Jul 17,2022 17:21

ఇప్పుడేగా నువ్వు
నడవడికను నేర్చుకుంది
మొదటి అడుగు తడబడితే ఏంటి?

అందుకునే లోపే
నీ ఆలోచనలన్నీ నీటి బుడగల్లా
పగిలిపోతున్నాయని
నిరాశపడితే ఎలా?

పిడికిలి నుంచి క్షణాలు
నిమిషాలు, గంటలు ఇసుకలా
వేళ్ల సందులోంచి జారిపోతున్నాయని
నిర్వేదపడతావు ఎందుకు?

అప్పుడే అలసటను గంపలకొద్దీ
అరువు తెచ్చుకుని కదలకుండా
ఒకేచోట శిలా ప్రతిమైపోతావు.
అవధులు లేని నిస్సహాయతను
దేహంలోకి వొంపుకుని..
అప్పగింతలు చేసుకుంటున్నావు.

బాధ, కోపం, దుఃఖం
అన్నిటినీ ఆకళింపు చేసుకోవాలి అప్పుడప్పుడు
అంతేకాని మరణపు కౌగిలిని హత్తుకుంటానంటే ఎట్లా..?
ఎత్తు పల్లాలు లేని నేల ఉంటుందా
చివరి మజిలీ చేరేవరకూ
అడుగులో అడుగు స్థిరంగా వెయ్యాలి
పడిపోయినా లేచి పరిగెత్తాలి
అడవిలో తిరిగే పులిలా తడబడకుండా..
- శ్రీతరం
78936 13015