Aug 05,2023 07:19

  • నేడు ఏంగెల్స్‌ 128వ వర్థంతి

       యూరప్‌లో పరిశ్రమలు విస్తరించుతూ, కార్మికవర్గ దోపడీ విచ్చలవిడిగా సాగుతున్న 18వ శతాబ్దంలో ఒక బట్టల మిల్లు యజమాని కుటుంబంలో ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ 1820 నవంబరు 28న ప్రష్యా (ఇప్పటి జర్మనీ) లోని బార్మెన్‌ నగరంలో జన్మించాడు. ఒక సామాజిక శాస్త్రవేత్తగా, రచయితగా, తత్వవేత్తగా, బహుభాషా కోవిదుడుగా, విప్లవకారుడిగా ఏంగెల్స్‌ జీవించాడు. ప్రపంచ గతిని మార్చిన సిద్ధాంతమైన మార్క్సిజాన్ని రూపొందించడంలో మహా మహోపాధ్యాయుడు కారల్‌ మార్క్స్‌కు మిత్రుడుగా, చేదోడు వాదోడుగా జీవించాడు. ఒక పెట్టుబడిదారుని కుటుంబంలో పుట్టినా ఆ పెట్టుబడిదారీ వర్గ పెత్తనం సమాజానికి ఎంత కీడు చేస్తుందో అర్థంచేసుకుని ఆ వ్యవస్థ మార్పు కోసం జీవితాన్ని అంకితం చేసినవాడు ఏంగెల్స్‌.
         ఏంగెల్స్‌కు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే వ్యాపకం వుండేది. పదిహేడేళ్ల వయసులో అతని టేబుల్‌ సొరుగులో ఆఫ్రికాకు చెందిన 13వ శతాబ్దపు పోరాట వీరుని చరిత్ర పుస్తకాన్ని తండ్రి చూశాడు. అందుకు కలతచెంది ఏంగెల్స్‌ను చదువు మాన్పించి మాంచెస్టర్‌లోని తన బట్టల మిల్లుకు అప్రెంటిస్‌ శిక్షణ పేరుతో పంపించాడు. పెద్ద నౌకా కేంద్రమైన క్రెమెన్‌ నగరంలోని వాణిజ్య సంస్థలో పని చేయడానికి ఏంగెల్స్‌ వెళ్లాడు. అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో ఇంగ్లీషు, డచ్చి, ఫ్రెంచి తదితర భాషలలో పేపర్లు చదివేవాడు. జర్మనీలో ప్రభుత్వం నిషేధించిన సాహిత్యాన్ని చదివేవాడు. అలా ఏంగెల్స్‌ తన ప్రాపంచిక జ్ఞానాన్ని పెంచుకున్నాడు. 19వ ఏటనే ఏంగెల్స్‌ తన మిత్రులకు 15 భాషలలో లేఖలు రాసేవాడు. నిశిత పరిశీలన నేర్చుకున్నాడు. ఉప్పర్‌టాల్‌ అనే బట్టల మిల్లుల కేంద్ర నగరంలో బాలికలతో పనిచేయిస్తున్న పరిస్థితులను, అక్కడి ప్రజల ముఖ్యంగా కార్మికుల వెతలను పరిశీలించాడు. అక్కడి దీనగాధలు ఏంగెల్స్‌ను కదిలించి వేశాయి.
           ఏంగెల్స్‌ 25 భాషలు మాట్లాడేవాడు. 15 భాషలలో ఉత్తరాలు, వ్యాసాలు రాసేవాడు. 1839 నుండి 42 మధ్యకాలంలో 50 వ్యాసాలను రాజకీయ, సాహిత్య, తత్వశాస్త్ర అంశాలలో రాయడం కోసం ఎంతో అధ్యయనం చేసాడు. ఇంగ్లండు లోని కార్మికుల స్థితిగతుల మీద పరిశీలన సాగించి ''ఇంగ్లండులో కార్మికుల పరిస్థితి'' అనే గ్రంథాన్ని రచించాడు (మార్క్స్‌తో పరిచయం కావడానికి ముందే రాసిన గ్రంథం). 'పవిత్ర కుటుంబం' పేరుతో కారల్‌ మార్క్స్‌తో కలసి రచించిన గ్రంథం 1846లో విడుదలైంది. వ్యక్తి ముందా? సమాజం ముందా? అనేదానికి సమాజమే ముందు అని రుజువులతో సహా ఆ గ్రంథంలో బోధించారు. మార్క్స్‌తో కలసి ఏంగెల్స్‌ సాగిస్తున్న కృషి, వారి తాత్విక దృష్టి, వారి పట్టుదల తెలిసిన కమ్యూనిస్టు లీగ్‌ 1847లో కమ్యూనిస్టు ప్రణాళికను రాసే పనిని మార్క్ప్‌, ఏంగెల్స్‌లకు అప్పచెప్పగా అందుకోసం ఏంగెల్స్‌ విడిగా కమ్యూనిజం సూత్రాలు పేరుతో తన అభిప్రాయాలను మార్క్స్‌కు అందించాడు. 1848 ఫిబ్రవరి 21న విడుదల అయిన 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో ఏంగెల్స్‌ ప్రతిపాదనలు చాలా భాగం ఉంటాయి.
        'జర్మన్‌ సిద్ధాంత సంపుటి' గ్రంథాన్ని మార్క్స్‌తో కలసి రాశాడు. ఇందులో మానవుడి చైతన్యం-అస్తిత్వంలలో అస్తిత్వం యొక్క ప్రాధాన్యతను పొందుపరిచాడు. తత్వశాస్త్ర అభివృద్ధి శ్రామికవర్గానికి ఉన్న సంబంధం అవినాభావమైనదని, అవి ఒకదానితో ఒకటి కలసి అభివృద్ధి చెందుతాయని నిర్ధారించాడు. అప్పటికే తత్వశాస్త్రంలో మార్గదర్శకత్వం వహిస్తున్న హెగెల్‌ గతితర్కాన్ని బలపరిచినా హెగెల్‌ లోని భావవాదాన్ని ఖండిస్తూ 'దేవుడు మనిషిని సృష్టించలేదు-మనిషే దేవుడ్ని సృష్టించాడు' అని చెప్పి భౌతికవాదాన్ని సమున్నతంగా నిలిపాడు. వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ పాత్ర రచనల ద్వారా శ్రమైక జీవన సౌందర్యం సాధించుకోవచ్చని, ఆ దిశగా మానవ ప్రయాణం తథ్యమనే విశ్వాసాన్ని ఈ రచన కల్పిస్తుంది.
         నిరుద్యోగ సమస్య, కార్మికుల మీద ప్రభావాన్ని తెలిపే వేతన వ్యవస్థ గ్రంథంలో ''పెట్టుబడిదారుడు కార్మికునితో అంగీకారానికి రాలేకపోతే ఆగిపోయి తన పెట్టుబడి మీద బతకగలడు. కాని కార్మికుడు అలా చేయలేదు. అతనికి బతకడానికి కూలి మాత్రమే ఉంది. కనుక అతను ఎప్పుడు, ఎక్కడ, ఏ షరతుల మీద పని సంపాదించుకోగలిగితే అప్పుడు, అక్కడ, ఆ షరతుల మీద పనిని తీసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం అయితేనే నిరుద్యోగం రద్దుకు అవకాశం ఏర్పడుతుందనే విషయం తేటతెల్లం చేశాడు. పెట్టుబడి గ్రంథ రచనలోను, మార్క్స్‌తో పాటు సిద్ధాంత కృషిలో భాగస్వామిగా ఎన్నో గ్రంథాలను, సాహిత్యాన్ని ఏంగెల్స్‌ అధ్యయనం చేసాడు.
           ప్రపంచానికి మార్క్సిజాన్ని అందించడానికి మార్క్స్‌ చేసిన కృషిలో భాగస్వామిగాను, విడిగాను ఎన్నో రచనలు చేశాడు. భావ సారూప్యత కారణంగా వారిద్దరూ ఆఖరి వరకూ మిత్రులుగానే జీవించారు. కార్మికవర్గ విముక్తి, మానవ కళ్యాణం కోసం కలసి కృషి చేశారు. ఏంగెల్స్‌ తన జీవితాంతం మార్క్స్‌ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాడు. మార్క్స్‌తో పాటు పెట్టుబడి రచనలో భాగస్వామి. మార్క్స్‌ మరణానంతరం పెట్టుబడి 2,3 భాగాలు ముద్రణకు కృషి చేశాడు. ఏంగెల్స్‌ 1895 ఆగష్టు 5వ తేదీన లండన్‌లో మరణించాడు.

- గుడిపాటి నరసింహారావు,
సెల్‌ : 9490098559