న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్ ) సిఇఒ అమిత్ అగర్వాల్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. కేబినెట్ నియామకాల కమిటీ అమిత్ అగర్వాల్ పదవీకాలం పెంపునకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను విడుదల చేసింది. వచ్చే ఏడాది నవంబర్ 2 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన సిఇఒగా కొనసాగుతారని తెలిపింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 2తో ముగియనున్న సంగతి తెలిసిందే.
అమిత్ అగర్వాల్ 1993 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఐటి మరియు ఇ-గవర్నెన్స్ రంగంలో నిపుణుడిగా ప్రసిద్ధి చెందిన అగర్వాల్ కాన్పూర్ ఐఐటి నుండి పట్టభద్రుడయ్యాడు. గతంలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కీలకశాఖల్లో సేవలందించారు. టెక్నాలజీ, ఫైనాన్స్, ఇన్నోవేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగాల్లోనూ పని చేశారు.
ఉడాయ్ అనేది ఆధార్ చట్టం ప్రకారం 2016లో స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది 2009నుండి ప్రణాళికా సంఘం కింద అటాచ్డ్ కార్యాలయంగా పనిచేస్తోంది. భారత పౌరులకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను ఇవ్వడం, నెంబర్‌లను ప్రాసెస్ చేయడం, నిర్వహించడం, ఇతర భాగస్వామి సంస్థలతో అనుసంధానిస్తుంటుంది.