొత్సహించాలని ఒకవైపు మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ విషయమై దేశంలో సాధించాలంటున్న లక్ష్యాలను ప్రధానమంత్రి అంతర్జాతీయ వేదికలపై ప్రకటిస్తున్నారు. మరోపక్క దేశంలో బొగ్గు గనుల తవ్వకానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మోడీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. దేశంలో వాణిజ్య అవసరాల పేరుతో బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నది. గనుల తవ్వకానికి, పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు అటవీ భూముల వినియోగానికి విచక్షణా రహితంగా అనుమతులు ఇస్తున్నది. పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టులకు పరిసరాల అనుమతి, కాలుష్య నియంత్రణా మండలి అనుమతి అవసరం లేకుండా మినహాయించే ముసాయిదా ప్రతిపాదనలను కూడా కేంద్రం చేసింది. మోడీ ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరులలో ఇమిడి ఉన్నది పెట్టుబడిదారుల ప్రయోజనమే. ఒకపక్క స్వదేశీ పెట్టుబడిదారులకు మరోపక్క అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ...దేశంలో పెట్టుబడి పెట్టేందుకు, విపరీత లాభార్జనకు అవకాశాలను కల్పించి, చట్ట ప్రకారం పొందాల్సిన అనుమతుల నుండి మినహాయింపు ఇవ్వడమంటే వారి పబ్బం గడపటమే.
దేశంలో కృత్రిమ బొగ్గు కొరత సృష్టిస్తూ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ థర్మల్ విద్యుత్ స్టేషన్లు విదేశీ బొగ్గును వినియోగించి కొరత లేకుండా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అత్యవసర పరిస్థితి అధికారాలను కూడా వాడుతున్నది. విద్యుత్ ఉత్పత్తికి దేశంలో బొగ్గు కొరత లేదని బొగ్గు శాఖ మంత్రి మరోపక్క ప్రకటనలు చేస్తున్నారు. విద్యుత్ స్టేషన్లకు బొగ్గు సరఫరాకు వ్యాగన్లను పెంచుతున్నట్లు రైల్వేలు ప్రకటనలు చేస్తున్నాయి. బొగ్గు రవాణాకు దేశంలో చాలినంతగా వ్యాగన్లు, ఇతర రవాణా సదుపాయాలు లభ్యం కావటం లేదని ప్రకటనలు చేసిన కేంద్రం... విదేశీ బొగ్గును దిగుమతి చేసుకున్నాక... విద్యుత్ స్టేషన్ల వరకు ఓడరేవుల నుండి సరఫరా చేసేందుకు అవసరమైన సంఖ్యలో వ్యాగన్లు, ఇతర రవాణా సదుపాయాలు ఎలా లభిస్తాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. దేశంలో బొగ్గు రవాణాకు విద్యుత్, బొగ్గు, రైల్వే, ఓడరేవుల మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులోను, బయట ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో బొగ్గు కొరతను నివారించటంలో, రవాణాకు తగిన ఏర్పాట్లు చేయటంలో విఫలమౌతున్నది.
ఒకపక్క విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని అత్యధికంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆదేశానికి విరుద్ధంగా, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ థర్మల్ విద్యుత్ కేంద్రాలను క్రమేణా మూసివేయాలని, వాటికి బదులు ఆర్.ఇ విద్యుత్‌ను చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. ఆ విధంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2023-24లో 20 శాతం, 2024-25లో 35 శాతం, 2025-26లో 45 శాతం మేరకు తాను నిర్దేశించిన లక్ష్యం ప్రకారం తగ్గించాలని ఆదేశించింది. అలా తగ్గించిన థర్మల్ విద్యుత్ సామర్థ్యం బదులు అందుకు సమానమైన సౌర, ఇతర ఆర్.ఇ విద్యుత్ సామర్థ్యాన్ని చేర్చాలని ఆదేశించింది. దానివల్ల తలెత్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్లు వ్యవహరిస్తున్నది.
