
వయసు మీద పడుతున్నా పెళ్లి కాక ఇబ్బందులు పడే హీరో.. తన కన్నా పదేళ్లు చిన్నదైన హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఎలాంటి బాధ్యతలు లేని స్నేహితులతో తిరగడం ప్రతి పల్లెటూరులో కనిపించే దృశ్యం. దానికి ఓ క్రైమ్‌ను జోడించి, ఆసక్తికరమైన కథతో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' చిత్రం తీశాడు దర్శకుడు చందు. ఇటువంటి విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఏమాత్రం కొత్తకాదు. కానీ నడిచినంత సేపు నవ్వులతో, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ పల్లెటూరు వాతావరణంలో ఉంటున్న అనుభూతి కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
కథలోకి వెళితే 1980 దశకం అది. గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అందమైన పల్లెటూరు. ఆ ఊళ్లో చంటి (చైతన్యరావు) తన స్నేహితుడితో కలిసి తల్లి పేరు మీద అన్నపూర్ణ ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. జ్యోతిష్యం చెప్పే తన తండ్రికి చుట్టుపక్కల ఎంతో మంచిపేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. స్నేహితులంతా ఎగతాళి చేస్తుంటారు. ఇంతలోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్టపడుతుంది. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అనుకోకుండా చంటి ఓ హత్య కేసులో నిందితుడిగా అరెస్టవుతాడు. దాంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. చివరికి చంటి, గౌతమి ఒక్కటయ్యారా? లేదా? అనేది సినిమా.
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో చైతన్యరావు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోలతో పాటు హిట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. సినిమాలో పాతకాలపు హీరో వేషధారణ, గోదావరి యాస, కామెడీలో టైమింగ్ ఆకట్టుకుంటుంది. లావణ్య అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. స్వచ్ఛమైన ఓ పల్లెటూరి ప్రేమకథ ఇది. సాంకేతికత లేని ఆ రోజులు ఎలా ఉండేవో.. మనుషుల్లోని అమాయకత్వం ఎంత అందంగా ఉండేదో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌కు తగ్గట్టుగా సంగీతంతో 1980ల కాలాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. కేవలం ప్రేమకథే కాదు.. ఇందులో ఓ మంచి థ్రిల్లింగ్ అంశం కూడా ఉంటుంది. కథా నాయకుడి ఆత్మహత్యా ప్రయత్నంతో సినిమా ప్రారంభమవుతుంది. 'పెళ్లి కాని ప్రసాద్' అని స్నేహితులు ఏడిపించినా వాటన్నింటినీ సరదాగా తీసుకుంటూ.. హీరో తన జీవితాన్ని స్వచ్ఛంగా గడపుతాడు. ప్రథమార్ధంలో హాస్యం పాళ్లు ఎక్కువ. అప్పటిదాకా సరదా సన్నివేశాలతో హాయిగా సాగే కథలోకి ఓ వ్యక్తి హత్య కొత్త మలుపుతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలా కథని నడుపుతూ వెళ్లిన దర్శకుడు చివర్లో మరికొన్ని మలుపులతో ప్రేక్షకుల్లో ఓ మంచి అనుభూతిని పంచుతారు.సెకండాఫ్‌లో క్రైమ్ ఎలిమెంట్స్‌తో కథ సాగుతుంది. పల్లెటూరు వాతావరణానికి తగ్గట్టుగా పాటలు, లొకేషన్లు సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
- కొత్త నటులతో..
చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర, స్నేహితుడిగా లలిత్ ఆదిత్య, మరో పాత్రలో మిహిరా మంచి అభినయం ప్రదర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ కనిపించే వైవా రాఘవ పాత్ర కూడా బాగా నవ్విస్తుంది. నిర్మాత యష్ రంగినేని కథని మలుపు తిప్పే ఓ కీలకపాత్రలో కనిపించారు. కొత్త నటులతో దర్శకుడు సహజమైన నటనని రాబట్టుకున్నారు. సంగీతం కూడా మెప్పిస్తుంది. దర్శకుడు చందు తాను అనుకున్న కథని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. మాటలతో అక్కడక్కడా మెరిపించిన కథ రచనలో ఆయన మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది.
చివరిగా ఒక మాట చెప్పాలి. అదేంటంటే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీతో కలిసి చూసే కుటుంబ కథా చిత్రం 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'.