Jun 27,2023 06:43

  • నేడు హెలెన్‌ కెల్లర్‌ జయంతి

నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో అవరోధాలను పట్టుదలతో అధిగమిస్తూ... చీకట్లో సైతం వెలుగులు చూడగలిగే ధైర్యాన్ని, చైతన్యాన్ని అందించిన ధీశాలి హెలెన్‌ కెల్లర్‌. 1880 జూన్‌ 27న అమెరికా లోని టస్కంబియ అనే చిన్న గ్రామంలో హెన్రీ కెల్లర్‌, కేట్‌ అడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు జన్మించింది హెలెన్‌ కెల్లర్‌. 19 నెలల వయస్సులోనే తీవ్ర అనారోగ్యం కారణంగా దృష్టిని, వినికిడి శక్తిని కోల్పోయింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సూచన మేరకు బ్లైండ్‌ స్కూల్‌లో చేరి చదవడం నేర్చుకుంది. శస్త్ర చికిత్స ద్వారా దృష్టి పొందిన సలీవన్‌నను 1887 మార్చి 3న ఆమెకు ఉపాధ్యాయనిగా నియమించారు. సలీవన్‌ కృషితో... తాకడం, వాసన ద్వారా అనేక పదాలను నేర్చుకుంది. 1890లో చదవడం, రాయడం నేర్చుకుని 1904లో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా పొందింది హెలెన్‌ కెల్లర్‌. 1902 లోనే ''స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌'' అనే పుస్తకాన్ని ప్రచురించి చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకం 50 భాషల్లో ముద్రించబడింది. దీనిని లేడీస్‌ హోమ్‌ జర్నల్‌ అనే పత్రిక సీరియల్‌గా ప్రచురించింది.
          చూపు లేకపోయినా, మాట వినికిడి లోపం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా వికలాంగులకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు, చైతన్యపరచేందుకు 39 దేశాలు పర్యటించింది. అమెరికన్‌ సోషలిస్ట్‌ పార్టీలో చేరి వికలాంగులు, మహిళలు, బాలలు, కార్మికవర్గ హక్కులు సంక్షేమపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసింది. ఆమె ఉపన్యాసాలతో అనేక మంది స్ఫూర్తి పొందారు. ఆమె రాసిన 12 పుస్తకాలు ప్రపంచంలో అనేక భాషల్లో ముద్రితం అయ్యాయి. వికలాంగులకు సేవ చేయడం కోసం తన వైవాహిక జీవితాన్ని సైతం తిరస్కరించిన గొప్ప యోధురాలు హెలెన్‌ కెల్లర్‌. 1924లో 'అమెరికన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌' సంస్థను స్థాపించి ప్రపంచ దేశాలు పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను సేకరించింది. 'మిరాకిల్‌ కంటిన్యూస్‌' అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి వచ్చిన నిధులను ఫౌండేషన్లో జమ చేసింది. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ బ్లైండ్‌ సంస్థకు అధ్యక్షురాలుగా ఎంపికై అనేక పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రించింది. ఆమె రాసిన అనేక పుస్తకాలు అంధులకు, బధిరులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సలీవన్‌ తో పాటుగా థామ్సన్‌, వినరు కర్బల్లి (నర్సు) హెలెన్‌ కెల్లర్‌కు ఉపాధ్యాయులుగా కొనసాగారు. వికలాంగుల హక్కుల కోసం, మహిళలు, బాలలు, సోషలిజం, కమ్యూనిజం కోసం వ్యాసాలు రాయడానికి ఆమెకు సహాయం చేశారు. 1903-1965 వరకు అమెరికా అధ్యక్షులందరికీ...వికలాంగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేఖలు రాసింది. ప్రతి ఒక్క లేఖకు వారందరూ తిరిగి సమాధానం పంపించారంటే ఆమె చేస్తున్న కృషి పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం. హెలెన్‌ కెల్లర్‌ 'ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌' అనే డాక్యుమెంటరీకి 1955లో ఆస్కార్‌ అవార్డు లభించింది. 1964లో అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బి.జాన్సన్‌...హెలెన్‌ కెల్లర్‌ను తమ దేశ ముద్దుబిడ్డగా ప్రకటించడమే గాకుండా 'ప్రెసిడెన్షియల్‌ మోడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌' అనే అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. హెలెన్‌ కెల్లర్‌ జీవితాంతం చేసిన కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఆమె పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయి. 1968 జూన్‌ 1న మరణించే వరకు కూడా నిరంతరం ఆమె వికలాంగుల సంక్షేమం, హక్కుల కోసం పరితపించారు.
- ఎం.అడివయ్య,
ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు,
సెల్‌ : 94900 98713