Jul 29,2023 22:01

ప్రజాశక్తి- అనకాపల్లి :బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డి.పురంధరేశ్వరి విశాఖ పర్యటనలో భాగంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంపై మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం అమ్మకంపై ఏది లాభం అయితే అది చేస్తామని అనడాన్ని సిపిఎం ఒక ప్రకటనలో ఖండించింది. ఇప్పటికే ఒక పక్క స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తామని పదేపదే కేంద్రంలోని బిజెపి మంత్రులు ప్రకటిస్తుంటే, వాటిని ఖండించి స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు పోరాడాల్సిన రాష్ట్ర బిజెపి నేతలు ఈ విధంగా మాట్లాడడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా ప్రయివేటీకరించి తీరుతామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెగేసి చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. అదానీతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుమ్మకై స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు సృష్టిస్తోందని తెలిపారు. గంగవరం పోర్టులోకి స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన కొకింగ్‌ కోల్‌ను దిగుమతి అవ్వకుండా చేయడం, దిగుమతి అయిన బగ్గును రకరకాల కారణాలు చూపి సకాలంలో ప్లాంట్‌కు చేరకుండా ఆటంకాలు కల్పించడం వంటి ఘటనలను లోకనాథం గుర్తు చేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమని విమర్శించారు. విశాఖలోని విషయాలపై అవగాహన ఉండి ఈ విధంగా పురంధరేశ్వరి మాట్లాడం అన్యాయమని పేర్కొన్నారు. కీర్తిశేషులు ఎన్‌టి.రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పరితపించారని, ఆయన స్ఫూర్తితో ఆంధ్రుల పక్షాన ఉండాల్సిన ఆమె ఇలా వ్యవహరించడం అంటే తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విశాఖ వాసులకు ద్రోహం చేయడమే అవుతుందని తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా విశాఖ రైల్వే గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధాని, బిజెపి నేతలు మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారని, నేటికీ జోన్‌ వచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ దానికి నిధులు ఇవ్వకుండా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు.