జైపూర్ : లంచం తీసుకుంటూ ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు పట్టుబడ్డారు. గురువారం రాజస్తాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఈడి అధికారులు లంచం సోమ్ము తీసుకుంటుండగా పట్టుబడినట్లు రాజస్తాన్ అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) ఓ ప్రకటనలో తెలిపింది. చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు వారు రూ. 15 లక్షలు అడిగినట్లు అధికారులు తెలిపారు. వారి కార్యాలయాల్లోనూ సోదాలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ ను ఈడి మూడు రోజుల క్రితం విచారించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నలు కురిపించింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలరోజుల ముందు ఈడి విచారణపై అశోక్ గెహ్లాట్ ద్వజమెత్తారు. ఈ చర్యను రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.