'విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఆపేస్తున్నాం.' అని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుందని వెయ్యి రోజులకు ముందే విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ సమక్షంలో ప్రకటించాము. పెద్ద దీక్షా శిబిరం వేస్తున్నారని కొందరు ఆశ్చర్యపోయారు. పోరాట కమిటీ లోని కొంత మంది సభ్యులతో సహా ఎంత కాలం కొనసాగించగలం? అని ఆనాడు అనుమానాలు వచ్చాయి. గుర్తింపు సంఘంలో వున్న సిఐటియు పోరాటాలపై అకుంఠిత విశ్వాసం గల సంస్థ. అందువల్లనే ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు సిఐటియు నాయకత్వం స్పష్టంగా ప్రకటించింది. వెయ్యి రోజులైనా చెక్కు చెదరకుండా ఈ ఉద్యమం సాగడానికి కారణం ఏమిటి? 32 మంది ప్రాణాల బలిదానంతో విశాఖ స్టీల్ ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులదే కీలక పాత్ర. 52 మంది కమ్యూనిష్టు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామ చేశారు. 68 గ్రామాలలో నివసించే ప్రజలు ఇళ్ళను, 20 వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి కార్మికులు ఉత్పత్తి పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేవలం రూ. 5 వేల కోట్ల లోపే పెట్టుబడి పెట్టింది. కానీ ఈనాడు స్టీల్‌ప్లాంట్ విలువ 3 లక్ష కోట్లకు పైగా పెరిగింది. దీనిని కాపాడుకోవడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు, పరిసరప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజల మద్దతుతో అకుంఠిత దీక్షతో నిలబడ్డారు. పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లతో ఐక్యత సాధించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నవంబరు 8వ తేదీ నాటికి పోరాటం ప్రారంభించి వెయ్యి రోజులు అయ్యింది. ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా కూర్మనపాలెం జాతీయ రహదారి దిగ్బంధనం జరుగుతుంది.
బిజెపి కేంద్ర ప్రభుత్వం 27.1.2021న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నూరు శాతం అమ్మివేస్తామని ప్రకటించారు. దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో కంపెనీకి అమ్మి కమీషన్ కొట్టేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పథకం వేశాయి. పోరాట కమిటీ ఆధ్వర్యంలో అమ్మకానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలిగాము. నూరు శాతం అమ్మకం జరగాలంటే మొదట విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన అన్ని ఆస్తుల విలువ లెక్కలు కట్టాలి. ప్లాంట్‌లోని యంత్రాలు, భవనాలు, సామానులు, టౌన్‌షిప్, దేశంలోని అన్ని మార్కెట్ యార్డ్‌లు, దానిలో స్టీల్, మాదారం, జగ్గయ్యపేట గనులతో సహా అన్ని ఆస్తులకు విలువ కట్టాలి. విలువ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది. ఈ కమిటీలు ప్రత్యక్షంగా ప్రతి ఆస్తిని పరిశీలించి లెక్కలు వేయాలి. రెండేళ్ళ క్రితం ఈ కమిటీ హెలికాప్టర్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ వద్ద దిగబోతున్నదని సమాచారం రావడంతో వేలాది మంది స్టీల్‌ప్లాంట్ కార్మికులు అక్కడికి చేరారు. హెలికాప్టర్ వెనక్కి వెళ్ళింది. తిరిగి రాలేదు. విలువ కట్టిన తరువాత రెండవ దశ ఉంటుంది. విలువ ఆధారంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనడానికి ఆసక్తి వున్నవారు ముందుకు రావాలని రెండు నెలల ముందు పత్రికా ప్రకటన చేయాలి. విలువ కట్టలేదు కాబట్టి ఈ ప్రకటన రాలేదు. మూడవ దశ బిడ్డింగ్ (అమ్మకం). అమ్మకం షరతులు ఉంటాయి. మొదటి, రెండు దశలు కాలేదు కాబట్టి మూడవ దశ ప్రసక్తే రాలేదు.
