- ఐదేళ్ల నియామకాల్లో ఎస్‌సి, మైనారిటీలు రెండు శాతమే
- పార్లమెంటరీ ప్యానెల్‌కు నివేదించిన కేంద్రం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని వివిధ హైకోర్టులకు గత ఐదేళ్ల కాలంలో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో 79 శాతం మంది జడ్జీలు పెత్తందారీ సామాజిక తరగతులకు చెందినవారే నియమితులయ్యారు. షెడ్యూల్డ్ తరగతులు, మైనారిటీలకు చెందినవారు రెండు శాతం మాత్రమే. విస్మయకరమైన ఈ గణాంకాలను లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్ర ప్రభుత్వం నివేదించింది. న్యాయ వ్యవస్థలో లోపించిన సామాజిక సమతుల్యతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2018-2022 మధ్య కాలంలో నియమితులైన హైకోర్టు న్యాయమూర్తులలో 79 శాతం మంది పెత్తందారీ సామాజిక తరగతులకు (జనరల్ కేటగిరీ) చెందినవారే ఉన్నారు. 2018 నుండి 2022 డిసెంబర్ 19 వరకు వివిధ హైకోర్టులకు 537 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో 79 శాతం జనరల్ కేటగిరీ, 11 శాతం ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి), 2.6 శాతం మైనారిటీ, 2.8 శాతం షెడ్యూల్డ్ తరగతులు (ఎస్‌సి), 1.3 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్ టి) వారు ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు చెందిన అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సివుంది. రాజ్యాంగ న్యాయస్థానాలకు నియామక ప్రక్రియలో సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం పాటించాలని, ఇది సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియం ప్రాథమిక బాధ్యత అని రాజ్యాంగ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే న్యాయమూర్తుల నియామకంలో కొలీజియంకు ఉన్న ప్రాధాన్యత ప్రస్తుత అసమానతలను తొలగించలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 217, 224 ప్రకారం హైకోర్టు న్యాయ మూర్తుల నియామక సూత్రం ప్రకారం 'రిజర్వేషన్లు కల్పించడం లేదు' అని న్యాయమంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులను పంపినప్పుడల్లా, న్యాయ మంత్రిత్వ శాఖ వాటిని పరిశీలిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో సిఫార్సు చేసిన అభ్యర్థుల నేపథ్యాన్ని తనిఖీ చేస్తుంది. ఆపై వారి సలహా కోసం హైకోర్టు కొలీజియం సిఫార్సులతో సహా వివరణాత్మక నివేది కను సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం పేర్లను క్లియర్ చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నియామకాలను నోటిఫై చేస్తుంది. ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం మధ్య భిన్నాభిప్రాయాలొస్తే ప్రభుత్వం పేర్లను పునఃపరిశీలన కోసం సుప్రీంకోర్టు కొలీజియానికి తిరిగి పంపుతుంది. కానీ కొలీజియం అదే పేరును పునఃప్రతిపాదిస్తే ప్రభుత్వం కొలీజియం నిర్ణయానికే కట్టుబడివుండాలి.
ఇతర సంస్థలలో కూడాఇదే పరిస్థితి
న్యాయస్థానాలతో పాటు ఇతర రాజ్యాంగ సంస్థల్లోనూ సామాజిక సమతుల్యత కనిపించడం లేదు. రిజర్వేషన్ చేసిన పోస్టులను భర్తీ చేయడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. బ్యాక్‌లాగ్ పోస్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భర్తీకి నోచుకోవడం లేదు. అఖిల భారత వైద్య విధాన సంస్థ (ఎయిమ్స్)ను ఉదాహరణగా తీసుకంటే అందులో వెనుకబడిన తరగతులకు కేటాయించిన పోస్టులు ఖాళీలుగానే ఉన్నాయి. 1,111 అధ్యాపక స్థానాల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం మొత్తం 275, ప్రొఫెసర్ల కోసం 92 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో అర్హత ఉన్నప్పటికీ, సమర్థులు, అనుభవజ్ఞులైన రిజర్వడ్ కేటగిరీ వైద్యులను ఫ్యాకల్టీ స్థానాల్లో నియమించడం లేదని పేర్కొంది.ఇక ప్రయివేటు సంస్థలు విషయం చెప్పనవసరం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా పరిగణించే మీడియా రంగంలో సైతం పెత్తందారీ సామాజిక తరగతులదే పైచేయి. ఆక్స్‌ఫామ్ ఇండియా-న్యూస్‌లాండ్రీ నివేదిక ప్రకారం దేశంలోని మీడియా సంస్థల్లో 90 శాతం పోస్టుల్లో పెత్తందారీ సామాజిక తరగతులకు చెందినవారే నియమితులయ్యారు.











