నెర్రెలు బారిన దుఃఖంలాంటి ఎండు మట్టి తన లోపలి వాసనను వ్యాపించడానికి ఓ తడి చుక్కకోసం ఎదురుచూడడం తెలియని నీకు అంతర్ముఖ అక్షాంశ రేఖాంశాల ఒడ్డు పొడుగు తెలియని నీకు నా కలకు ఎంత మెలకువనిచ్చినా నిట్టూర్పు మాట వినదన్న చీకటి శబ్దమూ తెలియకూడని నీకు వెలుగు మౌనగుణింతం తెలియక పోవచ్చు కామోసట కదా మరి బాధా చారికలకు చుట్టిన మెరుపు తగరం వెల వెల బోయిన వేళ ఆనంద భాష్పాలను కరెంటు తీగమీద వదిలిన వాన చినుకుల పూసలదండ ముత్యాలసరం గుండె నేలని చీల్చిన నదీ పాయగా పారి ఎక్కిళ్ళు పెట్టిన మరుక్షణాన విత్తు ఏకంగా వృక్షమై ధ్వజస్తంభంలా పసుపూ కుంకుమ పులుముకుంటుందేమో లేదూ ఒక చెక్క సింహాసనమై నరమాంసాన్ని చప్పరిస్తుందేమోనని రాజూ మతమూ కరచాలన కుట్ర పన్నుకుని కసి కసిగా హింసాస్మతి
అమలు చేసీ చేసీ అలసి కత్తులను వారసులకు బహూకరించడం సుభిక్షితం కనుకనే ఉద్యమ లగేజీనంతా దింపేసి దాస్ కేపిటల్‌లోకి పారిపోవచ్చని మతాన్ని నమ్మొచ్చు రాజ్యాన్ని అమ్మొచ్చునని సామ్యవాదం కోసం బతికినట్టు నటిస్తే ధనసామ్యవాదం ఎదురొచ్చి మరీ భళా కామ్రేడ్ అంటుంటే కొయ్యగుఱ్ఱం పాదముద్రలు పూల వాసనకే కళ్ళు తిరిగి దారి తప్పుతున్నాయని వయసు మళ్ళిన యోధులు రెండువేలకు అమ్మి కొనుక్కున్న వేలి చివరి ఇంకు మరక మంచిదే అన్న సిగ్గులేని నగత్వానికి సీతాకోక కట్టి రెక్కలు విరిచి తోకకు దారం కట్టిన ఆటోక్రటిక్ తూనీగతో లివిన్ కాపురానికి అప్పగింతలు పెడితే ఓ నా పెజాస్వామ్యమా అది రామరాజ్యం టు ది పవరాఫ్ నియంతం అందుకే భిక్షాందేహీ అన్నపుడల్లా కొన్ని బడ్జెట్లో ఇంకొన్ని ఫ్రీబీలో విదిలిస్తున్నావ్ లే ఎవరూ తినని పుల్లమామిడి వేవిళ్లకు నోరూరించిన నీటి జల ఎండమావై జమ్మిచెట్టు మీది శవరూప ఆయుధాగారంగా మురిగినా వీరత్వం మాత్రం రాజ్యాంగం సెక్షన్ల అంకెలూ అల్ఫాబెట్ల సంకర భాషలో భావాలు వెతుక్కుంటుందని దారి దొరకని దీపంలేని గమ్యం తెలియని నడకతో కొన్ని జబ్బులని ఓదార్చాలి ఇంకొన్ని మరణాలనూ శ్వాసించి కలల్ని ఒక పేరాశతో భద్రపరుచుకుని కొన్ని విశ్వాసాలను వాయిదాలలో తీర్చుకోవాలి మహా వాక్యాలతో
ప్రజ్ఞానం బ్రహ్మం అహమ్ బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మం!!
చైతన్యం శూన్యం కనుక
నేను దేవుడవలేను కాబట్టి
దేవుడే సర్వస్వమూ కాదంచేత
ఆత్మ బ్రహ్మం కానే కాదులే !!
- ప్రసేన్
(నా విప్లవ గీతానికి నా ఆబ్ స్ట్రాక్ట్ అనువాదం)