Jan 22,2023 09:38

వైద్య విద్యనభ్యసిస్తున్న నూనుగు మీసాల నూతన యవ్వనంలో తానెవ్వరో, తానేమి చేయాలో అన్వేషిస్తూ మోటారు సైకిలెక్కి దక్షిణ అమెరికా బాట పట్టిందో మిత్రద్వయం. 1952లో 21 ఏళ్ల ఎర్నెస్టా చే గువేరా తన మిత్రుడు అల్బెర్టో గ్రనెడో శక్తివంతమైన 500 సిసి నోర్టన్‌ మోటార్‌ సైకిల్‌పై సాగించిన ఆ సాహోసోపేత యాత్ర నేటికీ అనుసరణీయమైన వెలుగుబాటలేసింది. వ్యక్తిత్వ వికాసానికి అయినా, విప్లవ సన్నద్ధానికైనా చే జంట సాగించిన యాత్ర ఒక ద్వీపద్వజం. చే అంటే ఏమిటో, ఆకాంక్షలేమిటో, అన్వేషణ దేనికో, సాధించాల్సిందేమిటో, సంతృప్తి ఎప్పుడో ఇలా తన ప్రశ్నలకు తానే బదులౌతూ తననుతాను ఆవిష్కరించుకున్న అద్వీతయమైన వెలుగుజిలుగుల, కష్టసుఖాల వాస్తవిక కదంబం ఆయన సాగించిన యాత్ర. చే వైద్య విద్యనభ్యసిస్తూనే మిత్రుడు గ్రనెడోతో కలిసి సాగించిన మోటారు సైకిల్‌ యాత్ర, ఆ తర్వాత లాటిన్‌ అమెరికా పర్యటన ఆయన జీవితంలో ఒక మహోజ్వల ఘట్టంగా నిలిచింది. కొద్దిపాటి తీరంలోనే సముద్రం నాట్యమాడిందని అభివర్ణిస్తూ, ఆండీస్‌ పర్వత శ్రేణుల సోయగాలను ఆస్వాదిస్తూ ప్రకృతి సోయగాలను కొనియాడుతూ ప్రకృతి పట్ల ఎనలేని ప్రేమను చాటుకున్న హరితబాంధవుడాయన. పండు ముదసలి ఆవిడ వైద్యం కోసం వస్తే ఆమెకు వైద్యం అందించే వైద్యుడు ఆ పండు ముదసలి మహిళ పట్ల అనుసరించాల్సిన వృత్తి బాధ్యత ఎలా ఉండాలో తలచుకుంటూ పేదల పట్ల, శ్రమ జీవుల పట్ల సాటి సమాజ ప్రవర్తన తీరు ఎలా ఉండాలో స్పష్టీకరించిన పయణం ఆయనది. లా గియొకొండాలో పర్యటిస్తున్న సమయంలో ఒక హోటల్‌ బస చేసిన చే అక్కడే పనిచేస్తున్న ఒక ఉబ్బసపు వ్యాధిగ్రస్తులైన మహిళ గురించి ఇలా రాశారు. ''ఆమె దాదాపు చివరి రోజుల్లో ఉందా అనిపించింది. ఆమె గది నిండా దుమ్ము దూళి నిండి ఉంది. ఆ దుమ్మ నుండి వచ్చే వాసన ఆమెకు మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. ఆ గదిలో ఉన్న పడక కుర్చీ ఒక్కటే విలాసవంతమైన వస్తువు. ఉబ్బసం వ్యాధికి తోడు ఆమెకు హృద్రోగ సంబంధమైన వ్యాధి కూడా ఉంది. ఇటువంటి సమయాల్లోనే వైద్యులు ఆమె నిస్సహాయత గురించిన అవగాహన కలిగి ఉన్నవాడైతే, మార్పును కోరుకునేవాడైతే, ఒక నెల క్రితం వరకు హోటల్‌లో కార్మికురాలిగా ఈ మహిళ సగర్వంగా తన జీవితం గడిపేందుకుగాను తన వేతనం తీసుకునే స్థితి నుండి ఆమెకు కలుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించివుండేవాడు' అని సమాజం పట్ల అస్సలైన వృత్తిధర్మమేమిటో చే స్పష్టం చేశారు. చిలీలో ఖనిజ సంపద గురించి, రాగి గనుల్లో పనిచేసే కార్మికుల గురించి ఆవిష్కరించిన అంశాలు యుక్తవయస్సులోనే చే లో గూడుకట్టుకున్న శ్రామిక పక్షపాత ధోరణికి దర్పణం పడుతుంది. 'ప్రపంచంలో ఉత్పత్తయ్యే రాగిలో 20 శాతం చిలీలోనే ఉత్పత్తి అవుతుంది. రాగి ఉత్పత్తి ఘర్షణలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వామపక్షవాదులు, జాతీయ వాదుల కూటమి ఈ గనులను జాతీయం చేయాలని డిమాండ్‌ చేస్తూంటే స్వేచ్ఛా వాణిజ్యవాదులు విదేశీ నిధులతో ఈ గనులను నిర్వహిస్తే సమర్థవంతంగా పని చేస్తాయని, ప్రభుత్వ చేతుల్లో ఉంటే సమర్థవంతంగా పనిచేయలేవని వాదిస్తున్నారు. గనుల జాతీయకరణ ఆవశ్యకతను ప్రతిబింబించేలా పార్లమెంటులోనూ చర్చలు జరుగుతున్నాయి' అని ప్రభుత్వ రంగ అవశ్యకతను తెలియజేస్తూనే మరోవైపు 'ఈ పోరాటంలో విజయం ఎవరిని వరించినా ఈ గనుల పరిసరాల్లో ఉన్న స్మశానం నేర్పుతున్న పాఠాన్ని మర్చిపోవటం మంచిది కాదు' అంటూ శ్రామికుల కడగండ్లను కళ్లకు కట్టేశాడు చే. 'గనుల తవ్వకంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కొద్ది మంది శరీరాలకు మాత్రమే ఈ స్మశానంలో చోటు దొరికింది' అంటూ చావులోనూ కష్టజీవులు బాధలెలా ఉంటాయో చాటారు. విప్లవోద్యమానికి సన్నద్ధమై ప్రయాణపు ఆకరి మజిలీలో తానేమి కోరుకుంటున్నాడో తెలియజేస్తూ కొత్త ఉషోదయం కోసం యాత్రను నిష్క్రమిస్తాడు చే. 'ఒక గొప్ప స్ఫూర్తి మానవాళిని రెండు శత్రు శిబిరాలు కింద మార్చినప్పుడు నేను మాత్రం ప్రజలతోనే ఉంటాను..నిజమైన న్యాయమైన విప్లవంలో నన్ను నేను అంతర్భాగంగా మార్చుకుంటాను. ఈ అలసట నుండి నూతన ఆలోచనలు పుట్టుకొస్తాయి. రానున్న సంగ్రామానికి సిద్ధమవుతూ నా శరీరాన్ని ఇనుపముక్కలాగా మార్చుకుంటాను. విజేతగా నిలవనున్న కార్మిక వర్గపు వీరవిహారంలో నూతన శక్తి, నూతన ఆశలు రేకెత్తుతాయి. అందులో నాకు ఇంత చోటు దొరికితే చాలునని సంతృప్తిపడతాను' అంటూ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా ఉద్ఘాటించిన వెలుగుబాట చే జీవన యాత్ర.
చే జీవితం నేర్పేదేమిటి?

  1.  సమాజహితం కోసం పరితపిస్తూ మార్పు కోసం వ్యక్తిగత త్యాగాలకు సిద్ధపడటం
  2. సంక్లిష్ట పరిస్థితులను, కష్ట కాలాన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ స్వీయ వ్యక్తిత్వ నిర్మాణంతో ముందుకు దూసుకెళ్లడం.
  3. అలవిమాని చోటును కూడా అనుకూలంగా మల్చుకొని కొత్త ఉషోదయం వైపు జీవనయానాన్ని కొనసాగించడం.
  4.  స్వేచ్ఛా, స్వతంత్రాలకు, తిరుగుబాటుకు తానే ఒక ఉదాహరణగా నిలవడం
  5. మానవాళి అనుసరిస్తున్న భిన్న సంస్కృతులను, సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఆస్వాధిస్తూ కొత్త ఆవిష్కరణల కోసం పరితపించడం
  6.  క్షేత్రస్థాయిలో సామాజిక, ఆర్థిక వాస్తవిక పరిస్థితుల అధ్యయనం యొక్క ప్రాధాన్యత
  7. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే క్రమంలో స్నేహాన్ని పెంపొందించాల్సిన అవశ్యకత
  8. నిర్ణయాలు, చర్యల్లో రాజకీయ, సైద్ధాంతిక విశ్వాసాల ప్రాధాన్యత.

అమర్‌