
- నిరుపేద కుటుంబం వారిది. చదువు బతుకును బాగు చేస్తుందని మాత్రమే వారికి తెలుసు. కానీ చదివేది ఎలా? కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే నాన్న, మానసిక వైకల్యంతో బాధపడే అమ్మ వెరసి రెండుపూటలా తిండి దొరకడమే కష్టమైన కుటుంబం. చీకటైతే అందరిళ్లల్లో కరెంటు దీపాలు వెలిగినా, వారింట్లో గుడ్డి దీపమే కాంతిపుంజమయ్యేది. ఆ వెలుగులోనే భవిష్యత్తుకై బంగారు కలలు కన్నారు. ఆ దిశగా నేడు ఆ కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరూ, ఆ ఇంటి కోడలు ... ముగ్గురూ ఏకకాలంలో పిహెచ్‌డి సాధించారు. 'ఈ విజయం వెనుక వారి కష్టం ఎంతో వుంది' అని ఒక్క మాటలో చెప్పలేం. వారు ఎంతో శ్రమించారు. ఎన్నో అవమానాలు పడ్డారు. మంచానికే పరిమితమైన ఓ ప్రొఫెసరమ్మకు అన్ని సపర్యలూ చేస్తూ చదువులు సాగించారు. ఎట్టకేలకు డాక్టరేట్లు పొందారు. అర్హతకు తగిన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం గున్నెపల్లి గ్రామానికి చెందిన పాము సత్య వరప్రసాద్, పాము శాంతి (ప్రసాద్ భార్య), పాము ఆనంద్ ఇటీవల ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఒకేసారి డాక్టరేట్లు పొందారు. పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో శాంతి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో ప్రసాద్, ఆనంద్ పిహెచ్‌డీ చేశారు. ఇదంతా ఆషామాషీగా జరగలేదు. అనేక కష్టాలూ ఆకలి బాధలూ ఎదుర్కొని వారీ విజయం సాధించారు.
తన నేపథ్యం గురించి ప్రసాద్ ఇలా చెప్పారు : 'అక్క, తరువాత నేను పుట్టినప్పుడు అమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఎంతలా అంటే నన్ను కొడుకుగా గుర్తించలేకపోయేది. పాలు ఇచ్చేది కాదు. ప్రాణాలు నిలిపేందుకు గంజినీళ్లు పట్టేవాళ్లమని అమ్మమ్మ తరువాత నాతో చెప్పేది. నాన్నకు మా పోషణే చాలా భారంగా ఉండేది. అమ్మ ఆరోగ్యం దెబ్బతినడం నాన్నపై మరింత బాధ్యత పడింది. ఇటువంటి పరిస్థితుల్లో చదువుపై శ్రద్ధ పెట్టడం ఆషామాషీ కాదు. పదో తరగతిలో లెక్కలు, హిందీ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాను. నాతో పాటు ఫెయిలైన వారంతా కంపెనీల్లో పనులకు వెళ్లిపోయారు. నేను మాత్రం ఆ పరీక్షలు మళ్లీ కట్టి పాసయ్యాను. ఎలాగోలా ఊళ్లో ఉంటూనే ఇంటర్, డిగ్రీ పూర్తిచేశాను. ఇంకా చదువుకోవాలని ఆశ. కానీ మార్గం కనిపించలేదు'.
- మలమూత్రాదులు ఎత్తి ...
ఆ సమయంలో నా గురించి బాగా తెలిసిన మా ఊరి ప్రొఫెసర్ వాళ్లింటికి నన్ను పిలిచారు. ఆయన భార్య కూడా ప్రొఫెసర్. 'అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితమైన ఆమె చక్రాల కుర్చీలోనే యూనివర్శిటీకీ హాజరయ్యేవారు. ఇంటి దగ్గర ఆమె ఆలనా పాలనా చూసుకోవడం మాస్టారికి చాలా ఇబ్బంది అయ్యేది. వారికి మేము దూరపు బంధువులం. 'మేడమ్ బాగోగులు పట్టించుకుంటూ, నీ ఉన్నత చదువులు పూర్తిచేసుకోవచ్చు. మా ఇంటికి వచ్చేరు' అని ఆయన అన్నారు. ఆ మాటకు చాలా సంతోషించా ను. అక్కడికి వెళ్లాక మేడమ్‌కి అన్నం తినిపించడం దగ్గర నుంచి మలమూత్రాదులకు కూర్చోబెట్టడం, ఎత్తి పారేయడం వంటి వన్నీ చేయాల్సి వచ్చేది. ఆమెను నా తల్లిగా భావించి అన్నీ చేశాను. ఎంబిఎ, ఎంఫిల్ అక్కడే పూర్తిచేశాను. తమ్ముడు ఆనంద్ మాత్రం మొన్నమొన్నటి వరకు అంటే పిహెచ్‌డి చేసేటప్పుడు కూడా మేడమ్‌కి సపర్యలు చేశాడు.
'ఉన్నత విద్య చదువుకుంటూ మీరేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు. జీతం ఇస్తే చాలామంది పనివారు దొరుకుతారు. చదువు సాకు పెట్టి మీతో ఊరికినే చాకిరీ చేయించుకుంటున్నారు. మీ అవసరం తీరిపోయాక మిమ్మల్ని బయటికి గెంటేస్తారు' అంటూ మా చుట్టూ ఉన్నవాళ్లు అనేవారు. మేము అవేమీ పట్టించుకోలేదు. పేద కుటుంబంలో పుట్టిన మాకు చదువుకునే మార్గం చూపించిన మాస్టారంటే మాకు ఎప్పుడూ గౌరవం ఉండేది. మేడమ్ మా పట్ల ఎంతో ఆప్యాయత చూపించేవారు' అని ప్రసాద్ వివరించారు.

- జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ...
ప్రొఫెసర్ ఇంట్లో పనిచేస్తున్న ప్రసాద్‌ని అక్కడే మేడమ్ దగ్గర క్లాసులకు హాజరయ్యే శాంతి చాలాసార్లు చూశారు. 'మగ మనిషి ఒక మహిళకు ఇలాంటి సేవలు చేస్తున్నాడేంటి అని చాలా ఆశ్చర్యపోయేదాన్ని. ఉండబట్టలేక ఒకసారి అడిగేశాను. 'ఆమెలో నాకు నా తల్లి కనపడుతోంది. తనకే ఇటువంటి పరిస్థితి వస్తే వదిలేయను కదా!' అని ఆయన సమాధానం ఇచ్చాడు. దాంతో తనపై గౌరవం పెరిగింది' అని చెప్పారు శాంతి. తరువాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులు, భార్యాభర్తలూ అయ్యారు. పీజీ పూర్తి చేసిన శాంతి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. భర్త ప్రసాద్ పిహెచ్‌డికి సిద్ధమవ్వడంతో తను కూడా ఉద్యోగాన్ని విడిచిపెట్టి 2013లో పిహెచ్‌డి అడ్మిషన్ పొందారు. తమ ప్రతిభతో రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌కి ఎంపికై నామమాత్రపు ఉపకార వేతనంతోనే 2018 నాటికి పరిశోధన పూర్తి చేశారు.
- మహిళా పోలీసుగా ఆదర్శ సేవలు
పిహెచ్‌డి పూర్తి చేసిన శాంతి గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ, రాష్ట్రప్రభుత్వ సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకుని అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి ప్రాంత మహిళా పోలీసుగా నియమితులయ్యారు. సారా బట్టీల ధ్వంసం, స్కూలు డ్రాపౌట్లను బడికి పంపించడం, గర్భిణీలను సకాలంలో ఆస్పత్రికి చేరవేయడం వంటి ఎన్నో విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. 'నా లక్ష్యం ప్రొఫెసర్ అవ్వడం. అందుకే సమయం చేసుకుని మరీ పిహెచ్‌డీ చేశాను. ఉద్యోగంలో ఉండగానే వైవాకి పిలిచారు. అప్పుడు 'పిహెచ్‌డీ చేసేవాళ్లు పోలీసు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు?' అని కొందరు హేళన చేశారు. ఈ ఉద్యోగం నా కుటుంబాన్ని నడిపిస్తుంది. నాకు లేని ఇబ్బంది మీకెందుకు? అని వారితో వాదించాను. మాలాంటి వాళ్లు చదువుకోవడమే కొంతమందికి గిట్టదు. అవకాశం ఉన్న ప్రతిచోటా మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తారు. వాటన్నింటికీ భయపడితే ఈరోజు ఇంత ఉన్నత స్థానం దక్కేది కాదు' అని శాంతి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌గా పని చేయడమే తన చిరకాల కల అని ఆమె అంటున్నారు.
- ఉన్నత విద్య చదివినా ఉపాధి లేదు
'బాగా చదువుకోవాలని ఎంతో కష్టపడ్డాను. మేడమ్‌కి సేవ చేస్తూ పదేళ్ల పాటు అక్కడే ఉండిపోయాను. చదువులో ఆమె ఎన్నో సూచనలు ఇచ్చేవారు. పిహెచ్‌డి పూర్తి చేయడంలో గైడ్ జాలాది రవి మా ముగ్గురిని ఎంతో ప్రోత్సహించారు. 2020 నాటికి పిహెచ్‌డి సమర్పించాను. 2022 డిసెంబరు 22న పిహెచ్‌డి అవార్డు వచ్చింది. అన్నయ్య, వదిన అంతకు ముందే పిహెచ్‌డి చేసినా కరోనా వల్ల అవార్డు ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు ముగ్గురం ఒకేసారి పట్టా తీసుకున్నాం.' అని ఆనంద్ చెప్పారు.
'పిహెచ్‌డి పట్టాతో కాలేజీలకు వెళితే.. 'రూ.5 వేలు జీతం ఇస్తామన్నారు. చాలా బాధేసింది. తిరిగి ఊరు వచ్చేశాను. వ్యవసాయ కూలీగా పొలంలో అన్ని పనులూ చేసేవాడ్ని. డ్రైవరుగా వెళ్లేవాడ్ని. ఉపాధి పనులకు వెళ్లాను. పిహెచ్‌డీ చేసి ఈ పనులు చేయాల్సివచ్చిందని చాలాసార్లు బాధేసింది. ఈ రోజుల్లో విద్యకు తగ్గ ఉపాధి దొరకడం లేదు. ఇప్పుడు కూడా భద్రత లేని గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నాను' అంటూ ఆనంద్ చెబుతున్నప్పుడు ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది.
ఈ ముగ్గురూ పేదింట్లో పుట్టి పిహెచ్‌డీలు చేసి బంగారు భవిష్యత్తుకై ఎన్నో కలలు కంటున్నారు. వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం.
- జ్యోతిర్మయి