Sep 04,2022 06:58

సమకాలీన సమాజంలో అత్యంత ప్రభావితం చేయగల మాధ్యమం సినిమా. కదిలే బొమ్మలు మనిషిని పరవశింప చేయడమే కాదు, కలల ప్రపంచాన్నే సృష్టించగలవు. అనాదిగా ప్రదర్శితమౌతున్న నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, తోలుబొమ్మలాటలు వంటి ఎన్నో కళలను సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి, ప్రజల ముందుంచగలది సినిమా. సినిమాకు సంబంధించిన కథ, కథనం సమకాలీన సమాజం నుంచే స్వీకరిస్తారు గనుకనే అందులోని పాత్రలు, వాటి స్వభావాలు మంచిగానో, చెడ్డగానో సామాన్య ప్రజలపై ఏదోకమేర ప్రభావం చూపుతాయి. చాలా సందర్భాల్లో సినిమాల్లోని పాత్రలు నీడలా మనను వెన్నాడతాయి. అయితే, ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి కొన్ని పాత్రలకు బాగా కనెక్ట్‌ అవుతుంటారు. ముఖ్యంగా యువతపై సినిమా హీరోల ప్రభావం ఎక్కువ. సినిమాలోని హీరో, హీరోయిన్‌ లేదా విలన్‌ మాదిరిగా వారి మేనరిజంను అనుకరించడం, వారి స్వభావాన్ని ఆవాహన చేసుకోవడం పరిపాటి. తెరపై కదలాడే పాత్రలు ప్రేక్షకులను కథలో భాగస్వాముల్ని చేస్తాయి. తెరపై హీరో డైలాగ్స్‌, స్టైల్స్‌, డాన్సులు, ఫైట్లు, సిక్స్‌ప్యాక్‌లు నిజ జీవితంలోనూ భాగమౌతాయి. అమ్మాయిలైతే... హీరోయిన్లను అనుకరిస్తూ, నాజూకుగా వుండాలని, ఆ తరహా డ్రెస్సులు, మేకప్‌లు చేసుకోవాలని కలలు కంటారు.
     సినిమాల ప్రభావం తెలుగువారిపై ఎక్కువ. కళ, నటన, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు సినిమాగా రూపు దిద్దుకుంటాయి. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం...అన్నీ కలగలిసిన రంగుల కల సినిమా. 'జీవితం బంగారం లాంటిదైతే...అందులో మనకు కావలసినంత మాత్రమే తీసుకుని రమణీయంగా తయారు చేసుకునే ఆభరణం లాంటిది కథ' అంటాడు మధురాంతకం రాజారాం. ఇతివృత్తం గురించి చెబుతూ-'మనం మట్టి తీసుకుంటే మట్టిపాత్ర, బంగారం తీసుకుంటే బంగారుపాత్ర తయారవుతాయి' అంటాడు పోరంకి దక్షిణామూర్తి. సమాజంలో ఎదురయ్యే అనుభవాలను అందంగా అనుభూతి కలిగించేలా చెప్పేది కథ అయితే, ఆ కథను పాత్రలుగా మలిచేది సినిమా. కానీ కొన్ని సినిమాలు జిమ్మిక్కులతో యువతను వెర్రెక్కిస్తాయి. అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన ఒక సినిమాను చూసిన యువకులంతా షర్ట్‌ చేతులు పైకి తొయ్యటం, సైకిల్‌ చైన్‌లతో కొట్టుకోవటం చేసారు. ఆ తర్వాత మరో సినిమాలో హీరో... మెడికల్‌ కాలేజీలో అధ్యాపకుడుగా, డాక్టర్‌గా మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తాడు. ఆ పాత్ర మెడిసిన్‌ చదువుతున్న కొందరు యువకులకు రోల్‌ మోడల్‌గా మారి, పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లాల్సి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో మూడక్షరాల బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను చూసిన ఓ టీనేజర్‌...ఆ సినిమాలో హీరోలా తనూ ఫేమస్‌ కావాలనుకున్నాడట. అందుకోసం సీరియల్‌ కిల్లర్‌గా మారిపోయి, ఏకంగా ఐదు హత్యలకు పాల్పడ్డాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకున్నాడు. చివరకు దొరికిపోయాడు. అయితే, తన తర్వాతి టార్గెట్‌ పోలీసులే అని విచారణలో తెలపడం కొసమెరుపు.
     'పిల్లలు మన ఆస్తులకు వారసులు కాదు...మన విలువలకు వారసులవ్వాలి' అనేది ఓ సినిమాలో పాపులర్‌ డైలాగ్‌. నేటి విలువలను, వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంటుంది. గతంలో సినిమాలు సామాజిక కోణంలో, కుటుంబ విలువల నేపథ్యంలో వుండేవి. నేటి అనేక సినిమాలు అశ్లీలత, నేరాలను ప్రోత్సహించేవిగా, యువతను పెడదోవ పట్టించేవిగా వుంటున్నాయి. చెడుని యూత్‌ ఐకాన్‌గా చూపించే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. సినిమా ప్రారంభంలో మద్యం, హింస, అశ్లీలత నిషేధం అని హెచ్చరిక వేస్తారు. కానీ ఆ సినిమాలో అవన్నీ వుంటాయి. సినిమా చివరలో వాటివల్ల కలిగే నష్టం చూపిస్తారు. కానీ ఆయా పాత్రల స్వభావం యువత మనసులపై గట్టిగానే ముద్రితమౌతుంది. పర్యవసానంగా ఆ పాత్రల్లోకి పరకాయప్రవేశం చేస్తారు. సినిమాల్లో ఏ అంశాన్నయితే బలంగా చెబుతారో, అదే యువతను ఆకర్షిస్తోంది. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలు, కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రాలు వచ్చినప్పుడు యువతరం కూడా అటువైపే అడుగులు వేస్తుంది. ఏ భాషా చిత్రాలైనా దీన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించాలి. సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి.