Dec 24,2022 07:38

          ఆఫ్ఘనిస్తాన్‌లో విశ్వవిద్యాలయాల్లో మహిళల విద్యను నిషేధిస్తూ అక్కడి తాలిబన్లు నిర్ణయించడం అత్యంత గర్హనీయం. తాలిబన్‌ అంటే పష్నో భాషలో విద్యార్థి అని అర్థం. అమెరికా నేర్పిన పాఠాలను ఒంటబట్టించుకున్న సాయుధ తాలిబన్ల్లు ఇప్పుడు మహిళల విద్యను తొక్కిపడుతున్నారు. తాలిబన్ల పుట్టుక, పెరుగుదల అంతా అమెరికా ఒడిలోనే జరిగిందన్నది జగమెరిగిన సత్యం. దశాబ్దాల పాటు సాగిన సామ్రాజ్యవాద, సైనిక కూటమి నిరంకుశ పాలన నుంచి స్వీయ పాలన దిశగా అడుగులు వేయాల్సిన ఆఫ్ఘనిస్తాన్‌ మతఛాందసవాదుల చేతిలో చిక్కుకోవడంతో ఆఫ్ఘన్‌ మహిళల పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడిన చందమైంది. అమెరికా అనుంగు పాలకులు ఆఫ్ఘన్‌ నుంచి పలాయనం చిత్తగించాక.. సాయుధ తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌గా ప్రకటించిన తాలిబన్లు తమ ప్రభుత్వం మహిళల హక్కులను గౌరవిస్తుందని హామీ ఇచ్చారు. అయితే, షరియత్‌ చట్ట పరిధిలోనే అంటూ మెలిక పెట్టడంతో ఆ హామీలు నీటి మీద రాతల వంటివేనని అప్పుడే తేలిపోయింది. 1990లలో తాలిబన్ల అరాచకాలను ప్రత్యేకించి మహిళలు, ఆదివాసీ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని సాగించిన దాడులను, అణచివేత చర్యలను ప్రత్యక్షంగా చూసిన అంతర్జాతీయ సమాజం, మహిళా సంఘాలు ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాత పాలన పునరావృతమవుతుందంటూ వెలిబుచ్చిన ఆందోళన సరైనదేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
           ఆఫ్ఘన్‌ మహిళలకు ఈ విధమైన ఆంక్షలు, అణిచివేత చర్యలు కొత్తేమీ కాదు. 1996-2001 మధ్య తాలిబన్ల ఏలుబడిలో వీరు తీవ్ర అణచివేతకు గురయ్యారు. ఆ తర్వాత అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి పాలనలో మహిళలు, ఆదివాసీలపై హింస మరింతగా పెచ్చరిల్లింది. నాటో కూటమి సైనికుల దాష్టీకాలకు మహిళలే ఎక్కువగా సమిధలయ్యారు. మానవ హక్కులను అమెరికా సైన్యం అడుగడుగునా మంట గలిపింది. వీరికంటే తాలిబన్లే నయమనిపించేంతగా అకృత్యాలు సాగించారు.
         ఆసియాలో ప్రజాస్వామిక, సామ్యవాద ఉద్యమాలపై కక్ష కట్టిన అమెరికన్‌ సామ్రాజ్యవాదమే తాలిబన్ల వంటి మితవాద, తిరోగమన, మతతత్వ శక్తులకు ఆర్థికంగానూ, సైనికంగానూ, రాజకీయంగానూ ఊతమిచ్చి ఎగదోసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలకు విద్య దక్కడం లేదంటూ అమెరికా, బ్రిటన్‌ తదితర నాటో సభ్య దేశాలన్నీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఈ అరాచకాలకు విత్తులు నాటింది...కాలనాగు లాంటి తాలిబన్లను పెంచి పోషించింది.. .అమెరికాయేనన్న విషయం ఎవరికీ తెలియనిది కాదు. సౌదీ అరేబియా, యుఎఇ వంటి ఇస్లామిక్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా తాలిబన్ల చర్యను ఖండించింది. కానీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంఫ్‌ు పరివార్‌ కనుసన్నల్లో చేస్తున్నదేమిటి? మహిళల హక్కులను కాలరాస్తూ అది సాగిస్తున్న అరాచకాలు.. తాలిబన్ల చర్యలకు ఏమాత్రం తీసిపోనివి. దేశ రాజధానిలో మహిళలను ముక్కలుముక్కలు కోసి చంపేస్తున్నా మోడీ సర్కార్‌కు ఆడబిడ్డల రక్షణ పట్టడం లేదు. బేటీ బచావో..బేటీ పఢావో అన్నది నినాదాలకే పరిమితమౌతోంది. విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనాలు కుదించడం, ఫీజులు పెంచడం, 'నిర్భయ' నిధులు నిరాకరించడం వంటి చర్యలతో మహిళల విద్యను నిరాకరిస్తోంది. తాలిబన్ల చర్యలను ఖండించడం వెనుక ఇస్లామోఫోబియోను పెంచి ఓటు బ్యాంకుగా మార్చుకునే తపన తప్ప మహిళల విద్య పట్ల కానీ, రక్షణ పట్ల కానీ మోడీ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు.
          ఆకాశంలో సగభాగమైన మహిళల హక్కులకు ఎక్కడ ఏ రూపంలో భంగం కలిగినా అంతర్జాతీయ సమాజం ఒక్కటై కదలాలి. సామ్రాజ్యవాదం, మతోన్మాదం, నయా ఉదారవాదం మహిళలపై సాగిస్తున్న ఈ ముప్పేట దాడులను తిప్పికొట్టాలి. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం గొంతెత్తుతున్న నేటి ఆఫ్ఘన్‌ మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. సామ్రాజ్యవాద, మతతత్వ శక్తులను ఒంటరిపాటు చేసినప్పుడే మహిళల హక్కులకు, మానవ హక్కులకూ రక్ష .