
భారత్‌తో సహా భూగోళమంతటా ఎండలు దంచికొడుతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు తగ్గడం లేదు. రాబోయే దశాబ్ద కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) ఉష్ణోగ్రత ధోరణుల నివేదికలో హెచ్చరించింది. పారిశ్రామిక విప్లవ ఫలితాలను తొలుత అందుకున్న అమెరికా, ఇంగ్లండ్ వంటి పశ్చిమ దేశాలు వాతావరణంలోకి విచ్చలవిడిగా కర్బన ఉద్గారాలు వెదజల్లడమే భూతాపానికి ప్రధాన కారణం. ప్రపంచ పర్యావరణ శిఖరాగ్ర సదస్సుల్లో భూ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల వద్దే నిలువరించాలని నెత్తినోరూ బాదుకుంటున్నా.. భూతాపానికి కారణమై తెగ బలిసిన దేశాలు ప్రధానంగా అమెరికా నిస్సిగ్గుగా బాధ్యతను విస్మరించి పర్యావరణ సదస్సుల నుంచే పారిపోతోంది. వర్థమాన, పేద దేశాలు తాము మూల్యం చెల్లించలేమంటూ నిస్సహాయత ప్రకటిస్తున్నాయి. నవతరం ప్రతినిధిగా గ్రెటా థంబెర్గ్ వంటి పర్యావరణ కార్యకర్తలు 'మా భవిష్యత్తును నాశనం చేయడానికి మీకెంత ధైర్యం?' అని సంధించిన ప్రశ్నలకు సంపన్న దేశాల నుంచి ఉలుకూపలుకు లేదు. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అరికట్టలేకపోతుండటంతో 2030 తర్వాత భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరిమితిని మించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అంతకంటే ముందే ప్రమాదం ముంచుకోస్తోందని.. ఎల్ నినో, లా నినా ప్రభావాల కరాణంగా ఈ ఏడాది నుంచి 2027 మధ్యలో ఎప్పుడైనా భూతాపం 1.5 డిగ్రీలకు మించిపోయే వీలుందని డబ్ల్యుఎంఒ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది.
భూభాగమే కాదు.. మహాసముద్రాలు కూడా అధిక ఉష్ణోగ్రతలతో మండిపోతున్నాయి. చల్లదనాన్ని నిచ్చే 'లా నినా' మూడేళ్ల పాటు కొనసాగడం వల్ల మానవ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వేడికి కాస్తయినా పగ్గాలు పడ్డాయి. కానీ ఈ ఏడాది 'లా నినా' పక్కకు తొలగి అత్యుష్ణాన్ని జనింపజేసే 'ఎల్ నినో' ముందుకొస్తోంది. 2016లో ఎల్ నినో రికార్డు ఉష్ణోగ్రతలకు కారణం కాగా 2027 లోపు ఆ రికార్డు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని డబ్ల్యుఎంఒ నివేదించింది. లా నినా స్థానంలో ఎల్ నినో ప్రవేశించినందున గత మూడేళ్లలో వరదలు వచ్చిన చోట ఇప్పుడు అనావృష్టి..అనావృష్టి నెలకొన్న చోట అతివృష్టితో వరదలు సంభవించే వీలుందన్న శాస్త్రవేత్తలు హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్రాలు వేడెక్కడమంటే..తుఫానులు పొంచి వున్నాయనే అర్థం. మయన్మార్‌లో ఇటీవల విరుచుకుపడిన మోచా తుఫాను కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ తీరప్రాంతమున్న భారత్‌పై ప్రపంచ వాతావరణం మార్పుల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. పెట్టుబడిదారీ దేశాల కారణంగా చోటుచేసుకుంటున్న అసమతుల్య వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. విపత్తుల నివారణ సామర్థ్యాలను మెరుగుపర్చుకొని, సహాయక చర్యలకు సంబంధిత మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం.
ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వడదెబ్బకు వందలాది మంది బలైపోతున్నారు. కరెంటు కోతల వెతలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం కార్మికులు పని ప్రదేశాల్లోనే తనువు చాలిస్తున్నారు. వేసవి వేళ గతంలో ఉదయం పూట పని చేసే సౌకర్యముండేది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేసవి బోనస్ రద్దు చేయడంతో పాటు రెండు పూటలా మస్టర్ అనే నిబంధనను రుద్దడంతో మండు వేసవి లోనూ పని చేయక తప్పని పరిస్థితిలోకి కార్మికులను నెట్టేసింది. అందువల్ల మండుటెండకు బలైపోతున్న ఉపాధి కార్మికుల మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏపి, తెలంగాణ లోనూ పదుల సంఖ్యలో ఉపాధి కార్మికులు చనిపోతున్నారు. వేసవిలో పని ప్రదేశాల్లో నీడ ఏర్పాటు, మజ్జిగ, త్రాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి చలువ చేసే సదుపాయాలు కల్పించడం ఉపాధి హామీ చట్టంలోనే నిర్దేశించినా.. పాలకులు పట్టించుకోవడం లేదు. కేరళ లోని వామపక్ష ప్రభుత్వం ఇలాంటి విపత్తుల నుంచి ఉపాధి కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. సంక్షేమ రాజ్యాలుగా గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు కూడా కేరళ తరహాలో ఉపాధి కార్మికులను ఆదుకునేందుకు కృషి చేయాలి. వాతావరణ మార్పుల ప్రభావాలకు ప్రజలు బలైపోకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలి.