ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఎస్సై మెయిన్ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు నెలలు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్సై పోస్టుల అభ్యర్థులు శనివారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 550 మంది అభ్యర్థులు పాల్గన్నారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష పై ఉన్న కోర్టు కేసులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎత్తు, కొలతలలో తేడాలను సవరించి మళ్లీ కొలవాలని కోరారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాలో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. పోలీస్ అధికారులు సైతం నిరుద్యోగుల్లో గందరగోళానికి కారణం అవుతున్నారని విమర్శించారు. ఫిజికల్ ఈవెంట్స్ మొయిన్ పరీక్షలకు ఎంత సమయం వ్యవధి ఉండాలో కూడా ప్రభుత్వానికి, ఉన్నత పోలీస్ అధికారులకు తెలియకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. ఎస్సై అభ్యర్థులకు మొయిన్ పరీక్షను కనీసం 2నెలలు పాటు వాయిదా వేయాలని లేని పక్షంలో 30వేల మంది అభ్యర్థులతో కలిసి డిజిపి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఎపి ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధికి మాట్లాడుతూ ... సిలబస్ విస్తఅతి రీత్యా కనీసం 2 నెలలు అయినా గడువు పెంచాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షల్లో 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారన్నారు. వారి సమస్యలను పరిష్కరించి వారి సందేహాలను నివఅత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డివైఎఫ్‌ఐ నాయకులు టి.రాజా, విజరు కుమార్, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.










