Jun 11,2023 15:25
  • 95 శాతం మంది విద్యార్థులు హాజరు..

ప్రజాశక్తి-నరసరావుపేట : రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెం గ్రామంలో గల ఎపి మోడల్ స్కూల్ లో ఆదివారం 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ మండలంతో పాటు నకరికల్లు, ఈపూరు తదితర మండలాల నుండి మొత్తం 203 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకొనగా 185 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రము బయట విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహితులతో సందడిగా ఉంది. విద్యార్థులకు తల్లిదండ్రులు, స్నేహితులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపారు. ఈ పరీక్షను పరిశీలించిన ప్రిన్సిపాల్ బి.రవినాయక్ మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 5వ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్టులలో సిలబస్ కు సంబంధించి 100 మార్కులకు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఓయంఆర్ సీట్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుందని అన్నారు. ఈ పరీక్ష వ్రాసిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను హెడ్ ఆఫీసుకు పంపటం జరుగుతుందని అన్నారు. అక్కడ ప్రశ్నాపత్రాలను దిద్దటం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలలో వచ్చిన మార్కులను పరిశీలించి రిజర్వేషన్ రూల్స్ ప్రకారం తమ పాఠశాలలో సీట్లు కేటాయించటం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్ష విజయవంతం అవటానికి సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.