న్యూఢిల్లీ : పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా వర్దమాన దేశాలు చేపట్టే పోరాటంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడు అజయ్ బంగా పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాకు మొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై మాట్లాడుతూ... వాతావరణ మార్పులపై పోరాటమే భవిష్యత్తులో తమ భాగమని ప్రైవేట్ రంగం భావించేలా ఓ మార్గాన్ని ప్రతిపాదించడమే మన ముందున్న ఏకైక కర్తవ్యమని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ అవసరాలను తీర్చడానికి కేవలం స్వచ్ఛంద సేవా సంస్థలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (ఎండిబి) సరిపోవని అన్నారు. ఎండిబి వ్యవస్థలో భిన్న మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ నెల 2వ తేదీన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ 14 వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.










