Jul 03,2023 22:51

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : 108 సేవలకు ఉపయోగించే అంబులెన్స్‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలకు వినియోగించేందుకు 146 అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొనుగోలు చేసింది. వీటిని తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి పచ్చజెండా ఊపి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన వీటిలోని వైద్య పరికరాలను, సౌకర్యాలను పరిశీలించారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా గతంలో ఉన్న 108 వాహనాల్లో పాడైన వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు విడదల రజిని, కె.వి.ఉషశ్రీ చరణ్‌, దాడిశెట్టి రాజా, బాపట్ల ఎంపి నందిగం సురేష్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, కల్పలతా రెడ్డి, రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సిఎస్‌ ఎంటి.కృష్ణబాబు, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్‌, మహమ్మద్‌ ముస్తాఫా, అన్నా బత్తుని శివకుమార్‌, నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగ మనోహరనాయుడు తదితరులు హాజరయ్యారు.