Nov 05,2022 15:27

ప్రజాశక్తి-మైలవరం : ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో పట్టుబడిన సుమారు రూ.1.70 కోట్ల విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో శనివారం డిసిపి మేరి ప్రశాంతి ఆధ్వర్యాన ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, జి.కొండూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2,119 కేసుల్లో పట్టుబడిన 87,175 మద్యం సిసాలను ధ్వంసం చేశామని తెలిపారు. మద్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సారా తయారీ చేసినా, అమ్మినా పీడియాక్ట్‌ అమలు చేస్తామన్నారు. మద్యం కేసుల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్‌ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు జరిపే వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇబి డైరెక్టర్‌ సత్తిబాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరిండెంటెంట్‌ నారాయణ స్వామి, మైలవరం సబ్‌ డివిజన్‌ ఎసిపి కెవివిఎస్‌ ప్రసాద్‌, పలువురు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.