Jun 15,2022 06:35

    రవ నిజాం నవాబు కాలంలో (1899) ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 'నిజాం స్టేట్‌ రైల్వేస్‌' ఆధ్వర్యంలో కాచిగూడ నుండి మన్మడ్‌ వరకు మీటర్‌ గేజ్‌లో రైలు నడిచేది. ప్రజలకు రైల్వేతో పాటు బస్సు రవాణా కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్న అభిలాషను...ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ తల్లి జహారా మహమ్మడియన్‌ తెలియచేసింది. తల్లి కోరిక మేరకు నిజాం...బ్రిటన్‌ నుండి ఓడల ద్వారా 27 అల్బేనియన్‌ బస్సులను ప్రత్యేకంగా తెప్పించాడు. వాటిలో కొన్నింటికి ఆకుపచ్చ, కొన్నింటికి ఎరుపు రంగు వేయించి...పచ్చ బస్సులను సిటీ బస్సులుగా, ఎర్ర బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో నడపాలని నిర్ణయించారు.
      1932 జూన్‌ 5న కాచిగూడ నుండి సిటీ బస్సులు, గౌలిగూడ నుండి జిల్లా బస్సులను ట్రయల్‌గా నడిపించారు. అనంతరం బస్సుల మెయింటెనెన్స్‌ కోసం బస్సు డిపోల ఏర్పాటులో భాగంగా 1932 జూన్‌ 15న నార్కెట్‌పల్లి మొదట డిపోను ప్రారంభించారు. అదే సంవత్సరం ఖాజీపేట, నాందేడ్‌ డిపోలనూ ఏర్పాటు చేశారు. 1934లో 4 డిపోలను, 1936లో 12 డిపోలను, 1949లో 2 డిపోలను ఏర్పాటు చేశారు. 1932లో 27 బస్సులు 166 మంది సిబ్బందితో ప్రారంభమై 1949 నాటికి మొత్తం 21 డిపోలు 952 బస్సులతో ఎన్‌.ఎస్‌.ఆర్‌.టి.డి గా విస్తరించింది. 1946లో హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ మధ్య 30 డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిపారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ...నిజాం సంస్థానం విలీనం అయింది మాత్రం 1950 లోనే. అంతవరకూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ లో ఒక్క బస్‌ డిపో కూడా లేదు. 1951 నవంబర్‌ 1న హైదరాబాద్‌ స్టేట్‌లో రవాణా డిపార్ట్‌మెంట్‌ ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వలన 1958 నవంబర్‌ 1 నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సు రూట్ల జాతీయీకరణతో 1958 ఏప్రిల్‌ 1న విజయవాడ, 1959లో మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు డిపోల పరంపర ప్రారంభమైంది. 1962 నుండి డిపోల విస్తరణ జరిగింది. నవంబర్‌ 1964 నుండి విజయవాడ, హైదరాబాద్‌ మధ్య దూరప్రాంత డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడిపారు.
    1975లో తిరుమల, తిరుపతి దేవస్థానం బస్సులను తీసుకొని సంస్థ నడపనారంభించారు. 1978లో విశాఖపట్నం, విజయవాడలో సిటీ బస్సులు నడపసాగారు. రోడ్డు వున్న ప్రతీ గ్రామానికి బస్సు సర్వీసు పథకాన్ని అమలు చేసి, పర్యవేక్షణకు హైదరాబాద్‌, కడప, కరీంనగర్‌, విజయనగరంలో రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 1982 నాటికి అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాలకుగాను 15 జిల్లాలలో బస్‌ రూట్ల జాతీయీకరణ జరిగింది. 1985లో రాత్రిపూట దూరప్రాంత సర్వీసులు ప్రారంభించారు. 1987లో ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో జాతీయీకరణ జరిగింది. 1996 వరకు సంస్థ లాభాల బాటలో ఉంది. అప్పుడే అతి పెద్ద సంస్థగా గిన్నిస్‌ బుక్‌లో నమోదైంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూల్‌ లో అతి పెద్ద బస్‌ స్టేషన్‌ సముదాయాలను నిర్మించింది. ప్రయాణికులకు అనేక రాయితీ పథకాలను అమలుచేసింది.
     నూతన మోటారు వాహనాల చట్టం-1989 కారణంగా ప్రయివేటు వాహనాలు హద్దుఅదుపు లేకపోవడం, ప్రభుత్వం కాపిటల్‌ కంట్రిబ్యూషన్‌ నిలుపు చేయడం, పన్నులు-ఇంధన ధరలు-స్పేర్‌ పార్టుల ధరలు పెరగడం, రాయితీ సొమ్ములు ప్రభుత్వం చెల్లించకపోవడం, ప్రైవేట్‌ వాహనాల పోటీ...వంటి పలు కారణాలుతో ఆర్థిక పరిస్థితి తిరగబడింది. 1996 నుండి నష్టాల పాలైంది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు సంస్థలుగా ఏర్పడ్డాయి. 2015 జూన్‌ 3 నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 97 డిపోలు, 9728 బస్సులతోను... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 129 డిపోలు, 11,236 బస్సులతోను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తున్నాయి. 2020 జనవరి 1 నుండి ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం అయింది. జీతభత్యాలను చూస్తున్న ప్రభుత్వం కొత్త వేతన జీవోలు తెచ్చింది. కార్మికుల ఆశలు, ఆకాంక్షలకు అవి భిన్నంగా వుండడంతో వారు ఆందోళన బాట పట్టారు.
     తొంబై ఏళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకొన్న ఎర్రబస్సు నేడు అనేక ఆటుపోట్లకు గురవుతోంది. ప్రభుత్వం ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా ప్రయాణికులకు సురక్షిత, కాలుష్య రహిత సమాజాన్ని అందించాలి.

- ఎన్‌.వి.ఎస్‌ వేణుగోపాల్‌,
విశ్రాంత డిపో మేనేజర్‌,
సెల్‌ : 70135 52888