Sep 26,2023 15:44

న్యూఢిల్లీ :   ఆధార్‌ వ్యవస్థపై ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ విడుదల చేసిన నివేదికను కేంద్రం సోమవారం తోసిపుచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆధార్‌పై ప్రశంసలు కురిపించాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇటువంటి గుర్తింపు వ్యవస్థను ఎలా అమలు చేయాలో తెలుసుకునేందుకు పలు దేశాలు ఉడాయ్ ని  సంప్రదిస్తున్నాయని తెలిపింది.  ఆధార్‌ వ్యవస్థను నిర్వహిస్తున్న ఉడాయ్  కూడా మూడీస్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మూడీస్‌ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ప్రాథమిక, లేదా సెకండరీ సమాచారం లేదా అధ్యయనాలను ప్రస్తావించలేదు. ఉడాయ్ కి  సంబంధించి లేవనెత్తిన సమస్యలకు సంబంధించి వాస్తవాలను నిర్థారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఉడారు, ఆ వెబ్‌సైట్‌ పనిచేసే విధానంపై మాత్రమే మూడీస్‌ కేవలం అనుమానం వ్యక్తం చేసిందని పేర్కొంది.

ఆధార్‌ బయోమెట్రిక్‌ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్‌ అథెంటికేషన్‌, ఐరిస్‌ అథెంటికేషన్‌ వంటి కాంటాక్ట్‌లెస్‌ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్‌ విస్మరించిందని ఉడాయ్  తన ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు.. చాలా కేసుల్లో మొబైల్‌ ఒటిపిని వినియోగించుకునే సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. సెంట్రలైజ్డ్‌ ఆధార్‌ వ్యవస్థలో భద్రతా, గోప్యతా ముప్పు పొంచి ఉందని నివేదికలో వాదించిందని కానీ, ఆధార్‌ డేటాబేస్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్‌ ముందు నివేదించామని ఉడాయ్  వివరించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ఐడి ప్రోగ్రామ్‌ అధార్‌ అని మూడీస్‌ పేర్కొంది. ఆధార్‌ వ్యవస్థపై ‘డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డిజిటల్‌ అసెట్స్‌’  పేరుతో సోమవారం ఓ నివేదిను విడుదల చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని వినియోగించడం విశ్వసనీయం కాదని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా అంత్యంత తేమ, వేడి వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్‌ను వినియోగించడం అంత విశ్వసనీయం కాదని మూడీస్‌ పేర్కొంది. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై ఈ వ్యాఖ్యలు చేసింది.