Jul 26,2023 16:35

హైదరాబాద్‌: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అత్యవసర పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్‌ సమర్పించినందుకు శిక్షగా ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది. దీంతోపాటు పిటిషనర్‌ జలగం వెంకట్రావు కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. జలగం వెంకట్రావు 2018 డిసెంబరు 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు (అనంతర కాలంలో ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు) ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ టిఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జి.రాధారాణి సుదీర్ఘ విచారణ చేపట్టి మంగళవారం 84 పేజీల తీర్పును వెలువరించారు. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను జలగం వెంకట్రావు బుధవారం కలిశారు. వనమా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను ఆయనకు అందజేశారు.