Dec 23,2022 08:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సుప్రీంకోర్టు నుంచి కింద కోర్టు వరకు 6,189 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2022 జనవరి 19 నాటికి దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 5,850 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 73 పోస్టులు, తెలంగాణలో 150 ఖాళీగా ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 333 పోస్టులు, సుప్రీం కోర్టులో 6 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఏపి హైకోర్టులో 7, తెలంగాణలో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. దేశంలో 2022 డిసెంబర్‌ 15 నాటికి కిందస్థాయి కోర్టుల్లో 4,29,40,290 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మరో ప్రశ్న కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అందులో సివిల్‌ కేసులు 1,09,34,257 కాగా, క్రిమినల్‌ కేసులు 3,20,06,033 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 8,16,562 కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో సివిల్‌ కేసులు 4,11,886 కాగా, క్రిమినల్‌ కేసులు 4,04,676 పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఏపిలో ఏడాదిలోనే 1,367 సివిల్‌ కేసులు, 41,044 క్రిమినల్‌ కేసులు పెరిగాయన్నారు. తెలంగాణలో 10,52,051 కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో సివిల్‌ కేసులు 4,19,433 కాగా, క్రిమినల్‌ కేసులు 6,32,618 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఏడాదిలో 5,221 సివిల్‌ కేసులు, 27,077 క్రిమినల్‌ కేసులు పెరిగాయని తెలిపారు.
 

                                                         ఎన్‌ఆర్‌ఐ మహిళల నుంచి 2,372 ఫిర్యాదులు

ఐదేళ్లలో భర్తలు (జీవిత భాగస్వాములు) తమను వదిలివేశారని ఆరోపిస్తూ ఎన్‌ఆర్‌ఐ మహిళల నుంచి 2,372 ఫిర్యాదులు అందాయని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఫిర్యాదులు అందినప్పటి నుంచి వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు.
 

                                                          దేశంలో 2,336 ఐఎఎస్‌, ఐపిఎస్‌ పోస్టులు ఖాళీ

దేశంలో 2,336 ఐఎఎస్‌, ఐపిఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 2022 జనవరి 1 నాటికి 1,472 ఐఎఎస్‌, 864 ఐపిఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అందులో ఏపిలో 42 ఐఎఎస్‌, 16 ఐపిఎస్‌ పోస్టులు, తెలంగాణలో 44 ఐఎఎస్‌, 17 ఐపిఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
 

                                                       దేశంలో 564 క్రీడా కోటా పోస్టులు ఖాళీగా ఉన్నాయి

దేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీడా కోటాలో 564 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి పోస్టులు 1,524 క్రీడా కోటాకు మంజూరు కాగా, ప్రస్తుతం 960 పోస్టులు భర్తీ అయ్యాయని, ఇంకా 564 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
 

                                                        ఐదేళ్లలో రైలు ప్రమాదాల్లో 80 ఏనుగులు మృతి

ఐదేళ్లలో దేశంలోని పది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాల్లో 80 ఏనుగులు మృతి చెందినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు.
 

                                                      దేశంలో 12.64 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి

దేశంలో గతేడాది 12.64 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021లో దేశంలో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అంతకు ముందు ఏడాది (3,66,138 ప్రమాదాలు)తో పోల్చితే 12.64 శాతం ప్రమాదాలు పెరిగాయని తెలిపారు.