Oct 29,2023 10:43

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 46 మంది కోటీశ్వరులైన అభ్యర్థులు బరిలో వున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఖడ్గరాజ్‌ సింగ్‌ రూ.40 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో వున్నారు. మొదటి దశలో పోటీచేసే అభ్యర్ధి తలసరి ఆస్తుల విలువ రూ.1.34 కోట్లుగా వుందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌), ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌లు ఇచ్చిన నివేదిక పేర్కొంది. నవంబరు 7న జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో 223 మంది అభ్యర్ధుల్లో 46 మంది కోటీశ్వరులని ఆ నివేదిక పేర్కొంది. ఇక ప్రధాన పార్టీల మధ్య చూసినట్లైతే, మొత్తంగా 20 మంది బిజెపి అభ్యర్ధులు పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్ధి సగటు ఆస్తి రూ.5.33కోట్లుగా వుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి సగటు ఆస్తి రూ.5.27కోట్లుగా వుండగా, ఆప్‌ అభ్యర్ధులది రూ.4.45 కోట్లుగా వుంది. పోటీలో 15 మంది జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె) అభ్యర్ధులు వుండగా, వారి సగటు ఆస్తి రూ.30.54 లక్షలుగా వుందని నివేదిక పేర్కొంది. అధిక మొత్తంలో ఆస్తులున్న అభ్యర్ధుల్లో మొదటి స్థానం ఆప్‌ అభ్యర్ధి కాగా తర్వాత స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్‌ అభ్యర్ధులు వున్నారు.