Oct 08,2022 07:10

ఎనిమిదిన్నరేళ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్ఛే దిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం. అలాంటిది మోడీ ఏలుబడి లోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేకపోతున్నారా? ఇక పెంచిన చమురు పన్నులు, గ్యాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల్ల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?

మాంత్రికులు, మహా మాంత్రికులు కలిస్తే మహా భారతంలో ఘటోత్కచుడి కోసం ఆహార పదార్థాలను ఎలా సృష్టించారో మాయాబజార్‌ సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నేటి భారతంలో జనాలు కడుపు నింపుకొనేందుకు అన్నం కూరల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరచేతిలో చౌకగా లభించే సినిమాలు, సీరియళ్లు, పోసుకోలు కబుర్లు, ఇతర సమాచారంతో కడుపు నింపుకొనేందుకు ఒక సెల్‌ ఫోను ఉంటే చాలు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ముకేష్‌ అంబానీ తాజాగా దేశ ప్రజలకు అందించిన అమూల్య సందేశమిదే! అక్టోబరు ఒకటిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలలో 5జి సేవలను ప్రారంభించిన నరేంద్రమోడీ చెప్పిందేమిటి ?
        ''5జి (ఐదవ తరం) సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక బహుమతి. నూతన యుగం వైపు ఒక ముందడుగు. అంతం లేని అవకాశాలకు ప్రారంభం. నూతన భారతం కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనేది మాత్రమే గాక అభివృద్ధి, అమల్లో చురుకైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి సారథిగా దేశం ఉంటుంది (2015లో 81వ స్థానంలో ఉన్నదానిని నరేంద్ర మోడీ 2022లో 40వ స్థానానికి తెచ్చారని పొగుడుతున్నారు. ఇదే కాలంలో పాకిస్తాన్‌ 131 నుంచి 87వ స్థానానికి ఎదిగింది. మన దేశం 41 ర్యాంకులు పెంచుకుంటే పాకిస్తాన్‌ 44 పెంచుకుంది. అయినా 40వ స్థానంలో ఉన్న మనం ప్రపంచ సారథి ఎలా అవుతామో ఆ గోమాతకే తెలియాలి). 2014లో ఒక్క ఫోనూ ఎగుమతి చేయని మనం ఇప్పుడు వేల కోట్ల విలువగల వాటిని ఎగుమతి చేస్తున్నాము. తక్కువ ఖర్చులో ఎక్కువ విశేషతలను ఫోన్లలో అమర్చుతున్నాము. దేశంలోని పేదలు నూతన సాంకేతిక పద్ధతులను అనుసరించేందుకు ముందుకు రావటాన్ని చూశాను. గతంలో కొన్నేళ్ల క్రితం ఒక జి.బి (సులభంగా అర్ధం కావాలనుకుంటే ఒక కిలో అనుకుందాం) ధర రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.10కి తగ్గింది. సగటున ప్రతి మనిషి నెలకు 14 జీబీలు వాడుతున్నాడు. అంటే నెలకు రూ.4,200గా ఉండేది రూ.125-150కి తగ్గింది. ప్రభుత్వ ప్రయత్నాలు దీనికి దోహదం చేశాయి. వీధుల్లో అమ్ముకొనే చిరువ్యాపారి కూడా ఇప్పుడు యుపిఐ (పే టిఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటివి) వాడుతున్నారు. కూరగాయల వంటి వాటిని అమ్మేవారు కూడా నగదు వద్దు. యుపిఐ చేయమంటున్నారు. బ్రోకర్లు లేకుండా లబ్ధిదార్లకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. ఈ దశాబ్దమే కాదు. ఇది భారత శతాబ్దం.నాల్గవ తరం పారిశ్రామిక విప్లవా నికి దేశం నాయకత్వం వహించనుంది. ఆత్మ నిర్భర్‌ గురించి చెప్పినపుడు జనాలు నవ్వారు, 2014లో కేవలం రెండే మొబైల్‌ ఫోన్ల తయారీ కేంద్రాలుంటే ఇప్పుడు 200కు పెరిగాయి...''. ఇలా సాగుతుంది మోడీ వాక్‌ప్రవాహం.
