
- పోరాట కమిటీ ధర్నాలో వక్తల డిమాండ్
- ఈ నెల 17 నుంచి 30 వరకు విస్తృత ఉద్యమం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌సి-1998లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 1998 డిఎస్‌సిలో మిగిలిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాట కమిటీ ఆధ్వర్యాన బుధవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 20 వరకూ ప్రతి అభ్యర్థి సిఎం, విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు పోస్టుకార్డులు రాయాలని నిర్ణయించారు. 25న భిక్షాటన, 30న రాస్తారోకోలు జరపాలని నిర్ణయించారు. అనంతరం పోరాట కమిటీ నాయకులు పొదిలి రమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. 25 ఏళ్ల నిరీక్షణ అనంతరం అందరికీ ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు ఆశపడ్డారన్నారు. 2022 జులైలో ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉన్న అభ్యర్థులు తమ అనుమతి తెలపాలని ప్రభుత్వం కోరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 6,754 మంది ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేయించుకున్నారని పేర్కొన్నారు. వీరందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, 4,072 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల ఎస్‌సి, బిసి వికలాంగుల అభ్యర్థులైన 2,326 మందికి అన్యాయం జరిగిందని వివరించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఉద్యోగాలు రాని వారిలో బిసిలు 1,021 మంది, ఎస్‌సిలు 652 మంది, ఒసిలు 653 మంది ఉన్నారని, వారికి అవకాశం కల్పిస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని తెలిపారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. యుటిఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఒకపక్క ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదని తెలిపారు. నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలలను కలిపి విద్యావ్యవస్థను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 1998 డిఎస్‌సి అభ్యర్థులు చేసే పోరాటానికి ఎస్‌ఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని అన్నారు. ప్రొఫెషనల్ ఫోరం నాయకులు నేతి మహేశ్వరరావు, అడ్వకేట్ సుదర్శనరావు, ఎస్‌సి, ఎస్‌టి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు, డేవిడ్ రెల్లి సంఘం నాయకులు నాగేంద్ర, ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు సుందరయ్య తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు శ్రీనివాసులు, మోహనరావు, రమేష్, మేరీ సుహాసిని, కోమలి, ఆదాం తదితరులు పాల్గొన్నారు.