విశాఖ స్టీల్ ఆమ్మకం సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వానికి తత్వం బోధపడింది. అందువల్ల సంవత్సరం నుంచి విశాఖ స్టీల్‌ను దెబ్బ తీయడానికి బిజెపి ప్రభుత్వం దొడ్డిదార్లు వెతుకుతున్నది. 2021-22లో విశాఖ స్టీల్‌కు నికర లాభాలు రూ. 940 కోట్లు వచ్చాయి. తరువాత సంవత్సరం ముడిసరుకు కొనడానికి ఆ డబ్బులు వుంచకుండా బ్యాంకులకు అప్పులు చెల్లించారు. ముడి సరుకులు కొనడానికి డబ్బులు లేవనే వంకతో విశాఖ స్టీల్ ఉత్పత్తి 40 శాతం తగ్గించారు. దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్లకు లాభాలు వచ్చాయి. విశాఖ స్టీల్‌కు రూ. 3900 కోట్లు నష్టాలు వచ్చాయి. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు స్వంత గనులున్నాయి. విశాఖ స్టీల్‌కు 40 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా స్వంత గనులు ఇవ్వడానికి కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు నిరాకరించాయి. ఈ ప్లాంట్ ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యను పరిష్కరించకుండా ప్లాంట్‌ను నిలువునా నాశనం చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఈ విషయాలను పక్కదారి పట్టించడానికి బిజెపి యం.పి. జి.వి.ఎల్ నరసింహారావు ''విశాఖ స్టీల్''ను ప్రైవేట్ చేయడం లేదని, పూర్వ వైభవం తెస్తామని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు మూసివేసిన బ్లాస్ట్ ఫర్నేస్-3ను జిందాల్ కంపెనీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖ రాశారు. బిఎఫ్-3ను జిందాల్‌కు అప్పగించడం అంటే దొడ్డి దారిన విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌కు అప్పగించడమే. పోరాట కమిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంలో కేంద్ర ప్రభుత్వం వెనుక్కు తగ్గింది. ఇవి బిజెపి మోసపూరిత ప్రకటనలు. బిజెపి మోసాలను ప్రజలకు వివరించడం మన కర్తవ్యం. ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టి, కుల చిచ్చులు పెట్టి పాలించాలని బిజెపి భావిస్తున్నది.
ఈ వెయ్యిరోజుల పోరాటంలో రాష్ట్ర ప్రజలు, వివిధ సంఘాలు, సంస్ధలు విశాఖ స్టీల్‌కు అపూర్వ మద్దతు పలికాయి. కానీ ప్రధాన రాజకీయపార్టీలు నాటకాలాడాయి. బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలనే నిర్ణయం దుర్మార్గం. రాష్ట్రంలోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేన పార్టీలు విశాఖ స్టీల్ ఉద్యమానికి పైకి మద్దతు ఇస్తునే డ్రామాలు ఆడారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ చేస్తారా అని ప్రశ్నించడం, బిజెపి మంత్రులు విశాఖ స్టీల్ ను ప్రైవేట్ చేసి తీరుతామని ప్రకటించడం దొంగనాటకం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వంతగనులు ఎందుకివ్వరు? అని ఒక్క రోజైనా పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలు బిజెపిని ప్రశ్నించారా? బిజెపి ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలు మద్దతు ఇచ్చాయి. మా పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతుతో, కార్మికుల పట్టుదలతో ఈ ఉద్యమం ఎంతకాలమైనా సాగుతుందని విశ్వాసం కలిగింది. కమ్యూనిస్టులు ఒక్కరే 1966 ''విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు'' ఉద్యమం నుండి నేటి వరకు నికరంగా, నిజాయితీగా విశాఖ స్టీల్ పక్షాన నిలబడ్డారు. బిజెపి ప్రైవేటీకరణ విధానాలను ఓడించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు రైల్వే, విద్యుత్, ఆయిల్ రంగం, బ్యాంక్, ఇన్య్సూరెన్స్‌తో సహా అన్ని రంగాలను కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు మేనేజర్లు మాత్రమే. ప్రభుత్వ రంగం అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తులను అమ్మే అధికారం వీరికి ఎవరిచ్చారు? ప్రభుత్వ రంగ పరిశ్రమలంటే వీరి తాత ముల్లె కాదు.
విశాఖ స్టీల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ లోని ఒక మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ''నగర్‌నార్'' స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బిడ్డింగ్ కూడా పూర్తయింది. జిందాల్ స్టీల్ బిడ్డింగ్‌లో నెం.1గా వచ్చింది. ఈ లోగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నగర్‌నార్ స్టీల్‌ప్లాంట్‌ను దేశానికి అంకితం చేయడానికి వచ్చిన రోజే సెప్టెంబరు 2023లో ఛత్తీస్‌గఢ్ లోని బిజెపి ఏతర రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తోకముడిచి నగర్‌నార్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ చేయటం లేదని అమిత్‌షా రాయిపూర్ వచ్చి ప్రకటించారు. పోరాడితేనే ప్రభుత్వరంగ పరిశ్రమలు కాపాడుకోగలమని నగర్‌నార్, విశాఖ స్టీల్‌ప్లాంట్లు రుజువు చేశాయి. గతంలో సేలం, దుర్గాపూర్ (ఎల్లాయి) స్టీల్‌ప్లాంట్ల అమ్మకాలను పోరాటం ద్వారానే ఆపగలిగాం. పోరాటంతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోగలం. ఈ పోరాటాలను యావత్ కార్మికవర్గం మరింత ఉధృతం చేయాలని కోరుతున్నాం.
/వ్యాసకర్త విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్/
సిహెచ్. నర్సింగరావు