         అయితే...ప్రధాని చూడనివి, చూసేందుకు ఇష్టపడనివి, కనిపించనివి, కనిపించినా చూడనట్లు ముఖం తిప్పుకొనేవి, పోల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎనిమిదిన్నరేళ్ల మోడీ ఏలుబడిలో బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఎంత తగ్గాయన్నది తప్ప అచ్ఛే దిన్‌ అంటే సమాచార ధర తగ్గటం కాదు. 2013 ప్రపంచ ఆకలి సూచికలో 120కి గాను 63వ స్ధానంలో ఉన్న మనం మరుసటి ఏడాది 55కు చేరాం. అలాంటిది మోడీ ఏలుబడి లోకి వచ్చాక 2021లో 116 దేశాల్లో వందవ స్థానానికి ఎందుకు దిగజారినట్లు? చౌకగా దొరికే సమాచారంతో జనాలు కడుపు నింపుకోలేక పోతున్నారా? ఇక పెంచిన చమురు పన్నులు, గ్యాస్‌ ధరల గురించి చెప్పనవసరం లేదు. అందువల్ల సమాచార ధర 300 నుంచి పదికి తగ్గించిన మోడీ ప్రతిభను పొగిడేవారు మిగతావాటి ధరలను ఆమేరకు తగ్గించకపోగా విపరీతంగా పెంచిన సంగతేమిటో చెబుతారా ?
           ఇక అరవై ఐదేళ్ల ముకేష్‌ అంబానీ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌-2022 సభలో నరేంద్రమోడీ మనసెరిగి మెచ్చుకోలు మాటలు మాట్లాడారు? ఐదవతరం సమాచార పరిజ్ఞానం తోడ్పాటుతో ఇప్పుడున్న మూడులక్షల కోట్ల డాలర్ల జిడిపి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండువేల డాలర్ల తలసరి ఆదాయం ఇరవైవేల డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం కోరుకున్నవారికి కోరుకున్నది ఇచ్చే కామధేనువు వంటిదని కూడా చెప్పారు. ఈ అరచేతిలో వైకుంఠానికి ఆధారం ఏమిటో, ఏ అంచనాతో చెప్పారో అడిగేందుకు అప్పటికి ఎంత మందిమి ఉంటామో చెప్పలేము.
          ఐదవ తరం గానీ అంతకు ముందు తరాల వచ్చే సమాచార సాంకేతిక పరిజ్ఞానం గొప్పదే తప్ప జీవితాలను సమూలంగా మార్చేది కాదు. అదే సర్వస్వం కాదు. ప్రతి తరాన్ని ఆవిష్కరించినపుడు అంతకు ముందుతో పోల్చితే విప్లవాత్మక మార్పులనే చెప్పారు, అది ఆ రంగంలో నిజమే. అది జనజీవితాలను మార్చేట్లయితే ఒకటి నుంచి ఐదవ తరం (1జి నుంచి 5జి ) వరకు వచ్చిన విప్లవం పేదరికం, నిరుద్యోగాన్ని ఎంత మేరకు తగ్గించిందీ ఎవరైనా చెప్పగలరా? అమెరికాలో కూడా మన చౌక బియ్యం మాదిరి ఉచిత ఆహార కూపన్ల కోసం వరుసల్లో నిలిచే, ఇళ్ల అద్దెలు కట్టలేక వారాల తరబడి కార్లలో కాపురాలు చేసే జనం ఎందుకున్నట్లు?
ఇప్పటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక నూతన తరం సెల్‌ ఫోను, పరిజ్ఞానం వచ్చింది. మూడు నుంచి ఐదు లక్షల కోట్లకు జిడిపిని పెంచేందుకు ఎంత కష్టపడుతున్నామో దానికి 4జి ఎందుకు దోహదపడలేదో పెద్దలు చెప్పాలి. 2024-25 నాటికి మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అది ఎప్పటికి జరుగుతుందనే అంచనాపై ఏకీభావం లేదు. 2026-27 నాటికి సాధిస్తామని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెబుతున్నారు. తరువాత 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని కూడా చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదు లక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి.సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి.
