
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : భజనలు, కోలాటాలతో భక్తి శ్రద్ధలతో గణనాథుడిని సాగనంపే సంప్రదాయం వదిలి డిజేలు, మద్యం మత్తులో అసభ్య నృత్యాలు నడుమ పార్వతీ తనయుడిని సాగనంపుతూ అటు వినాయక వ్రత విశిష్టతను అపహాస్యం చేయడమే గాక నిమజ్జనోత్సవం లో అత్యుత్సాహంతో చేసే కొన్ని రకాల విన్యాసాలతో చివరికి జీవితాలే కోల్పోతున్నారు. ఇదే తరహా లోనే గత నెల 22వ తేదీన రాజంపేట పట్టణంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో మన్నూరుకు చెందిన కిరణ్, అలియాస్ మరాఠీ (30) ఆనందోత్సాహాలతో గణేషున్ని సాగనంపుతూ పాత బస్టాండ్ కూడలిలో అత్యుత్సాహంతో ట్రాక్టర్ బంపర్ పైనుంచి ఫల్టీ వేయడంతో అదుపుతప్పి సరిగ్గా తలభాగం నేలను తాకడంతో స్పృహ తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లి గత 20 రోజులుగా చికిత్స పొందుతూ చివరికి బుధవారం మన్నూరులోనే తన నివాసం వద్ద మృత్యు ఒడికి చేరుకున్నాడు. అత్యుత్సాహంతో తన చేతులారా నిండు జీవితానికి ముగింపు పలుకుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలిసిన పుర ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పోతూ పోతూ కిరణ్ నేటి యువతకు గొప్ప సందేశం ఇచ్చాడని, ఇకనైనా ఆర్భాటాలు వదిలి భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.