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో నెలకొల్పి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న థర్మల్ విద్యుత్ స్టేషన్ల ఉత్పత్తి సామర్థాన్ని తగ్గించి, చివరకు మూసివేస్తే వాటిల్లే భారీ నష్టాలను ఎవరు, ఎలా భరించాలనేది మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటం లేదు. థర్మల్ విద్యుత్ స్టేషన్ల ఉత్పత్తి సామర్థానికి కేంద్రం నిర్దేశించిన విధంగా తగ్గించాలంటే అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అనవసరంగా అధిక ఆర్.ఇ ని కొనుగోలు చేయటం వల్ల ఇప్పటికే థర్మల్ విద్యుత్ స్టేషన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్-పిఎల్‌ఎఫ్) తగ్గించటం, పెంచటంలో ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతు న్నాయని ఇంజినీర్ల సంఘాల ప్రతినిధులు ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలలో వివరించారు. వీటిపై అధ్యయనం జరిపిస్తామని రెండేళ్ల క్రితం అప్పటి ఎపిఇపిడిసిఎల్ సిఎండి బహిరంగ విచారణలో ప్రకటించారు. కేంద్ర విద్యుత్ అథారిటీ (సిఇఎ) నియమించిన నిపుణుల కమిటీ ఆర్.ఇ ని గ్రిడ్‌లో చేర్చటంలో తలెత్తుతున్న సాంకేతిక, ఆర్థిక సమస్యలను, వాటిల్లే నష్టాలను వివరిస్తూ ఇచ్చిన నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఎపిఇఆర్‌సికి లిఖితపూర్వకంగా చేసిన నివేదనలలో పొందుపరిచాయి. 2020-21 సంవత్సరానికి ఇచ్చిన చార్జీల ఉత్తర్వులో కమిషన్ వాటిని పొందుపరిచింది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులతో డిస్కమ్‌లు చేసుకున్న దీర్ఘకాలిక పిపిఎ లలోని షరతులు చట్టబద్ధంగా వర్తిస్తాయి. ఆ ప్రాజెక్టులు ఉత్పత్తిని తగ్గించాలని కేంద్రం ఆదేశం మేరకు డిస్కమ్‌లు స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డిసి) ద్వారా ఆదేశిస్తే, ఆ మేరకు స్థిర చార్జీలను చెల్లించాలి. పిపిఎ ల గడువు ఉన్నంతవరకు వాటిని మూసివేయాలని ఆదేశించాలంటే, ఆ థర్మల్ ప్రాజెక్టులకు పిపిఎ గడువు ముగిసే వరకు సంవత్సరాలపాటు విద్యుత్‌ను పొందకుండానే డిస్కమ్‌లు స్థిర చార్జీలను చెల్లిస్తూ, ఆ భారాలను వినియోగదారులపై మోపాల్సి వస్తుంది. ఆర్.ఇ విద్యుత్ పీక్ డిమాండ్ తీర్చలేదు గనుక, దానికి అనుబంధంగా పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ వంటివి అభివృద్ధి చేయాలని నిర్ణయించి కేంద్రం అందుకు ప్రొత్సాహకాలను కూడా ప్రకటించింది.
వాస్తవానికి రోజంతా ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్‌కు ఆర్.ఇ విద్యుత్ అనుబంధంగా ఉండాలి. మోడీ ప్రభుత్వ వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంది. పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్‌ను ఎక్స్చేంజ్‌ల ద్వారా యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకొనేందుకు అనుమతిస్తూ సిఇఆర్‌సి ఉత్తర్వు జారీ చేసింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన కొద్దీ, విద్యుత్ కొరత పెరిగి, మార్కెట్లో విద్యుత్ చార్జీలు పెరుగుతాయని అనుభవం స్పష్టం చేస్తున్నది. ఈ మోడీ ప్రభుత్వ తలతిక్క విధానాలు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని పెంచి, వినియోగదారులపై చార్జీల భారాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని లేదా రెండింటిని పెంచాల్సిన పరిస్థితికి దారితీస్తున్నాయి. విద్యుత్‌ను బ్యాటరీలో నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వినియోగించుకోవటం చాలా ఖరీదైన వ్యవహారమని ప్రస్తుత పరిస్థితి నిర్థారిస్తున్నది. విద్యుత్‌ను నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు వాడుకునేందుకు నిలకడగా చవకగా ఉండే బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధి చెందితే పరిస్థితి మెరుగవుతుంది. అలాంటి పరిస్థితిలో, థర్మల్ విద్యుత్ మిగులుగా ఉన్న సమయాల్లో దానిని కూడా బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పద్ధతిలో వినియోగించుకునేందుకు వీలవుతుంది.
బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు 40-50 సంవత్సరాలపాటు పనిచేస్తాయి. ప్రతియేటా వాటికి విద్యుత్ కొనుగోలు చార్జీలలో భాగంగా అరుగుదల చార్జీల చెల్లింపుతో, పెట్టుబడి వ్యయానికి చేసిన అప్పులు, వడ్డీ చెల్లించటంతో యేటేటా వాటికి డిస్కమ్‌లు చెల్లించాల్సిన స్థిరచార్జీలు తగ్గుతాయి. క్రమేణా ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్న పాత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నవీకరించి, ఆధునీకరించటం (ఆర్ అండ్ ఎం) ద్వారా వాటి పిఎల్‌ఎఫ్‌ను పెంచుతున్నారు. కొత్తగా నెలకొల్పే బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు గణనీయంగా ఖర్చైనా కాలుష్య నియంత్రణకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లకు వీలుంది. ప్రస్తుతమున్న, కొత్తగా నెలకొల్పే ప్రాజెక్టులకు అలాంటి ఏర్పాట్లు చేయాలని కూడా కేంద్రం ఆదేశిస్తున్నది.
కేంద్ర మంత్రులు, ప్రభుత్వం, విద్యుత్ సంస్థల, బొగ్గు కంపెనీల ఉన్నతాధికారులు అంతర్జాతీయ వేదికలలో, దేశంలో వివిధ సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు బొగ్గుతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కొనసాగాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ విద్యుత్ రంగానికి బొగ్గు వెన్నెముక. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలకమైన పాత్ర. ఇది 2040 సంవత్సరం వరకు, ఆ తరువాత కూడా కొనసాగుతుంది. దేశ ఇంధన అవసరాలలో బొగ్గు అంతర్భాగం. దేశంలో బొగ్గు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, బ్రిటన్ చారిత్రకంగా పెద్ద కాలుష్య కారకాలుగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య ఉద్గారాల విడుదల నియంత్రణకు అంతర్జాతీయ సహకారం అవసరం. అనేక దేశాలతో పోల్చితే దేశంలో తలసరి బొగ్గు వినియోగం చాలా తక్కువ. బొగ్గుతో ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ బదులు ఆర్.ఇ ని చేర్చటం అనేక సమస్యలతో కూడుకున్నది. ఇది క్రమేణా జరగాలి.
వచ్చే కొద్ది దశాబ్దాలలో బొగ్గు వినియోగాన్ని నిలిపివేయటం సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నీ అధికారికంగా వెలిబుచ్చిన అభిప్రాయాలే. ప్రజలపై భారాలను తగ్గించేందుకు, ప్రజావసరాలు తీర్చేందుకు అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. దీర్ఘకాలిక ప్రాతిపదికన అధిక చార్జీలకు ఆర్.ఇ ని కొనుగోలు చేసేందుకు మితిమీరి చేసుకున్న పిపిఎ ల ఫలితంగా...వినియోగదారులపై నివారించదగిన భారాలు కొనసాగుతున్నాయి. ఆర్.ఇ ని ప్రొత్సహించటం దశల వారీగా జాగ్రత్తగా జరగాలి. హెచ్చుతగ్గులకు లోనవుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు సాధ్యమైనంత వరకు మిగులు విద్యుత్ తక్కువగా ఉండే విధంగా వివిధ రకాల విద్యుత్ మిశ్రమంలో సాంకేతికంగా సాధ్యమైన మేరకు సమతూకం ఉండేలా సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. సానుకూల, ప్రతికూల అంశాలను, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఈ దిశలో పరిశోధన, అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలి.
/వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు/
ఎం. వేణుగోపాలరావు