            5జి వస్తే జరిగేదేమిటి? నరేంద్ర మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తరువాత డిజిటల్‌ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దానికి ముందు మాట రాసిన ఆర్థిక సలహాదారు సిమ్మీ చౌదరి పేర్కొన్న అంశాల సారాన్ని చూద్దాం. నాలుగు సంవత్సరాల కాలంలో నేరుగా నగదు బదిలీ విధానం ద్వారా 438 ప్రభుత్వ పథకాలకు సంబంధించి రూ. 6.21 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు, తద్వారా రూ.1.1 లక్షల కోట్ల మేర ఆదా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి నకిలీ ఖాతాలను రద్దు చేసిన తరువాత 5జి వచ్చినా కొత్తగా మిగిలేదేమీ ఉండదు. ఇప్పటికే అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినందున వాటి వేగం పెరగటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 2018 వరకు 3.21 లక్షల కామన్‌ సర్వీసు సెంటర్ల (సిఎస్‌సి) ద్వారా పది లక్షల మంది ఇప్పటికే పని చేస్తున్నారని పన్నెండు లక్షల మందికి ఉపాధి చూపుతున్నారని సిమ్మి పేర్కొన్నారు. ఈ పథకాన్ని 2006లో ప్రారంభించారు, ఆరు లక్షల గ్రామాలకు గాను ప్రతి ఆరింటికి ఒకటి చొప్పున లక్ష కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామానికి కనీసం ఒక కేంద్రం చొప్పున రెండున్నర లక్షల గ్రామాల్లో పెట్టాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం 4,63,705 కేంద్రాల్లో నేరుగా, పరోక్షంగా 15లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు 2022 ఏప్రిల్‌ ఆరున కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు. మరి 2018 నాటికే సిమ్మీ చెప్పినట్లు 22 లక్షల మంది ఉపాధి పొందుతుండగా తరువాత లక్షా 40 వేల కేంద్రాలు పెరిగినా పదిహేను లక్షలని మంత్రి చెప్పటమేమిటి? 5జి సేవలకు కొత్త పరికరాలు అవసరం కనుక వాటి ఉత్పత్తి, ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు, పాత తరాల పరికరాల ఉత్పత్తి నిలిపివేసి కొత్తవాటికి మళ్లుతారు, అదే కార్మికులతో పని చేయిస్తారు, కొత్తగా వచ్చేదేముంటుంది?
        జిఎస్‌ఎంఎ అంచనా ప్రకారం 5జి సేవల వలన భారత ఆర్థిక రంగానికి 2023 నుంచి 2040 మధ్య 455 బిలియన్‌ డాలర్ల లబ్ధి ఉంటుంది. ముకేష్‌ అంబానీ 2047 నాటికి మన జిడిపి మూడు నుంచి 40 లక్షల కోట్ల డాలర్లని చెప్పారు తప్ప ఏ పద్ధతిలో అంచనా అన్నది చెప్పలేదు. నామినల్‌ పద్ధతిలో ఆ నాటికి 30 లక్షల కోట్ల డాలర్లని, పిపిపి పద్ధతిలో 40 లక్షల కోట్లని కొంత మంది ఎప్పుడో అంచనా వేశారు. అంబానీ మూడు లక్షల కోట్లను నామినల్‌ అంచనాను తీసుకొని పిపిపి పద్థతిలో రెండోదాన్ని తీసుకున్నారు. అది సరైన పోలిక కాదు ఇకపోతే 2021 జూన్‌ 21న ప్రకటించిన ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం మన నామినల్‌ జిడిపి 2020లో 2.71 లక్షల కోట్ల డాలర్లు కాగా పిపిపి పద్ధతిలో 8.91 లక్షల కోట్లుగా ఉంది. 2011 నవంబరు 12 ఎకనమిక్‌ టైమ్స్‌లో మిన్హాజ్‌ మర్చంట్‌ రాసినదాని ప్రకారం అమెరికా సిటీ బ్యాంకు వేసిన అంచనా 2050 నాటికి భారత జిడిపి పిపిపి పద్ధతిలో 85.97 లక్షల కోట్ల డాలర్లు వుంటుందని, రెండవ స్థానంలో చైనా 80.02 లక్షల కోట్లు, మూడవ స్థానంలో అమెరికా జడిపి 39.07 లక్షల కోట్ల డాలర్లతో ఉంటుందని, మన దేశ జనాభా అప్పటికి 160 కోట్లకు చేరుతుందని తలసరి ఆదాయం 53 వేల డాలర్లు ఉంటుందని, 39 సంవత్సరాల పాటు సగటున ఏటా 8.1 శాతం వృద్ధి రేటు ఉంటేనే అనే షరతును కూడా ఉటంకించారు. వీటిలో దేనిని అంగీకరించాలి దేనిని తిరస్కరించాలి? ఈ అంచనాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు?
         మాయ మహా మాయ లోకంలో ఉన్నాం! వశీకరణ విద్యలో ఆరితేరిన నరేంద్ర మోడీ మాటల మాంత్రికుడైతే, ముకేష్‌ అంబానీ కార్పొరేట్‌ లాభాల మహా మాంత్రికుడు. ఇద్దరికీ జోడీ కుదిరిందని ఎనిమిదేళ్ల అనుభవం చెబుతోంది మరి!!

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు