May 17,2023 12:44

55 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు : ఎడిఆర్‌ నివేదిక

బెంగళూరు : కొత్తగా ఎన్నికైన కర్ణాటక శాసనసభలో గెలుపొందిన అభ్యర్ధుల్లో 97 శాతం మంది కోటీశ్వరులని, వారి సగటు ప్రకటిత ఆస్తుల విలువ రూ.64.39 కోట్లుగా వుందని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) తన విశ్లేషణలో పేర్కొంది. ''గెలుపొందిన 223మంది అభ్యర్ధుల వివరాలను విశ్లేషించగా, వారిలో 217 (97శాతం) మంది కోటీశ్వరులు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపొందిన 221 ఎంఎల్‌ఎల వివరాలను విశ్లేషించగా, వారిలో కూడా 215(97శాతం) మంది కోటీశ్వరులే.'' అని ఎడిఆర్‌ తన నివేదికలో పేర్కొంది. గెలుపొందిన అభ్యర్ధుల క్రిమినల్‌ నేపథ్యం, ఆర్థిక హోదా, విద్య, జెండర్‌, ఇతర వివరాలను విశ్లేషించారు. ఎంఎల్‌ఎల సగటు ఆస్తుల విలువ దాదాపు రూ.30కోట్లు పెరిగింది. 2018లో ఇది రూ.34.59కోట్లుగా వుండగా, 2023లో రూ.64.39కోట్లుగా వుంది.
        కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంతవరకు 134 మంది విజేతల (135 సీట్లు గెలిచింది) వివరాలను విశ్లేషించారు. వారిలో 132 మది కోటీశ్వరులు. వారి సగటు ప్రకటిత ఆస్తుల విలువ రూ.67.13 కోట్లుగా వుంది. ఇక బిజెపి వివరాలు చూసినట్లైతే, 66 మంది విజేతల్లో 63 మందికి కోటి రూపాయిలపైనే ఆస్తులు వున్నాయి. వారి సగటు ఆస్తుల విలువ రూ.44.36 కోట్లుగా వుంది. జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ విజేతలు 19 మందిలో 18 మంది కోటీశ్వరులే, వారి సగటు సంపద విలువ రూ.46.01 కోట్లుగా వుంది.
           విజేతల్లో కేవలం ఇద్దరి అభ్యర్ధుల ప్రకటిత ఆస్తులే రూ.50లక్షల కన్నా తక్కువగా వున్నాయి. రూ.50 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు ఆస్తి వున్నవారు 10 మంది వున్నారు, రూ.2-5 కోట్ల మధ్య ఆస్తి కలిగిన వారు 31 మంది వున్నారు. రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్న వారు 180 మంది వున్నారని ఎడిఆర్‌ తన నివేదికలో పేర్కొంది.
          ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న డి.కె.శివకుమార్‌ అందరిలోకి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లు. ఆ తర్వాత స్థానంలో గౌరిబిదనూర్‌ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందిన కె.హెచ్‌.పుట్టుస్వామి వున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1267 కోట్లుగా వుంది. ఇక అత్యంత తక్కువగా ఆస్తి కలిగిన అభ్యర్ధి సులియా నుండి గెలిచిన బిజెపి అభ్యర్ధి భగీరధి మురుల్యా. ఆయన ఆస్తి రూ.28 లక్షలుగా వుంది. మరో బిజెపి విజేత, కృష్ణరాజకి చెందిన టి.ఎస్‌.శ్రీవత్స. సంపన్నుల జాబితాలో కింది నుండి రెండో స్థానంలో వున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.48లక్షలు. మొత్తంగా 93 మంది ఎంఎల్‌ఎలు తిరిగి ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందినవారు 51మంది కాగా, బిజెపి నుండి 38 మంది, జెడి(ఎస్‌) నుండి నలుగురు వున్నారు. వారి సగటు సంపద రూ.29.03కోట్లనుండి రూ.71.52 కోట్లకు పెరిగింది. 2018లో రూ.42.48కోట్లుగా వుంది. తిరిగి ఎన్నికైన ఎంఎల్‌ఎల ఆస్తులు సగటున 68శాతం పెరిగాయి.
 

                                                                       క్రిమినల్‌ కేసులు ..

గెలుపొందిన అభ్యర్ధులో దాదాపు మూడో వంతు మంది అంటే 71మంది తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు వున్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్‌ల్లో ప్రకటించారు. కాంగ్రెస్‌లో 134మందిలో 40మంది (30శాతం) తీవ్రమైన క్రిమినల్‌ నేరాలు వున్నట్లు ప్రకటించారు. ఇక బిజెపిని చూసినట్లైతే 66మందిలో 23 మంది (35శాతం) విజేతలపై ఇటువంటి కేసులు వున్నాయి. జెడిఎస్‌ విజేతల్లో ఏడుగురు (37శాతం)విజేతలపై క్రిమినల్‌ కేసులు వున్నాయి. మొత్తంగా 122మంది తమకు క్రిమినల్‌ నేపథ్యం వుందని ప్రకటించగా, వారిలో 50శాతం మంది అంటే 51మంది చిన్నా చితకా కేసులు నమోదైన వారు వున్నారు. నంజన్‌గూడ్‌ నియోజకవర్గంనుండి గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్ధి దర్శన్‌ ధృవనారాయణన్‌ (28) పిన్న వయస్కుడైన ఎంఎల్‌ఎగా వున్నారు.