Oct 18,2022 11:28
  • ఆర్‌ఎస్‌ఎస్‌, గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో కాంగ్రెస్‌ సత్తా
  • తొమ్మిది చైర్‌పర్సన్‌, ఎనిమిది డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవులు కైవసం

ముంబయి : మహారాష్ట్రలో అధికార బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ్‌పూర్‌ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయపార్టీకి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్‌ సత్తా చాటింది. అధిక స్థానాలను కైవసం చేసుకున్నది. బిజెపి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కేంద్రం, సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బువాంకులే ల సొంత జిల్లా నాగ్‌పూర్‌ లోనే ఇలాంటి ఫలితాలు రావటం బిజెపికి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 

                                                          ఒక్క చైర్‌పర్సన్‌ పదవినీ పొందని బిజెపి

నాగ్‌పూర్‌ జిల్లాలో పంచాయతీ చైర్‌పర్సన్లు, డిప్యూటీ చైర్‌పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం.. బిజెపి వీటిల్లో ఒక్క చైర్‌పర్సన్‌ పదవినీ పొందలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్‌పర్సన్‌ సీట్లకే పరిమితమైంది.

మొత్తం 13 చైర్‌పర్సన్‌ పోస్టులకు గానూ హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 13 డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవులకు గానూ ఎనిమిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఇక నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మూడు చైర్‌పర్సన్‌ పదవులను గెలుపొందింది. శివసేన ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్‌ గెలుపొందిన వాటిలో సావోనేర్‌, కల్మేశ్వర్‌, పార్సియోని, మౌడా, కాంప్టీ, ఉమ్రేడ్‌, భివాపూర్‌, కుహి, నాగ్‌పూర్‌ రూరల్‌ లు ఉన్నాయి. కటోల్‌, నార్ఖేడ్‌, హింగ్నా స్థానాలను ఎన్‌సిపి గెలుచుకున్నది. రామ్‌టెక్‌ చైర్‌పర్సన్‌ పదవిని శివసేన గెలుచుకున్నది. రామ్‌టెఖ్‌ సీటును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని 'బాలాసాహేబంచి శివ సేన' సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.