Dec 25,2022 07:30

గ్రూపు దశలో తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనా జట్టు పసికూన సౌదీ అరేబియా చేతిలో ఓడినా.. జట్టు సారథి సహచర ఆటగాళ్లలో తరగని స్ఫూర్తి నింపాడు. ఓటమి తమకు మంచే చేస్తుందని, ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనాను స్మరించుకుంటూ ముందుకు సాగాలని ప్రోత్సహించాడు. దీంతో అర్జెంటీనా జట్టు మెక్సికో, పోలాండ్‌పై నెగ్గి నాకౌట్‌కు చేరింది. ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై, క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై, సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయాలు సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లింది. తుదిపోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఢకొీనాల్సిన సమయంలో.. '2014 ఫైనల్లో మనం ఓడాం.. ఈసారి గెలిచి తీరాల్సిందే!' అంటూ సహచరుల్లో జోష్‌ నింపాడు. ఈ టోర్నీలో మొత్తం ఏడు గోల్స్‌ కొట్టిన మెస్సీ.. మరో నాలుగు గోల్స్‌కు సహకరించి, 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. టైటిల్‌ గెలుచుకున్న అనంతరం ఇన్‌స్టాలో 'ప్రపంచ ఛాంపియన్‌ కావాలని చాలాసార్లు కలలుగన్నాను, సాధించలేకపోయాను. కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు. ఇక ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన ఖతార్‌ చిన్న దేశమే అయినా.. ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలను దిగ్విజయంగా నిర్వహించి, శభాష్‌ అనిపించుకుంది.
           ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌-2022 టైటిల్‌ను మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనా జట్టు గెలిచినా.. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడించిన తీరు యావత్‌ ప్రపంచ క్రీడాభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఫైనల్లో మెస్సీ తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ.. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా జట్టుకు టైటిల్‌ను సంపాదించిపెట్టాడు. దీంతో అర్జెంటీనా అభిమానుల ఆరాధ్య దైవం డిగో మారడోనాతో మెస్సీని పోల్చారు. కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్‌ ఆడుతున్న మెస్సీ.. టైటిల్‌ను సాధించడం ద్వారా తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. అర్జెంటీనా గోల్‌ కీపర్‌ మార్టినెజ్‌ ప్రతిభనూ ఏమాత్రం తీసిపారెయ్యలేం. ఫైనల్‌ మ్యాచ్‌ చివరి క్షణాల్లో ఫ్రాన్స్‌ యువ సంచలనం ఎంబపే కొట్టిన బంతిని నిలవరించి, అభిమానుల హీరో అయ్యాడు.

  • ఆసియా జట్లూ భేష్‌ !

ఈ టోర్నీకి ఆసియా ఖండానికి చెందిన నాలుగుజట్లు అర్హత సాధించాయి. ఇందులో జపాన్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా జట్లు అర్హత టోర్నీలు ఆడి, బెర్త్‌లు దక్కించుకుంటే.. ఆతిథ్య హోదాలో ఖతార్‌కు నేరుగా బెర్త్‌ లభించింది. గ్రూప్‌ దశలో ఆతిథ్య జట్టును మినహాయిస్తే మిగతా మూడు జట్ల ప్రదర్శన ప్రపంచ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఇందులో జపాన్‌, దక్షిణ కొరియా జట్లు ఏకంగా నాకౌట్‌కు అర్హత సాధిస్తే.. సౌదీ జట్టు తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా జట్టు అర్జెంటీనాను ఓడించి, తొలి సంచలనానికి తెర లేపింది. ఆ తర్వాత జపాన్‌ జట్టు ఏకంగా నాలుగుసార్లు ఫిఫా ప్రపంచకప్‌ విజేత జర్మనీపై గెలుపొందగా.. అదే ఊపులో దక్షిణ కొరియా జట్టు రెండుసార్లు టైటిల్‌ విజేత ఉరుగ్వేను నిలువరించి, మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ గ్రూప్‌-ఇ లో జపాన్‌ జట్టు 2-1 గోల్స్‌తో 2010 ఛాంపియన్‌ స్పెయిన్‌ను, గ్రూప్‌-హెచ్‌లో కొరియా 2-1 గోల్స్‌ తేడాతో టైటిల్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటైన పోర్చుగల్‌ను చిత్తు చేసి, నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకున్న తీరు అద్భుతం. గ్రూప్‌-సిలో సౌదీ అరేబియా చివరి మ్యాచ్‌లో మెక్సికోతో హోరాహోరీగా తలపడి 1-2 గోల్స్‌ తేడాతో ఓడి, నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇక నాకౌట్‌లో జపాన్‌ పెనాల్టీలో క్రొయేషియా చేతిలో, దక్షిణకొరియా జట్టు బ్రెజిల్‌ చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

  • సాకర్‌లో భారత్‌ పరిస్థితి..

భారత్‌లో 1960వ దశకం వరకూ సాకర్‌ ప్రజాదరణ పొందిన క్రీడగా వెలగొందింది. ఆసియాఖండ జట్లపై విజయాలను నమోదు చేసుకుంటూ 1950 భారత్‌ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించినా.. అనివార్య కారణాల వల్ల టోర్నీలో ఆడలేకపోయింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌, ఫిఫా అర్హత టోర్నీల్లోనే భారత్‌ వెనుదిరుగుతోంది. కొన్నేళ్లుగా ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ 100లోపు నిలిచిన దాఖలాలు లేవు. 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో పాలకుల నిరక్ష్యం, నిధుల కేటాయింపుల్లో అలసత్యంతో గ్రామీణస్థాయి క్రీడాకారులు వెలుగులోకి రాకుండాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) నిర్వహణతో బైచుంగ్‌ భుటియా, సునీల్‌ ఛెత్రి వంటి ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో ఈ క్రీడ పట్ల ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పెరుగుతోంది. కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం.. ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌ క్రీడకు మెండుగా ప్రజాదరణ ఉంది.

  • గ్రూప్‌ దశలోనే నిష్క్రమించి ఫేవరెట్‌ జట్లు..

గ్రూప్‌ లీగ్‌ దశలోనే టైటిల్‌ ఫేవరెట్‌ జట్లు కొన్ని నిష్క్రమించాయి. వీటిలో నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీతోపాటు ఉరుగ్వే జట్ల గురించి చర్చించుకోవాల్సి ఉంది. జర్మనీ జట్టు చివరిసారిగా 2014లో టైటిల్‌ను గెలిస్తే.. ఉరుగ్వే 2010లో సెమీస్‌కు చేరింది. ఈ రెండు జట్లు ఈసారి గ్రూప్‌ దశను దాటలేకపోయాయి. ఇక బెల్జియం జట్టు 2018లో సెమీస్‌కు చేరింది. వీటితోపాటు మెక్సికో, ట్యునీషియా, డెన్మార్క్‌, కోస్టారికా, కామెరూన్‌, సెర్బియా, ఘనా జట్లు ఈసారి గ్రూప్‌ దశను దాటలేకపోయాయి.

football
  • మోత మోగించిన మొరాకో..

ఏమాత్రం అంచనాల్లేకుండా ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌ బరిలోకి దిగిన మొరాకో ఫుట్‌బాల్‌ జట్టు ఏకంగా సెమీస్‌కు చేరి క్రీడాభిమానులను నివ్వెరపరిచింది. మొరాకో జట్టు గ్రూప్‌-ఎఫ్‌లో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, నాకౌట్‌కు చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్‌ను, క్వార్టర్స్‌లో పోర్చుగల్‌ను ఓడించింది. అయితే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి, ఓడింది. ఆ తరువాత మూడవ స్థానానికి జరిగిన పోటీలోనూ క్రొయేషియాకు ముచ్చెమటలు పట్టించి, 1-2తో ఓటమిపాలై, నాల్గోస్థానానికి పరిమితమైంది. తమ దేశ జనాభా నాలుగు కోట్ల ముందే ఉన్న మొరాకో చేసిన ఈ ప్రదర్శన ప్రపంచంలో వివిధ దేశాల్లో అభిమానులను ఆకట్టుకుంది.

  • 2026లో 48 జట్లు

ఫిఫా ప్రపంచకప్‌ 2026కు అమెరికాతోపాటు మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఈ మూడు దేశాల జట్లు నేరుగా ఆతిథ్య హోదాలో ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. ఈ దేశాల ప్రతినిధులు ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఖతార్‌ నిర్వాహకుల నుంచి ఆతిథ్య బాధ్యతలను స్వీకరించారు. 2026 జూన్‌-జులై నెలలో 16 నగరాల్లో సాకర్‌ ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. 2026 నుంచి జట్ల సంఖ్యను 32 నుంచి 48 వరకు పెంచుతున్నట్లు ఫిఫా ఓ ప్రకటనలో వెల్లడించింది.

1
  • ఇక ఎంబపే శకమే..

ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఫ్రాన్స్‌ జట్టు చేరడంలో ఆ జట్టు ఆటగాడు ఎంబపే కీలకపాత్ర పోషించాడు. ఫ్రాన్స్‌ జట్టు ఆటగాళ్లంతా ఒక ఎత్తయితే.. 23 ఏళ్ల ఎంబపే మరో ఎత్తు. ఫైనల్‌ అర్జెంటీనా వైపు ఏకపక్షంగా సాగుతున్న సమయంలో తుదిపోరును ఉత్కంఠగా మార్చింది అతడే. హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టును పోటీలో నిలిపి కప్‌ గెలవాలన్న మెస్సీ కలను భగం చేసేలా కనిపించాడు. చివరకు మెస్సీి కప్పును ముద్దాడితే.. ఈ చిచ్చరపిడుగు అందరి మనసులను దోచేశాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజాలు మెస్సీ, రొనాల్డో చివరి ప్రపంచకప్‌ ఆడేశారు! ఆటపై చెరగని ముద్ర వేసిన వీళ్లు.. అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికే దిశలో ఉన్నారు. బ్రెజిల్‌ స్టార్‌ నెరుమార్‌లో మునుపటి దూకుడు లోపించింది. ఈ దశలో కొత్త సూపర్‌స్టార్‌ ఎవరు? అద్భుతమైన నైపుణ్యాలతో మాయ చేసేది ఎవరు? అనే ప్రశ్నలకు జవాబుగా ఎంబపె కనిపిస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం రష్యాలో సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆగమనాన్ని ఘనంగా చాటిన ఎంబపే.. ఇప్పుడు ఖతార్‌లో అత్యధిక గోల్స్‌తో ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలబడ్డాడు. ఇది తన శకమే అని సగర్వంగా చాటాడు. ఈ ప్రపంచకప్‌లో ఎంబపే ఏకంగా ఎనిమిది గోల్స్‌ కొట్టి గోల్డెన్‌ బూట్‌ కైవసం చేసుకున్నాడు. 23ఏళ్లు, అంతకంటే తక్కువ వయసులో ఒక ప్రపంచకప్‌లో ఇన్ని గోల్స్‌ చేసిన ఆటగాడు ఎంబపే ఒక్కడే. జేమ్స్‌ రోడ్రిగ్జ్‌ (2014), మారియో కెంప్స్‌ (1978), పీలే (1958) ఆరేసి గోల్స్‌ సాధించారు.

messi
  • మెస్సీ రికార్డులు..
  1. ప్రపంచకప్‌లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న ఆటగాడిగా జర్మనీ దిగ్గజం మిరొస్లావ్‌ క్లోజ్‌ (17) సరసన చేరాడు.
  2.  వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడు. లోథార్‌ (జర్మనీ, 25 మ్యాచ్‌లు) అధిగమించాడు.
  3. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సమయం మైదానంలో గడిపిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. తాజా ఫైనల్‌తో 2,314 నిమిషాలు మైదానంలో గడిపాడు. ఈ క్రమంలో ఇటలీకి చెందిన పాలొ మాల్డినిని (2,217ని) రెండో స్థానానికి నెట్టాడు.
  4. ఒకే ప్రపంచకప్‌లో ప్రీ క్వార్టర్స్‌, క్వార్టర్‌, సెమీస్‌, ఫైనల్లో గోల్స్‌ చేసిన ఏకైక ఆటగాడు
  5.  ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ అవార్డు అందుకున్న అతిపెద్ద వయస్కుడు.
  6. ఏడుసార్లు బాలెన్‌-డి-ఓర్‌ అవార్డుతోపాటు అండర్‌-20 ప్రపంచకప్‌, ఒలింపిక్‌ గోల్డ్‌, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్‌ అందుకున్న ఏకైక కెప్టెన్‌.
  7. అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు (11) పొందిన ఆటగాడు.
  8. కెప్టెన్‌గా అత్యధిక ప్రపంచకప్‌ 2022 మ్యాచ్‌లు (19) ఆడిన ప్లేయర్‌.
  9. 2022 సీజన్‌లో 29 మ్యాచుల్లో మెస్సీ 24 గోల్స్‌, 23సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లను అందుకొన్నాడు.
fifa world cup

 

  • ఫిఫా కప్పు కథ..

ప్రపంచకప్‌ విజేతలకు ఇచ్చే కప్పును మొదట జూల్స్‌ రిమెట్‌ ట్రోఫీగా పిలిచేవాళ్లు. ప్రపంచకప్‌కు పునాది వేసిన మాజీ ఫిఫా అధ్యక్షుడైన రిమెట్‌ గుర్తుగా ఆ పేరు పెట్టారు. 1930 నుంచి 1970 వరకు 3.8 కిలోల బరువుతో, బంగారు పూతతో ఉండే ఆ ట్రోఫీని విజేతలకు ఇచ్చేవాళ్లు. అప్పటి నిబంధనల ప్రకారం మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్లే ఈ అసలైన ట్రోఫీని తమతో ఉంచుకునే అవకాశం ఉండేది. అలా 1970లో మూడోసారి విజేతగా నిలిచిన బ్రెజిల్‌ దీన్ని దక్కించుకుంది. కానీ 1983లో రియో డి జెనీరోలోని బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి దీన్ని దొంగిలించారు. ఇప్పటివరకూ దీన్ని గుర్తించలేకపోయారు. ఆ దుండగులు ట్రోఫీని కరిగించి, బంగారాన్ని అమ్మేసుకున్నారని అంతా నమ్ముతున్నారు. దాని కిందిభాగం మాత్రమే దొరికింది. ఇప్పుడది జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రపంచకప్‌ మ్యూజియంలో ఉంది. అంతకంటే ముందే 1966లోనూ ఆ కప్పు దొంగతానానికి గురైనా, వారం రోజుల్లో తిరిగి గుర్తించారు.
1974 నుంచి రిమెట్‌ ట్రోఫీ స్థానంలో ఫిఫా ప్రపంచకప్‌ను విజేతలకు అందిస్తున్నారు. సిల్వియో గజానిగా తీర్చిదిద్దిన ఈ కప్పు బరువు 6.175 కిలోలు. దీన్ని 4,927 గ్రాములు స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశారు. భద్రత కారణాల దృష్ట్యా విజేతలు ఈ ట్రోఫీని స్వదేశం తీసుకెళ్లడానికి వీల్లేదు. దీన్ని ఫిఫా ప్రపంచకప్‌ మ్యూజియంలోనే ఉంచుతున్నారు. దీని కింది భాగాన విజేత పేరును జత చేస్తారు. దీనికి బదులుగా బంగారుపూతతో కూడిన కాంస్య ప్రతిరూపాన్ని విజేతలకు అందిస్తున్నారు.

2


అవార్డులు...
టైటిల్‌ విజేత : అర్జెంటీనా
రన్నరప్‌ : ఫ్రాన్స్‌
గోల్డెన్‌ బూట్‌ : ఎంబపే(ఫ్రాన్స్‌) 8గోల్స్‌
గోల్డెన్‌ గ్లౌ : మార్టినెజ్‌(అర్జెంటీనా) 34సార్లు గోల్స్‌ నిలువరించాడు
బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌ : ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా) 21ఏళ్లు
గోల్డెన్‌ బాల్‌ : లియోనెల్‌ మెస్సీ (అర్జెంటీనా)

33
  • ఫిఫా ప్రపంచకప్‌ 2022 విశేషాలు..

నమోదైన గోల్స్‌ : 172
మొత్తం మ్యాచ్‌లు : 84
ఎల్లో కార్డులు : 217
రెడ్‌ కార్డులు : 3
అత్యధిక గోల్స్‌ : 16(ఫ్రాన్స్‌)
ఒక మ్యాచ్‌లో నమోదైన
అత్యధిక గోల్స్‌ : ఇంగ్లండ్‌-6, ఇరాన్‌-2
సెల్ఫ్‌ గోల్స్‌ : 2
హ్యాట్రిక్‌ గోల్స్‌ : 2 ఎంబపే(ఫ్రాన్స్‌), రామోస్‌ (పోర్చుగల్‌)

 

  • జట్లకు లభించిన ప్రైజ్‌ మనీ (భారత కరెన్సీలో)

విజేత : అర్జెంటీనా (రూ.347.26కోట్లు)
రన్నరప్‌ : ఫ్రాన్స్‌ (రూ.248.20కోట్లు)
మూడోస్థానం : క్రొయేషియా (రూ.223.38కోట్లు)
నాల్గోస్థానం : మొరాకో (రూ.206.83కోట్లు)
క్వార్టర్స్‌లో ఓడిన జట్లు(4) : రూ.140.64కోట్లు(ఒక్కో జట్టుకు) బ్రెజిల్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, ఇంగ్లండ్‌
ప్రి క్వార్టర్స్‌లో ఓడిన జట్లు(8) : రూ107.55కోట్లు(ఒక్కో జట్టుకు)అమెరికా, సెనెగల్‌, ఆస్ట్రేలియా, పోలండ్‌, స్పెయిన్‌, జపాన్‌, స్విట్జర్లాండ్‌, దక్షిణ కొరియా గ్రూప్‌దశలో నిష్క్రమించిన
ఒక్కో జట్టుకు(16) : రూ.74.46కోట్లు(ఒక్కో జట్టుకు) కతార్‌, ఈక్వెడార్‌, వేల్స్‌, ఇరాన్‌,మెక్సికో, సౌదీ అరేబియా, డెన్మార్క్‌, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా,సెర్బియా, కామెరూన్‌, ఘనా, ఉరుగ్వే.

32జట్లు అందుకున్న ప్రైజ్‌ మనీ  రూ.3,624కోట్లు

- పఠాన్‌ భాష
8919999289