లండన్ : ఇంగ్లండ్‌లో వేలాదిమంది ఎన్‌హెచ్‌ఎస్ కన్సల్టెంట్ డాక్టర్లు గురువారం 48గంటల సమ్మెను ప్రారంభించారు. వేతన పెంపుపై ప్రభుత్వం నుండి అపహాస్య రీతిలో ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో వారు సమ్మెకు దిగారు. బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ (బిఎంఎ)కి చెందిన 24వేలమంది సభ్యులు శనివారం ఉదయం 7గంటల వరకు సమ్మె కొనసాగించనున్నారు. పారిశ్రామిక కార్యాచరణకు దిగేందుకు అనుకూలంగా 86శాతం మంది సభ్యులు గత నెలలో ఓటు వేయడంతో ఈ సమ్మెను చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో బిఎంఎ ప్రధాన కార్యాలయంలో గురువారం ర్యాలీ జరిగింది. కన్సల్టెంట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ విశాల్ శర్మ హాజరయ్యారు. ఏడు మాసాల్లో ఒకే ఒక్కసారి ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్‌క్లే డాక్టర్లతో భేటీ అయ్యారని, వేతన పెంపుపై తదుపరి చర్చలు జరిపేందుకు తిరస్కరించారని డాక్టర్ శర్మ తెలిపారు. ఆరు శాతం వేతనాలు పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవిక ప్రాతిపదికన చూసినట్లైతే తాము ఇంటికి తీసుకెళ్లే వేతనాలు గత 14 ఏళ్లలో మూడో వంతుకు పడిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. 1970ల తర్వాత మొదటిసారిగా కన్సల్టెంట్లు సమ్మె చేస్తున్నారని శర్మ తెలిపారు.
ప్రభుత్వ వైఖరి పట్ల డాక్టర్లు చాలా ఆగ్రహంతో వున్నారని చెప్పారు. ఇంతటి కార్యాచరణకు దిగాలని తామెన్నడూ అనుకోలేదని, కానీ ప్రభుత్వ వైఖరి వల్ల చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. సమ్మెకు దిగకుండా పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ప్రభుత్వానికి ఏడు మాసాల గడువున్నా ప్రభుత్వం, మంత్రులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ వారంలో జూనియర్ డాక్టర్లు కూడా ఐదు రోజులు వాకౌట్ చేశారు. ఎన్‌హెచ్‌ఎస్ చరిత్రలోనే ఇది సుదీర్ఘమైనది.










