May 27,2023 13:29

బెంగళూరు : కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నవారిలో.. ఎమ్మెల్యేలుగా ఉన్న హెచ్‌ కె పాటిల్‌, కృష్ణ బైరెగౌడ, ఎన్‌. చెలువరాయస్వామి, కె. వెంకటేష్‌, హెచ్‌సి మహదేవప్ప, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌ ఖండ్రే, రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దినేష్‌ గుండురావు ఉన్నారు. అలాగే క్యాతసాండ్ర ఎన్‌ రాజన్న, శరణబసప్ప దర్శనాపూర్‌, శివానంద్‌ పాటిల్‌, రామప్ప, బాలప్ప తిమ్మాపూర్‌, ఎస్‌.ఎస్‌ మల్లికార్జున్‌, శివరాజ్‌ సంగప్ప తంగడగి, శరణప్రకాష్‌ రుద్రప్ప పాటిల్‌, మంకాల్‌ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్‌, రహీం ఖాన్‌, డి సుధాకర్‌, సంతోష్‌ లాడ్‌, ఎన్‌.ఎస్‌ బోసేరాజు, సురేష్‌ బి ఎస్‌, మధు బంగారప్ప, ఎం.సి సుధాకర్‌, బి. నాగేంద్రలు మంత్రులుగా నేడు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు తరలివస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజ్‌భవన్‌ చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
అసెంబ్లీ ఫలితాల అనంతరం తర్జనభర్జనల తర్వాత తర్వాత సీనియర్‌ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సిఎంగా డికె శివకుమార్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. మే 20వ తేదీన సిద్ధరామయ్య, శివకుమార్‌తో సహా పది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా 24 మంది మంత్రులతో కలిపి మొత్తం 34 మంత్రులుగా సిద్ధరామయ్య ప్రభుత్వంలో కొనసాగనున్నారు.